సాక్షి, హైదరాబాద్: రికార్డు స్థాయి వర్షాలతో రోడ్లు మునిగి వాహనరాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో 60 కొత్త వంతెనలను రోడ్లు భవనాల శాఖ ప్రతిపాదించింది. తక్కు వ ఎత్తుతో ఉన్న కాజ్‌వేలు, కల్వర్టులను తొలగించి వాటి స్థానంలో వంతెనలు కట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. వీటి నిర్మాణానికి రూ.1150 కోట్లు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో దాదాపు రూ.50 కోట్ల వ్యయం అయ్యే వంతెన జాతీయ రహదారుల మీద ఉండగా, మిగతావి రాష్ట్ర రహ దారులపై ఉన్నవి కావటం విశేషం.
ఈ వంతెనలు కాకుండా, మరో 635 కల్వర్టులను కూడా ప్రతిపాదించారు. ఇక తాజా వాన లతో ములుగు జిల్లా జంపన్న వాగు మీద దొడ్ల గ్రామం వద్ద ఉన్న వంతెన, ములుగు–బుద్ధారం మధ్య రాళ్లవాగు మీద ఉన్న వంతెన, భూపాలపల్లి జిల్లా టేకుమట్ల వంతెన కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. మహబూబాబాద్‌లో మున్నేరు వాగు మీద ఉన్న వంతెన అప్రోచ్ రోడ్లు కూడా కొట్టుకుపోయాయి. ఆ వంతెన వద్ద వరద పోటెత్తినందున దాని పటుత్వాన్ని పరిశీలించాల్సి ఉంది.
రాష్ట్ర రహదారుల పునరుద్ధరణకు రూ.600 కోట్లు..
కొత్త వంతెనలతో కూడిన ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి అను మతి రావాల్సి ఉంది. రాని పక్షంలో, ప్రస్తుత వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించటంతో సరిపెట్టనున్నారు. ఈ పునరుద్ధరణ పనులకు రూ.600 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
రోడ్లు దెబ్బతిని ప్రస్తుతం వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారిన చోట్ల తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర రహదారులపై తాత్కాలిక మరమ్మతులకు రూ.46 కోట్లు అవసరమని నివేదికలో పేర్కొన్నారు.
జాతీయ రహదారులపై తాత్కాలిక మరమ్మతులకు రూ.36 కోట్లు విడుదల చేయాలని, దెబ్బతిన్న రోడ్ల పునురుద్ధరణ, ప్రతిపాదించిన కొత్త వంతెన, కల్వర్టుల కోసం రూ.148 కోట్లు అవసరమని జాతీయ రహదారుల విభాగం ప్రతిపాదించింది. భూపాలపట్నం జాతీయ రహదారిపై టేకులగూడెం వద్ద రూ.50 కోట్లతో వంతెన నిర్మాణానికి జాతీయ రహదారుల విభాగం ప్రతిపాదించింది. దీనికి కేంద్రప్రభుత్వం అనుమతి మంజూరు చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment