ప్రజలు మెచ్చేలా...
విశ్వనగరికి బాటలు వేద్దాం..
గ్రేటర్ అభివృద్ధికి పటిష్ట చర్యలు అవసరం
పనులు చేపట్టి...పన్నులు పెంచుదాం
ఆదాయం కోసం అన్నిదారుల్లో అన్వేషణ
జీహెచ్‌ఎంసీ వర్క్‌షాప్‌లో మంత్రి కేటీఆర్
సిటీబ్యూరో: ‘గ్రేటర్‌లో చాలా సమస్యలున్నాయి. ముందు వీటిని పరిష్కరించాలి. ప్రజలు మెచ్చేలా అభివృద్ధి పనులు చేపట్టాలి. రోడ్లు, పారిశుధ్యం, మంచినీళ్లు వంటి మౌలిక అవసరాలకు పెద్దపీట వేయాలి. ఆ తర్వాత పన్నులు పెంచి ఆదాయం పెరిగేలా చర్యలు చేపట్టాలి. ఇందుకు ప్రజలు కూడా సహకరిస్తారని ఆశిద్దాం...’ అంటూ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం ఎంసీహెచ్‌ఆర్‌డీలో ఉదయం నుంచి రాత్రి వరకు గ్రేటర్ అభివృద్ధిపై సుదీర్ఘ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈసందర్భంగా పన్నులు పెంచక తప్పదని సూచనలిచ్చారు. 2002లో సెల్ఫ్ అసెస్‌మెంట్ తర్వాత ఇంతవరకు ఆస్తిపన్ను పెంచకపోవడంతో రివిజన్‌పై అధ్యయనం చేసి తగిన నివేదికతో రావాల్సిందిగా మంత్రి కేటీ రామారావు జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. పదిహేనేళ్లలో అన్ని ధరలూ పెరిగినా ఆస్తిపన్నును సవరించలేదని, బెంగళూరులో ఏటా 5 శాతం ఆస్తిపన్ను పెంచుతుండటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఓవైపు ప్రజలకు సదుపాయాలు మెరుగుపరచాలని, మరోవైపు ధరల కనుగుణంగా ఆస్తిపన్నును హేతుబద్ధీకరించాలని నిర్ణయించారు. ఇందుకుగాను హేతుబద్ధ నివేదికలతో రావాలని అధికారులకు మంత్రి సూచించారు. కొన్ని చట్టాలు బాగున్నప్పటికీ ఎంతోకాలంగా అమలు కావడం లేదంటూ వేకెంట్ లాండ్ టాక్స్(వీఎల్‌టీ)ను ప్రస్తావించారు. ఆదాయం పెంచుకునేందుకు ఉన్న ఈ వనరు అమలుకు నోచడంలేదన్నారు.
ఓవైపు ఆస్తిపన్నుతో సహా ఆదాయం పెంచుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూనే..మరోవైపు ప్రజలకు మెరుగైన సదుపాయాలు సమకూర్చాలని కూడా అధికారులను ఆదేశించారు. ‘నిజానికి నగర ప్రజలు ఎంతో మంచివారు. వారు కోరుతున్నవి గొంతెమ్మ కోర్కెలు కాదు. ఏదో అద్భుతాలు చేయమనడం లేదు. సాధ్యమైనవి, మన పరిధికి లోబడినవి మాత్రమే చేయమంటున్నారు. మెరుగైన రహదారులు, రోగాల బారిన పడకుండా మెరుగైన పారిశుధ్యం వంటివి కోరుతూ జీవన ప్రమాణాలు పెంచాలంటున్నారు. ఆ దిశగా మనం కృషి చేయాలి’ అని కేటీఆర్ అధికారులకు పిలుపునిచ్చారు. విశ్వనగరమంటే మంచి రోడ్లతోపాటు కుక్కలు, దోమల బెడదలేని నగరంగా కూడా ఉండాలని, పెద్ద పనులే కాక చిన్నసమస్యలు కూడా పరిష్కరించాలన్నారు. అంబులెన్సులు పోయే దారి లేకుంటే విశ్వనగరమెలా అవుతుందన్నారు. మెరుగైన పరిస్థితుల్ని కోరుకుంటున్న ప్రజలు అవి సమకూరితే ఒక రూపాయి ఎక్కువైనా చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారన్నారు. ఇందుకుగాను మన మంతా హోదాలు, ప్రొటోకాల్ మరచి, సాధారణ నగర పౌరులుగా మీరైతే ఏం కోరుకుంటారో నిర్భీతిగా తెలపండని ఉదయం ప్రారంభోపన్యాసంలో కోరారు. ఎంతోకాలంగా ఆస్తిపన్ను రివిజన్ చేయలేదని, దానిపై అధ్యయనం చేయాల్సిందిగా అధికారులకు సూచించామన్నారు. అందుకు ప్రజలు కూడా సహకరించాల్సిందిగా కోరారు. వర్క్‌షాప్‌లో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను వర్క్‌షాప్ ముగిశాక సోమవారం రాత్రి మీడియాకువెల్లడించారు. ముఖ్యాంశాలిలా ఉన్నాయి.
జీహెచ్‌ఎంసీలో ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటు
కొత్త ఆలోచనలు, కొత్త ప్రయోగాలకు వేదికగా జీహెచ్‌ఎంసీలో ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటు. ప్రజలకు ఉపకరించే అంశాలపై ఇది కొత్తకొత్త ప్రయోగాలు చేసి, మేలైన ఫలితాలొస్తే విస్తరిస్తుంది. ఉదాహరణకు ప్లాస్టిక్‌రోడ్లు, నీటిని పీల్చుకునే రోడ్లు ఏర్పాటు చేయాల్సిందిగా పలు విజ్ఞప్తులందుతున్నాయన్నారు. అలాంటివాటిపై ఈసెల్ ప్రత్యేక పద్ధతిలో పనిచేస్తుందని మంత్రి చెప్పారు.
రోడ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి
ప్రతియేటా రోడ్ల మీద వందల కోట్లు ఖర్చుపెడుతున్నా బూడిద లో పోసిన పన్నీరవుతోందంటూ గత సంవత్సరం రూ. 800 కోట్లు నగర రోడ్ల కోసం ఖర్చు చేసినట్లు తెలిపారు. అవే నిధుల్ని సమర్థవంతంగా వినియోగించుకుంటే రోడ్ల సమస్యలుండవని, పేరున్న కంపెనీలకు బాధ్యతలిస్తామని కేటీఆర్ వెల్లడించారు. నగరం బాగుపడేందుకు సోషల్‌మీడియా ద్వారా, ప్రజల నుంచి, అధికారుల నుంచి విలువైన సూచనలొచ్చాయన్నారు. అందరూ కూడా రోడ్ల నిర్వహణ ప్రైవేటుకు మొగ్గుచూపారన్నారు. అందుకు టెండరు నిబంధనలు మార్చి ఎస్సెస్సార్ ధరలకు ఇస్తామన్నారు.
జీహెచ్ ఎంసీకి ప్రత్యేకంగా చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ నియామకం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజా సమస్యల పరిష్కారం వీరి ముఖ్య బాధ్యత. రోడ్లపై చెత్త, పారిశుధ్య సమస్యల పరిష్కారం కోసం త్వరలో మొబైల్‌యాప్ అందుబాటులోకి.మంచి పనుల కోసం అంతర్గత సమాచారం పంచుకునేందుకు ఇంట్రానెట్.చెత్త తరలింపు పనులకు 2 వేలకుపైగా ఆటో టిప్పర్ల కొనుగోలు15 సంవత్సరాల పైబడ్డ డొక్కు బండ్లను తొలగించి 15 ఆగస్టున సీఎం చేతుల మీదుగా కొత్త వాహనాల వినియోగం. పాడైపోయిన 600 డంపర్ బిన్లను తొలగించి కొత్తవి ఏర్పాటు ఒక డివిజన్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఎల్‌ఈడీ వీధి దీపాలు త్వరలో నగరమంతా విస్తరణ
జీహెచ్‌ఎంసీలోని వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీ, అవసరాన్ని బట్టి ఇతర విభాగాల నుంచి తీసుకోవడం.తెలంగాణలోని మూడొంతుల జనాభా నగరంలోనే ఉన్నందున బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌లతో సహా వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయాన్ని జీహెచ్‌ఎంసీకి తగిన విధంగా ఇచ్చేలా చూడడం. కేబీఆర్ పార్కు చుట్టూ చెట్లన్నింటినీ తీసివేయడం లేదు. చాలావరకు ట్రాన్స్‌లొకేట్ చేస్తాం. ఒకేరోజు 25 లక్షల మొక్కలు నాటే చారిత్రక ప్రయత్నాన్ని అందరూ సపోర్ట్ చేయాలి. కేబీఆర్ చుట్టూ తిరుగుతున్న మేధావులు, కార్యకర్తలు ఈ ప్రయత్నాన్ని గుర్తించాలి.
అన్ని ఆస్తులకూ జియో ట్యాగింగ్
విద్యుత్ చార్జీలకు ప్రస్తుతం రూ. 14.77 కోట్లు ఖర్చవుతోంది. ఎల్‌ఈడీలతో ఇది రూ. 7.78 కోట్లకు తగ్గుతుంది.రోడ్ల పనులు నాసిరకంతో చేస్తున్నారు. క మీషన్లకు కక్కుర్తి పడుతున్నారని మంత్రి కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.నాలుగు చినుకులకే ట్రాఫిక్ స్తంభించి, నేను కూడా ఇరుక్కుపోయి 9 గంటలకు రావాల్సి ఉండగా, 20 నిమిషాలు ట్రాఫిక్‌లోనే ఇరుక్కున్నాను. ఇలా అయితే ఎలా అంటూ ఆగ్రహించనట్లు తెలిసింది.వర్షాకాల సమస్యలు ఎదుర్కొనేందుకు ఎంతమేర సంసిద్ధంగా ఉన్నామో తెలపాలని కోరినట్లు తెలిసింది.