జీహెచ్‌ఎంసీ వాహనదారులకు శుభవార్త | Free parking anywhere! | Sakshi
Sakshi News home page

ఇక ఎక్కడైనా ఫ్రీ పార్కింగ్‌!  

Published Wed, Oct 11 2017 2:44 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

Free parking anywhere! - Sakshi

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని వాహనదారులకు శుభవార్త. ఇకపై నగరంలో ఎక్కడకు వెళ్లినా పార్కింగ్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. షాపింగ్‌ మాల్స్, సినిమా థియేటర్లతో పాటు వివిధ వాణిజ్య సంస్థల్లో వాహనాలకు పార్కింగ్‌ ఫీజును వసూలు చేయరు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని కార్పొరేషన్లలో పార్కింగ్‌ పాలసీపై మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా నగరంలో సినిమాహాళ్లు, షాపింగ్‌ మాల్స్‌లో పార్కింగ్‌ దోపిడీ అంశం ప్రస్తావనకు రాగా, ఇకపై ఎలాంటి ఫీజు వసూలు చేయరాదని నిర్ణయించినట్లు తెలిసింది. పార్కింగ్‌ పాలసీలో ఈ ఉచిత అంశం లేకపోయినా.. దీనికి సంబంధించి త్వరలోనే ప్రత్యేక జీవో జారీ కానున్నట్లు మున్సిపల్‌ శాఖ అధికారి ఒకరు తెలిపారు. కొత్త సంవత్సరంలోగా ఈ ఫ్రీ పార్కింగ్‌ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. 
– సాక్షి, హైదరాబాద్‌

బిల్లులో మినహాయింపు..
నగరంలో పార్కింగ్‌ జులుంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.పది సరుకు కొన్నా రూ.20 నుంచి రూ.50 పార్కింగ్‌ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. ఈ దోపిడీపై కొందరు పోలీస్‌ స్టేషన్లను ఆశ్రయించారు. వీటిని పరిగణనలోకి తీసుకుని తాజా నిర్ణయం తీసుకున్నారు. ఆయా వాణిజ్య సంస్థల్లో కొనుగోళ్లకు వెళ్లిన వారికే ఈ ఉచిత సదుపాయం కల్పించేందుకు, ఇతరులు పార్కింగ్‌ ప్రదేశాల్లో గంటల తరబడి పార్కింగ్‌ చేయకుండా ఉండేందుకు ఆయా దుకాణాలకు వెళ్లిన వారికి బిల్లులో పార్కింగ్‌ ఫీజు మేరకు మినహాయింపు ఇవ్వనున్నారు. నగరంలోని కొన్ని మాల్స్‌లో ఇప్పటికే ఈ పద్ధతి అమలులో ఉంది. సెల్లార్‌లో పార్కింగ్‌ చేయగానే ఫీజు వసూలు చేసి రసీదు ఇస్తారు. షాపింగ్‌ ముగిశాక బిల్లు చెల్లించేటప్పుడు రసీదు చూపిస్తే ఆ మేరకు బిల్లులో మినహాయింపు ఇస్తున్నారు. సినిమా థియేటర్లలో సినిమా టికెట్‌ను చూపిస్తే సరిపోతుంది. ఈ విధానాన్ని నగరంతోపాటు రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో అమలు చేయనున్నారు. 

ఆర్టీసీ.. రైల్వే స్టేషన్లలో..? 
ప్రైవేట్‌ వాణిజ్య సంస్థలే ఉచిత పార్కింగ్‌ కల్పిస్తున్నప్పుడు ఆర్టీసీ, రైల్వే, మెట్రో రైలు స్టేషన్లలోనూ ఫ్రీ పార్కింగ్‌ కల్పించాలనే డిమాండ్‌ వస్తోంది. రైల్వే ప్లాట్‌ఫారం టికెట్‌ కొనుగోలు చేసినవారు దాన్ని చూపితే సరిపోతుందని, ఆర్టీసీ బస్టాండ్లలో రోజుల తరబడి పార్కింగ్‌ చేయకుండా ఉండేలా తగిన విధానాలు రూపొందించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

134 పార్కింగ్‌ లాట్లలో ఇప్పటికే అమలు
పార్కింగ్‌ సమస్యల పరిష్కారానికి జీహెచ్‌ఎంసీలో ఇప్పటికే పలు చర్యలు చేప ట్టారు. రోడ్ల వెంబడి పార్కింగ్‌ లాట్లలో ఫీజుల్ని ఎత్తివేశారు. గత ఏడాది అక్టోబర్‌ నుంచి 134 పార్కింగ్‌ లాట్లలో ఫీజును ఎత్తేశారు. జీహెచ్‌ఎంసీ నిబంధనల మేరకు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే సముదాయాల్లో కొనుగోళ్లకు వచ్చేవారికి ఉచిత పార్కింగ్‌ కల్పించాల్సి ఉండటంతో సినిమాహాళ్లతోపాటు హోటళ్లు, రెస్టారెంట్లు, వినోద కేంద్రాలు తదితర ప్రాంతాల్లోనూ ఫ్రీ పార్కింగ్‌ను అమలు చేసే దిశలో అధికారులు ఉన్నారు.

కమ్యూనిటీ పార్కింగ్‌..
నగరంలోని ప్రధాన రహదారుల్లో పార్కింగ్‌ సమస్యను తీర్చడానికి ట్రాఫిక్‌ పోలీసులు కమ్యూనిటీ పార్కింగ్‌ విధానాన్ని ప్రతిపాదించారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, వాణిజ్య ప్రాంతాలు ఎక్కువగా ఉన్న చోట ఖాళీ ప్రాంతాన్ని గుర్తించి, కమ్యూనిటీ పార్కింగ్‌ ప్రాంతంగా ప్రకటిస్తారు. ఆ ప్రాంతంలో అవసరమైన మౌలిక వసతుల కల్పన, మూడు షిఫ్టుల్లో పని చేసేలా సెక్యూరిటీ ఏర్పాటు, ఆ ప్రాంతం నిర్వహణ బాధ్యతల్ని స్థానిక వర్తక సంఘాలకు అప్పగించాలి. దీనిపై త్వరలో తగు చర్యలు తీసుకోనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement