సాక్షి, ఆదిలాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రోడ్లు, వంతెనలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు, కోతలు ఏర్పడ్డాయి. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో పక్కా రోడ్లు లేకపోవడంతో అక్కడి ప్రజలు తాత్కాలిక దారులను ఏర్పాటు చేసుకొని రాకపోకలు సాగించడం పరిపాటిగా మారింది. పరశురాం మృతిచెందిన బజార్‌హత్నూర్ మండలంలోని డెడ్రా గ్రామ రోడ్డుదీ ఇదే పరిస్థితి.
ఈ రోడ్డుతో కలుపుకొని జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో 40 రోడ్ల నిర్మాణానికి గిరిజన సంక్షేమ శాఖ నుంచి గత ఏడాది నవంబర్ 14న రూ.42.29 కోట్లు మంజూరయ్యాయి. అయితే అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉన్న గిరిజన గూడేలు, తండాల గుండా రోడ్లు వేసేందుకు అటవీ శాఖ నుంచి అనుమతులు లభించకపోవటంతో పనులు ప్రారంభం కాని పరిస్థితి నెలకొంది.
దీంతో మంజూరైన నిధులు ఇప్పటికీ మూలుగుతూనే ఉన్నాయని తెలుస్తోంది. రోడ్లు దెబ్బతినడంతో ప్రజల దైనందిన జీవనం దుర్భరంగా మారింది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిత్యావసరాలు, అత్యవసరాలకు ఇబ్బందులే..
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం టక్కుగూడ గ్రామ గిరిజనులు సరుకుల కోసం ఇలా వాగు దాటుతూ, బురదమయంగా ఉన్న రోడ్ల గుండా మండల కేంద్రానికి చేరుకోవాల్సిన దుస్థితి నెలకొంది. రేషన్ సరుకులు, ఎరువులు, వైద్యం, ఇతర పనుల నిమిత్తం కార్యాలయాలకు రావాలంటే సర్కస్ ఫీట్లు చేయక తప్పదు.
నేటికీ తమ బతుకులు మారడం లేదంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ఉట్నూర్ మండలంలోని మారుమూల గ్రామాల రోడ్లు, వంతెనలు దెబ్బతిని కుమ్మరికుంట, వంకతుమ్మ, బాబాపూర్, రాజులగూడ, నర్సాపూర్ గ్రామాల గిరిజనులకు ఇబ్బందులు తప్పని పరిస్థితి.
ఎప్పుడూ ఇబ్బందే..
భీంపూర్ మండలం కరంజి(టి) గ్రామపంచాయతీ పరిధిలోకి వచ్చే రాజుల్ వాడి గ్రామం నుంచి గ్రామ పంచాయతీకి వెళ్లేందుకు సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉండే ఈ మట్టి రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు అస్తవ్యస్తంగా తయారైంది. ఈ గ్రామ వాసులు నిత్యావసర సరుకుల కొను గోలు, ఇతర అవసరాల కోసం కరంజి
(టి)కి వెళ్లాల్సిందే. ఈ రోడ్డు బాగోలేకపోవడంతో ఎప్పుడూఇబ్బందులే.
రోడ్లు లేక.. డాక్టర్లు రాక..
వర్షానికి పాడైన రోడ్లు.. సమయానికి అందుబాటులో లేని డాక్టర్లు.. వెరసి ఈ నెల 3న ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలంలో మూడేళ్ల బాలుడు పరశురాం మృతిచెందిన ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. జ్వరం, వాంతులు, విరోచనాలతో ఆ బాలుడు తీవ్ర అస్వస్థతకు గురైనప్పటికీ అతని తండ్రి పంద్ర లక్ష్మణ్.. రోడ్డు బాగాలేదనే కారణంతో అంతకు ముందు రోజు రాత్రి దూరంగా ఉన్న ఆస్పత్రికి తన బిడ్డను తీసుకెళ్లలేకపోయాడు.
మరుసటి రోజు ఉదయం బురద, గుంతల రోడ్డుపై తన బిడ్డను బైక్‌పై ఆస్పత్రికి తీసుకెళుతుండగా మధ్యలోనే బాలుడి పరిస్థితి విషమించింది. తీరా ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు వెళ్లినప్పటికీ డాక్టర్లు అందుబాటులో లేక సకాలంలో వైద్యం అందక పోవడంతో పరశురాం మృతిచెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల రోడ్ల దుస్థితిని తేటతెల్లం చేస్తోంది.
ప్రభుత్వానికి నివేదిక
ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవలి భారీ వర్షాలకు ఆర్‌అండ్‌బీకి సంబంధించి దాదాపు 87 కిలోమీటర్ల మేర రోడ్లు, వంతెనలు, కల్వర్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రూ.28.6 కోట్ల నష్టం వాటిల్లింది. తాత్కాలికంగా వాటి పునరుద్ధరణకు రూ.74 లక్షలు, పక్కాగా బాగుచేయడానికి రూ.80 కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
ఇక పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించి 111 రోడ్లు, వంతెనలు, కల్వర్టులు 144 కిలోమీటర్ల మేర అస్తవ్యస్తంగా తయారయ్యాయి. వీటి తాత్కాలిక మరమ్మతులకు రూ.67 లక్షలు అవసరం కాగా, రోడ్లు, బ్రిడ్జీల పూర్తిస్థాయి మరమ్మతులకు రూ.255 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు.
Comments
Please login to add a commentAdd a comment