నగరాలను అభివృద్ధి చేద్దాం రండి
చైనా ఇన్‌ఫ్రా కంపెనీలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి
* ముఖ్యమంత్రితో సమావేశమైన చైనా కంపెనీల బృందం
* రోడ్లు, బ్రిడ్జీలు, సస్పెన్షన్ బ్రిడ్జీల నిర్మాణానికి సంసిద్ధత
సాక్షి,హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని 68 నగరాలు, పట్టణాల్లో ఫ్లై ఓవర్లు, రహదారులు, స్కైవేలు, మురుగు ప్రవాహ వ్యవస్థలు, తాగునీటి సరఫరా, గృహ నిర్మాణం తదితర అంశాల్లో శాస్త్రీయ పద్ధతిలో అభివృద్ధి సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.
రాష్ట్రంలోని నగరాల్లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించే బృహత్తర కార్యంలో భాగస్వామ్యం కావాలని చైనా కంపెనీలను కోరారు. చైనాలోని బీజింగ్, షాంఘై, దాలియన్, సుజో, గాజో తదితర నగరాల ప్లాన్లను రూపొందించిన కన్సల్టెన్సీల సహకారంతో రాష్ట్రంలోని నగరాల అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. చైనాకు చెందిన అంజు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెరైక్టర్లు యోగేష్ వా, మనోజ్ గాంధీ, రాడిక్ కన్సల్టెంట్స్ చైర్మన్ రాజ్‌కుమార్, బ్రిడ్జీ డిజైనింగ్ విభాగాధిపతి బీపీ సింగ్ తదితరులు బుధవారం ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో కలిశారు.
నగరాల అభివృద్ధిలో భాగస్వామ్యం వహించేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్, ఇతర నగరాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. రహదారులు, బ్రిడ్జీలు, సస్పెన్షన్ బ్రిడ్జీల నిర్మాణంపై సంసిద్ధత వ్యక్తం చేశారు.
ఇవీ అభివృద్ధి ప్రణాళికలు..
హైదరాబాద్‌లో చేపట్టిన స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రణాళికలను సీఎం.. చైనా ప్రతిని ధులకు వివరించారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం-మంచిర్యాల కార్పొరేషన్లలో కూడా అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించామన్నారు. హైదరాబాద్‌లోని రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు శరవేగంగా విస్తరిస్తున్న నగర అవసరాలకు తగ్గట్లు ప్రణాళిక సిద్ధం చేసి రహదారులు, వంతెనలు నిర్మించాల్సి ఉందన్నారు.
ఇప్పటికే స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్‌మెంట్ కార్యక్రమంతో పాటు, మూసీ నదిపై తూర్పు నుంచి పడమరకు 42 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల రహదారిని నిర్మించే ప్రణాళికను వివరించారు. వరంగల్, నల్లగొండ, కరీంనగర్ తదితర హైవేలకు అనుబంధంగా ఎక్స్‌ప్రెస్ ఎలివేటెడ్ హైవేలు నిర్మించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. దుర్గం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, గోదావరిఖని కార్పొరేషన్ల పరిధిలో రింగ్ రోడ్లు, అంతర్గత రోడ్లు, వంతెనలు నిర్మిస్తామన్నారు.
గోదావరి నదిపై మూడు చోట్ల పెద్ద వంతెనలు నిర్మిస్తామన్నారు. 50 కి.మీ. దూరంలో ఉన్న తూప్రాన్, గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్, షాద్‌నగర్, వికారాబాద్, నర్సాపూర్ పట్టణాల వరకు హైదరాబాద్ నగరం విస్తరిస్తోందన్నారు. అందుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించి మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందని సీఎం వివరించారు. ఇటీవలి చైనా పర్యటనలో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్‌తో పాటు అనేక మంది తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారని చెప్పారు.
త్వరలో చైనా కంపెనీలతో మరోసారి సమావేశమై ఏయే పనుల్లో ఎలా భాగస్వాములు కావాలనే విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు, అదనపు ముఖ్య కార్యదర్శి శాంత కుమారి పాల్గొన్నారు.