మానవ రహిత విమానాలతో వంతెనల తనిఖీ..!
♦ సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందిస్తున్న వేల్ టెక్
♦ పరిశోధనకు ఏటా రూ.30 కోట్లు
♦ వేల్ టెక్ యూనివర్సిటీ వీసీ సత్యనారాయణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంతెనలు, చారిత్రక కట్టడాల నాణ్యతను పరీక్షించేందుకు కొద్ది రోజుల్లో భారత్‌లో మానవ రహిత విమానాలు (యూఏవీ), డ్రోన్‌లు రంగంలోకి దిగనున్నాయి. ఇండియా-కెనడా ఇంపాక్ట్స్ కార్యక్రమంలో భాగంగా చెన్నైకి చెందిన వేల్ టెక్ యూనివర్సిటీ, కెనడాలోని విక్టోరియా వర్సిటీలు ఉమ్మడిగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. యూఏవీ, డ్రోన్‌ల సాయంతో వంతెనలకు పగుళ్లుంటే గుర్తిస్తారు.
తరచూ పరీక్షలు జరపడం ద్వారా వంతెన గట్టిదనం, జీవిత కాలం ఏ స్థాయిలో ఉందో తెలుసుకుంటారు. తొలి పైలట్ ప్రాజెక్టుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న వంతెన వేదిక కానుందని వేల్ టెక్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ బీల సత్యనారాయణ గురువారమిక్కడ చెప్పారు. అరుదైన కట్టడాల నాణ్యతను తెలుసుకునేందుకూ ఈ టెక్నాలజీ ఉపయోగిస్తామని మీడియాతో చెప్పారు.
ఏడాదిలో తొలి పైలట్ ప్రాజెక్ట్...
ప్రాజెక్టుకు అవసరమైన యూఏవీ, డ్రోన్‌లను వేల్ టెక్ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది. సెన్సర్లను విక్టోరియా వర్సిటీ రూపొందించింది. సెన్సర్లను యూఏవీ, డ్రోన్‌లతో అనుసంధానించే ప్రక్రియ జరుగుతున్నట్లు వేల్ టెక్ ప్రో-వీసీ యు.చంద్రశేఖర్ తెలిపారు. ఏడాదిలో తొలి పైలట్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని విక్టోరియా యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ రిషి గుప్త ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు.
‘ఈ టెక్నాలజీతో ఫలితాల్లో కచ్చితత్వం ఉంటుంది. ఖర్చు తక్కువ. సమయమూ ఆదా అవుతుంది. వంతెనల కింది భాగంలోకి డ్రోన్‌లు సులువుగా వెళ్లి తనిఖీ చేస్తాయి. భారతీయ రైల్వేల ఆధ్వర్యంలో 50,000కు పైగా పెద్ద వంతెనలున్నాయి. వీటిలో 100 ఏళ్లకు పైబడ్డవి చాలానే ఉన్నాయి’ అని తెలిపారు. టెక్నాలజీని కెనడాలోనూ వినియోగిస్తామన్నారు. కాగా పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఏటా రూ.30 కోట్ల దాకా వెచ్చిస్తున్నట్టు వేల్ టెక్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ కె.వి.డి.కిషోర్ కుమార్ చెప్పారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ, అనుబంధ పరిశ్రమల కోసం రూ.8 కోట్లతో టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్‌ను నెలకొల్పామని, ఇప్పటికే ఇందులో 20 స్టార్టప్‌లు పనిచేస్తున్నాయని చెప్పారు.