లోకేశ్ లోకల్ అయితే తెలంగాణలో పోటీ చేస్తారా: కేటీఆర్
మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్
♦ టీఆర్‌ఎస్ జీహెచ్‌ఎంసీ పీఠం కైవసం చేసుకోవడం ఖాయం
♦ కేంద్రంలో అధికారం ఉన్నా బీజేపీతో ప్రయోజనం లేదు
♦ తెలంగాణ మీద వారిది సవతి తల్లి ప్రేమ
♦ టీడీపీ ఆంధ్రా పార్టీనే.. బాబు ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారు
♦ లోకేశ్ లోకల్ అయితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తారా అని సవాల్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలనే విషయంలో ప్రజలకు స్పష్టత ఉందని... టీఆర్‌ఎస్ మెజారిటీ సీట్లు గెలుచుకొని సొంతంగా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని మంత్రి కె.తారకరామారావు చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తమకు ఓటేయాలని ప్రతిపక్షాలు ప్రజలను అడిగేందుకు ఒక్క కారణం కూడా లేదని... అదే టీఆర్‌ఎస్‌కు ఓటేయడానికి వంద కారణాలున్నాయని చెప్పారు. 19 నెలల కాలంలో చేసిన అభివృద్ధి, ప్రజలకు అండగా ఉన్నామన్న విశ్వాసం భవిష్యత్‌పై నమ్మకం కలిగించిందని... అదే ఓట్ల రూపంలో కనిపిస్తుందని పేర్కొన్నారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు చేసిన ఉపకారమేమిటని ప్రశ్నించారు. ప్రధాని తెలంగాణకు ముఖం చాటేశారని, కేంద్రం తరఫున రాష్ట్రానికి అడుగడుగునా అన్యాయమే జరిగిందని విమర్శించారు. ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలపడం మొదలుకొని గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో తెలంగాణ శకటానికి చోటివ్వకపోవడం వరకు అంతటా దగానేనని అన్నారు. రాష్ట్రాలకు రావలసిన న్యాయమైన వాటాల కన్నా ఒక్క రూపాయి అయినా అధికంగా బీజేపీ నాయకులు తెలంగాణకు తెచ్చారా? అని ప్రశ్నించారు.
మచ్చర్ పహిల్వాన్‌లా ఎలా?
‘‘హైదరాబాద్ అభివృద్ధి గురించి చంద్రబాబు 1999 నుంచి ఇప్పటివరకు చెబుతూనే ఉన్నారు. 2004లో ఒక్కసీటు కూడా టీడీపీకి ఇవ్వకుండా ఓడించినప్పుడే ప్రజలు చంద్రబాబును తిరస్కరించారని అర్థమైంది. అయినా చంద్రబాబు ఇంకా ప్రజల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ ఆంధ్రాపార్టీనే. ఇక్కడి ప్రజలకు అవసరం లేదు. మచ్చర్ పహిల్వాన్‌లా ఫోజు కొడుతూ మాది జాతీయ పార్టీ అని సొంతడబ్బా కొట్టుకుంటున్నారు. ఇక లోకేశ్ మాట్లాడితే తాను లోకల్ అంటున్నాడు. లోకల్ అయితే భవిష్యత్తులో తెలంగాణలో ఉంటారా, ఇక్కడే పోటీ చేస్తారా? స్పష్టం చేయాలి.
ఇప్పుడు పెద్ద మాటలు చెప్తున్న కొందరు టీడీపీ నాయకులు కూడా భవిష్యత్తులో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలలో ఏదో ఒక పార్టీలో చేరాల్సిందే..’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు మళ్లీ పోటీ చేసి గెలవాలని టీడీపీ నేతలు సవాల్ చేయడాన్ని ఎద్దేవా చేశారు. నేను లేస్తే మనిషిని కాదన్నట్లుగా టీడీపీ నాయకులు మాట్లాడతారే తప్ప ఎప్పటికీ లేవరని వ్యాఖ్యానించారు. కంటోన్మెంట్ ఎన్నికలు మొదలు వరంగల్ ఉప ఎన్నికల దాకా టీడీపీ తీరు అదేనని చెప్పారు. టీడీపీ నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలన్న కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు మాటలకు కట్టుబడి ఉంటారేమో టీడీపీ నేతలు చెప్పాలని కేటీఆర్ సవాల్ విసిరారు.