గ్రేటర్‌లో 24/7 నీళ్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వారంలో ఏడు రోజులు.. 24 గంటల పాటు నీళ్లిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జలమండలి అధికారులను ఆదేశించా రు. ప్రస్తుతానికి నగరంలోని 9.05లక్షల నల్లా లకు రోజూ నీళ్లిచ్చేందుకు చర్యలు తీసుకో వాలన్నారు. ఈ దిశగా దేశంతో పాటు ప్రపం చవ్యాప్తంగా పలు నగరాల్లోని విధానాలను అధ్యయనం చేయాలన్నారు. గురువారం జల మండలి ప్రధాన కార్యాలయంలో ఎండీ దానకిశోర్, డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
రిజర్వాయర్లు నిర్మించండి...
సీఎం కేసీఆర్ విజన్ మేరకు హిమాయత్ సాగర్,ఉస్మాన్‌సాగర్‌లను పర్యాటక కేంద్రాలు గా తీర్చిదిద్దాలని.. నగర తాగునీటి అవస రాలకు ఆధారమైన కృష్ణా, గోదావరి జలాల నిల్వకు అవసరమైన రిజర్వాయర్లను శివార్లలో నిర్మించాలని కేటీఆర్ సూచించారు. మూసీ నదిని గుజరాత్‌లోని సబర్మతి నదిలా సుందరీకరించాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్నారు. గ్రేటర్ శివార్లలో రూ.1,900 కోట్ల హడ్కో నిధులతో చేపట్టిన తాగునీటి పథకం పనులను ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలన్నారు. మల్కాజ్‌గిరిలో పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. తరచూ కలుషిత జలాల సమస్య ఉత్పన్నమౌతున్న ప్రాంతాల్లో పురాతన తాగునీటి పైపులైన్లను మార్చాలని, ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. భోలక్‌పూర్ తరహాలో కలుషిత జలాల దుర్ఘటనలు పున రావృతం కాకుండా చర్యలు తీసుకోవాల న్నారు. జలమండలి ఆదాయాన్ని గణనీయం గా పెంచుకోవాలని, నష్టాలను పూడ్చుకునేం దుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కేశవాపూర్ రిజర్వాయర్‌పై చర్చ...
20 టీఎంసీల గోదావరి జలాల నిల్వ సామ ర్థ్యంతో శివార్లలోని శామీర్‌పేట్ కేశవాపూర్‌లో భారీ స్టోరేజీ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. ఇందుకు సుమారు 4వేల ఎకరాల భూమి అవసరమౌతుందని.. ప్రభుత్వ భూ ముల సేకరణకుగల సాధ్యాసాధ్యాలను పరిశీ లించాలన్నారు. జలమండలి పరిధిలో జరు గుతున్న పలు ప్రాజెక్టు పనుల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించినట్లు తెలిసింది.
190 గ్రామాలకు తాగునీరు...
ఔటర్ రింగ్‌రోడ్డుకు లోపలున్న 190 గ్రామాల కు తాగునీరు అందించేందుకు ప్రైవేటు నిధులతో చేపట్టనున్న పథకాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. సింగూరు జలాలను నగరం నలుమూలలకు సరఫరా చేసేందుకు రూ.500 కోట్ల అంచనా వ్యయంతో ఔటర్ చుట్టూ భారీ పైపులైన్ నిర్మించాల్సి ఉందని అధికారులు మంత్రికి తెలపగా.. ఈ పథకాన్ని సైతం ప్రైవేటు నిధులతో చేపట్టే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. మున్సిపల్ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ పాల్గొన్నారు.