రోడ్డుమార్గం లేక.. సకాలంలో వైద్యం అందక మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడకు చెందిన ఏర్పుల రామకృష్ణ (40) సకాలంలో వైద్యం అందక చనిపోయాడు. రెండు రోజులు కురిసిన వర్షాలకు డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో ఆకేరు వరదతో ముల్కలపల్లి–ఖమ్మం, ముల్కలపల్లి–తిరుమలాయపాలెం మధ్య రోడ్లు కొట్టుకుపోయాయి. ఖమ్మం మార్గంలో ఆకేరువాగుపై బ్రిడ్జి డిస్క్ స్లాబ్‌లు ధ్వంసమయ్యాయి.
ముల్కలపల్లి వైపు బ్రిడ్జి నుంచి కొంతమేర రోడ్డు, కొంతవరకు కోతకు గురైంది. తిరుమలాయపాలెం మార్గంలోనూ ఆకేరుపై నిర్మించిన మరో బ్రిడ్జికి సంబంధించి అప్రోచ్ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఉయ్యాలవాడ, ముల్కలపల్లిల నుంచి ఖమ్మంకి పూర్తిగా రాకపోకలు నిలిచాయి. ఆదివారం 11 గంటల ప్రాంతంలో ఉయ్యాలవాడలో రామకృష్ణ అపస్మారకస్థితికి చేరగా..ఆయన్ను చికిత్స నిమిత్తం ఖమ్మం తీసుకెళ్లేందుకు అన్ని మార్గాలు మూసుకుపోయాయి.
108 అందుబాటులో ఉన్నా సకాలంలో చికిత్స అందక రామకృష్ణ సాయింత్రం 5.30 ప్రాంతంలో మృతిచెందాడు. వరదలతో దారులు మూసుకుపోవడంతో రామకృష్ణకు సకాలంలో వైద్యం అందక మృతి చెందాడని భార్య సంధ్య, కుమారులు సిద్ధు, రాంచరణ్‌లు కన్నీరు మున్నీరయ్యారు.
అత్యవసరాలకు మూసుకుపోయిన ‘దారులు’
రోడ్లు, కల్వర్టులు తెగిపోయి నిలిచిన రాకపోకలు
సాక్షిప్రతినిధి, వరంగల్ : వానలు జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. రోడ్లకు గండ్లు పడడం, వంతెనలు, కల్వర్టులు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 30 మండలాల్లో అధిక వర్షం కురవగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనివే 15 మండలాలున్నాయి.
మహబూబాబాద్, ములుగు, జేఎస్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో రోడ్లు, వంతెనలు తెగిపోయి సుమారు 94 గ్రామాలకు మూడు రోజుల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. ఇంకా 32 గ్రామాలకు రాకపోకల పునరుద్ధరణ జరుగుతోందని అధికారులు ప్రకటించారు. మంగళవారం రాత్రి లేదా బుధవారం ఉదయం పరిస్థితి యథాస్థితికి చేరుతుందని నివేదికలో పేర్కొన్నారు.
నాలుగు రోజులు ఇబ్బందులు పడ్డాం
ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు బ్రిడ్జి వరదలకు మునిగిపోయింది. వాజేడు, గుమ్మడిదొడ్డి గ్రామాల మధ్యన రహదారిపైకి గోదావరి వరద చేరడంతో నాలుగు రోజులు రాకపోకలు లేక ఇబ్బంది పడ్డం. చుట్టూ ఐదారూళ్లు తిరిగి మండల కేంద్రానికి పోవాల్సి వస్తోంది. – పాయం రామదాసు, గుమ్మడిదొడ్డి
82 ప్రాంతాల్లో తెగిపోయిన రోడ్లు
మరమ్మతులకు రూ.256 కోట్లు అవసరం
పూర్తిస్థాయిలో రోడ్ల పునరుద్ధరణకు రూ.1,200 కోట్లు కావాలని అంచనా
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. 587 ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమైనట్టు అధికారులు గుర్తించారు. ఇందులో 82 ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా తెగిపోయాయి. మరో 559 ప్రాంతాల్లో రోడ్ల మీదుగా వరద ప్రవహిస్తోంది. 336 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు తిరిగి ప్రారంభం కాగా, ఇంకా 111 ప్రాంతాల్లో ఇప్పటికీ వాహనాలు ముందుకు సాగలేని పరిస్థితి నెలకొంది.
రాకపోకలు పునరుద్ధరించాలంటే వెంటనే రోడ్లకు మరమ్మతు చేపట్టాలి. ఇందుకు రూ.256 కోట్లు అవసరమవుతాయని రోడ్లు, భవనాల శాఖ తాజాగా అంచనా వేసింది. ఆ రోడ్లను పూర్వపు స్థితిలోకి తెచ్చేందుకు మాత్రం రూ.1,200 కోట్లు అవసరమవుతాయని అధికారులు పేర్కొంటున్నారు.
వేగంగా రైలు మార్గం పునరుద్ధరణ పనులు
కేసముద్రం సమీపంలో రైల్వేట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. బుధవారం ట్రాక్‌ను సిద్ధం చేసి రైళ్ల రాకపోకలు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. మంగళవారం 108 రైళ్లతోపాటు మరో రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేసి.. 31 రైళ్లను మళ్లింపు దారుల్లో నడిపారు.
బుధవారం 88 రైళ్లు, గురువారం 61 రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ట్రాక్‌ను పునరుద్ధరిస్తేనే వాటిని నడుపుతామని స్పష్టం చేశారు. 350 ఆర్టీసీ బస్సులను మంగళవారం కూడా రద్దు చేశారు. విజయవాడ దారిలో నెమ్మదిగా ముందుకు సాగుతున్నందున, బస్సుల సంఖ్య తగ్గించి నడుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment