Unmanned
-
‘అన్మ్యాన్డ్’.. సబ్స్టేషన్లు!.. టీఎస్ఎస్పీడీసీఎల్ ‘హైటెక్’ బాట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా 15 జిల్లాల పరిధిలో విద్యుత్ సేవలు అందిస్తున్న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సాంకేతికత వినియోగంలో కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే మీటర్ రీడింగ్, కరెంట్ బిల్లుల వసూళ్లు, ఫిర్యాదుల స్వీకరణకు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న సంస్థ తాజాగా విద్యుత్ సరఫరాలోని కీలకమైన సబ్స్టేషన్లపై దృష్టి సారించింది. అంతర్గత నిర్వహణ ఖర్చులు, మానవ ప్రమేయాన్ని తగ్గించేందుకు కొత్తగా ఆటోమేటెడ్ సబ్స్టేషన్లను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని కల్యాణ్‌నగర్, ముఫకంజా, శిల్పారామం, కృష్ణానగర్, నాగోల్‌లలో సబ్స్టేషన్ల నిర్మాణ పనులు ప్రారంభించింది. కొత్త ఏడాదిలో మరిన్ని ప్రాంతాల్లోనూ నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రత్యేకత ఏమిటి? సాధారణంగా ప్రతి సబ్‌స్టేషన్‌లో నాలుగు నుంచి ఆరుగురు విద్యుత్ సిబ్బంది పనిచేస్తుంటారు. సబ్‌స్టేషన్‌కు అందుతున్న, మిగతా 2వ పేజీలో u దాని నుంచి సరఫరా అవుతున్న విద్యుత్ తీరును నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఒకవేళ ఏదైనా ఫీడర్ ట్రిప్ అయితే వెంటనే సరిచేస్తుంటారు. అయితే ఒక్కో స్టేసన్‌లోని సిబ్బంది జీతాలన్నీ కలిపి రూ. లక్షల్లో ఉండటం, జీహెచ్ఎంసీ పరిధిలో వందలాది సబ్స్టేషన్లు ఉండటంతో ఈ లెక్కన టీఎస్ఎస్పీడీసీఎల్పై ప్రతి నెలా రూ. కోట్లలో ఆర్థిక భారం పడుతోంది. ఈ నేపథ్యంలో అందుబాటులోకి తెస్తున్న అన్మ్యాన్డ్ సబ్స్టేషన్లలో సిబ్బంది అవసరం ఉండదు. పూర్తిగా సాఫ్ట్వేర్ సాయంతో ఇవి పనిచేయనున్నాయి. విద్యుత్ సరఫరా రీడింగ్ వివరాలను ఎప్పటికప్పుడు ఆటోమేటిక్‌గా నమోదు చేసుకోనున్నాయి. అలాగే ఫీడర్ పరిధిలో ఎక్కడ సమస్య వచ్చినా వాటంతట అవే పరిష్కరించనున్నాయి. ప్రతి 10–15 సబ్స్టేషన్ల పనితీరును ఒక అసిస్టెంట్ ఇంజనీర్ పర్యవేక్షిస్తే సరిపోనుంది. దీనివల్ల సంస్థపై ఆర్థికభారంగణనీయంగా తగ్గనుంది. ఇప్పటికే సాంకేతిక సంస్కరణల బాట... – విద్యుత్ సమస్య తలెత్తినప్పుడు కాల్‌సెంటర్ నంబర్ 1912 ద్వారా అందే ఫిర్యాదును సంబంధిత సెక్షన్ అధికారికి పంపేందుకు ‘సాసా’ యాప్ వినియోగం. గతంలో కాల్ సెంటర్ ద్వారా ఒకే సమయంలో 30 కాల్స్ మాత్రమే రిసీవ్ చేసుకొనే అవకాశం ఉండగా ప్రస్తుతం ఏకకాలంలో 300 ఫిర్యాదుల స్వీకరణకు అవకాశం. – 11 కేవీ, 33 కేవీ ఫీడర్లలో విద్యుత్ అంతరాయ పనరుద్ధరణకు కంప్యూటర్ ఆధారిత అవుటేజ్ మేనేజ్మెంట్ సిస్టం (ఓఎంఎస్) వాడకం. దీని సాయంతో విద్యుత్ పునరుద్ధరణకు ఎక్కడికి, ఎందరు సిబ్బందిని పంపాలో ముందే గుర్తించే వీలు. – సెల్ఫ్ మీటర్ రీడింగ్ యాప్ ద్వారా వినియోగదారుడే స్వయంగా ఇంట్లోని మీటర్లో నమోదైన రీడింగ్‌ను తీసి బిల్లు పొందే వెసులుబాటు. – జీహెచ్ఎంసీ పరిధిలోని 226 సబ్స్టేషన్లు, 167 ఫీడర్లలో రియల్‌టైమ్‌లో విద్యుత్ గణాంకాల విశ్లేషణకు సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ (స్కాడా) సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి. క్షేత్రస్థాయి నుంచి ఫిర్యాదులు రాకపోయినా ఆటోమేటిక్‌గా సరఫరాను పర్యవేక్షించే వీలు. కరెంట్ పోయిన ప్రాంతాల వివరాల గుర్తింపు, క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయడం ప్రత్యేకత. జీహెచ్ఎంసీ పరిధికే పరిమితమైన ఈ సేవలను 2023లో గ్రేటర్ శివారు ప్రాంతాలకు, ఆ తర్వాత ఇతర జిల్లాలకు ఈ సేవలను విస్తరించాలని సంస్థ నిర్ణయం. ఎనిమిదేళ్లలో 34 అవార్డులు.. తెలంగాణ ఏర్పాటుకు ముందు పరిశ్రమలకు పవర్ హాలీడేస్ ఉండేవి. గృహాలకు తొమ్మిది గంటలు, రైతులకు ఆరు గంటలే విద్యుత్ అందేది. ప్రస్తుతం గృహ వినియోగదారులకే కాకుండా వ్యాపారులకు, రైతులకు, పరిశ్రమలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. వినియోగదారులకు విద్యుత్ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో మార్కెట్లోకి కొత్తగా వచ్చే సాంకేతికతను వినియోగిస్తున్నాం. ఫలితంగా ఈ ఎనిమిదేళ్లలో 34 జాతీయ అవార్డులు డిస్కంకు లభించాయి. ఇది గొప్ప అచీవ్మెంట్. – రఘుమారెడ్డి, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ చదవండి: Telangana: గ్రూప్–4లో 8,039 పోస్టులే! -
రైల్వేలో మానవ రహిత సిగ్నలింగ్ వ్యవస్థ
సాక్షి, అమరావతి: రైలు ప్రమాదాలను నివారించే దిశగా త్వరలోనే ఆధునిక అన్‌మేన్డ్ ఆటోమేషన్ సిగ్నలింగ్ వ్యవస్థను రైల్వే శాఖ ప్రవేశపెట్టబోతోంది. దశాబ్దాలుగా ఉన్న సంప్రదాయ సిగ్నలింగ్ వ్యవస్థ స్థానంలో ‘ఇండీజినస్ కమ్యూనికేషన్ బేస్డ్ ట్రెయిన్ కంట్రోల్ సిస్టమ్ (ఐ–సీబీటీసీ) విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)తో ఒప్పందం కుదుర్చుకుంది. సంప్రదాయ వ్యవస్థకు మంగళం భారతీయ రైల్వే దశాబ్దాలుగా సంప్రదాయ సిగ్నలింగ్ వ్యవస్థనే కొనసాగిస్తోంది. ట్రాక్ సర్క్యూట్లు, యాక్సెల్ కౌంటర్ల ద్వారా రైళ్ల గమనాన్ని తెలుసుకుంటూ రంగుల లైట్ల ద్వారా రైళ్ల లోకో పైలట్లకు సిగ్నల్స్ తెలిపే విధానాన్ని అనుసరిస్తోంది. రైళ్ల గమనాన్ని తెలుసుకోడానికి, నియంత్రించడానికి ఈ విధానం సరైనదే. కానీ.. మన దేశంలోని 68,103 కి.మీ. పొడవైన రైల్వే ట్రాక్‌లను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోడానికి ప్రస్తుత వ్యవస్థ సరిపోవడం లేదు. అందుకే ప్రస్తుత సిగ్నలింగ్ స్థానంలో ఐ–సీబీటీసీ పేరుతో పూర్తిగా మానవ రహిత సిగ్నలింగ్ వ్యవస్థను రూపొందించనుంది. చదవండి: (ఉద్యోగులకు సీఎం జగన్ ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పారు: సజ్జల) -
మానవ రహిత రైల్వే గేటు బాగు
పెడన : నందమూరు శ్రీవాసవి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు తమ ప్రతిభను కొనసాగిస్తున్నారు. తాజాగా మానవ రహిత రైల్వే గేటును రూపొందించి ఆహో అనిపించారు. కళాశాలలో ఈఈఈ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ గేటు నమూనాను రూపొందించి కళాశాలలో ప్రిన్సిపాల్ ఏబీ శ్రీనివాసరావు, హెచ్ఓడీ జ్యోతిలాల్ నాయక్ ఎదుట ప్రదర్శించారు. పరికరాలు.. పనితీరు.. మానవ రహిత రైల్వే గేటుకు ఆర్డీనో ఎలక్ట్రానిక్ పరికరం, ట్రాన్స్ఫార్మర్, బ్రిడ్జి రెక్టిఫైర్, కెపాసిటర్, అయస్కాంతాల సెన్సార్, సర్వే మీటరు, ఎల్ఈడీ లైట్లను ఉపయోగించనున్నారు. ఆర్డీనో పరికరం ద్వారా రైల్వే గేటు నియంత్రణకు ఉపయోగిస్తారు. రైలు వచ్చే సమయంలో గేటు మూసుకోవడం, రైలు వెళ్లగానే తెరుచుకునేలా ఈ పరికరం ఉపయోగపడుతుంది. ట్రాన్స్ఫార్మర్ విద్యుత్‌ను అందిస్తుంది. బ్రిడ్జి రెక్టిఫైర్ ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే విద్యుత్‌ను తీసుకుని సమాంతర డీసీలోని 5 ఓల్టు విద్యుత్‌గా తగ్గించి అందిస్తుంది. ఇందుకు కెపాసిటర్‌ను వినియోగించారు. అయస్కాంత సెన్సార్లు రైలు వచ్చిన సమాచారాన్ని ఆర్డీనోకు సందేశాన్ని పంపిస్తుంది. ఎల్ఈడీ లైట్లను ఈ సెన్సార్లకు అనుసంధానం చేయడంతో అవి వెలిగేలా చర్యలు చేపట్టారు. ఉపయోగాలు మానవ రహిత రైల్వే గేటు వల్ల మానవ లోపాలు జరిగే నష్టాలను అరికట్టవచ్చు. రైలు రాకపోకల్లో జాప్యం జరిగినా ఎటువంటి ట్రాఫిక్‌కు అంతరాయం ఉండదు. సుదూర ప్రాంతాల్లో గేట్ కీపర్ ఒక్కడే ఉండాలంటే భయపడే పరిస్థితులు. ఇటువంటి చోట్ల ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీనిని అతివేగంగా ఆపరేట్ చేయవచ్చు. తక్కువ ఖర్చుతో కూడుకున్నది. కనుగొన్నది వీరే.. వాసవిలో ట్రిపుల్ ఈ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఎ.మాధవితేజ, ఎం.హారిక, వి.చరణ్‌సాయి, ఎన్.సాయికొండ, ఏహెచ్‌వీ ప్రసాద్. ఐదు నెలలు పాటు శ్రమించి దీనిని రూపొందించారు. చదువుతోపాటు ప్రయోగాలు ముఖ్యమనే ఉద్దేశంతో. విద్యార్థులు చదువుతో పాటు ఏదైనా కొత్త తరహా ప్రయోగం చేస్తేనే గుర్తింపు ఉంటుందనే ఉద్దేశంతో విద్యార్థుల ఆలోచనకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వడంతో ఈ ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగంతో విద్యార్థుల్లో నూతన ఉత్తేజం వచ్చింది. ఇందుకు హెచ్ఓడీ జ్యోతిలాల్ నాయక్ ఆధ్వర్యంలో కళాశాల యాజమాన్యం సహకారంతో విద్యార్థులు ఈ ప్రయోగంలో విజయం సాధించడం చాలా అభినందనీయం. – కేవీవీఎన్ భాస్కర్,ప్రాజెక్టు గైడ్ -
మానవ రహిత విమానాలతో వంతెనల తనిఖీ..!
♦ సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందిస్తున్న వేల్ టెక్ ♦ పరిశోధనకు ఏటా రూ.30 కోట్లు ♦ వేల్ టెక్ యూనివర్సిటీ వీసీ సత్యనారాయణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంతెనలు, చారిత్రక కట్టడాల నాణ్యతను పరీక్షించేందుకు కొద్ది రోజుల్లో భారత్‌లో మానవ రహిత విమానాలు (యూఏవీ), డ్రోన్లు రంగంలోకి దిగనున్నాయి. ఇండియా-కెనడా ఇంపాక్ట్స్ కార్యక్రమంలో భాగంగా చెన్నైకి చెందిన వేల్ టెక్ యూనివర్సిటీ, కెనడాలోని విక్టోరియా వర్సిటీలు ఉమ్మడిగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. యూఏవీ, డ్రోన్ల సాయంతో వంతెనలకు పగుళ్లుంటే గుర్తిస్తారు. తరచూ పరీక్షలు జరపడం ద్వారా వంతెన గట్టిదనం, జీవిత కాలం ఏ స్థాయిలో ఉందో తెలుసుకుంటారు. తొలి పైలట్ ప్రాజెక్టుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న వంతెన వేదిక కానుందని వేల్ టెక్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ బీల సత్యనారాయణ గురువారమిక్కడ చెప్పారు. అరుదైన కట్టడాల నాణ్యతను తెలుసుకునేందుకూ ఈ టెక్నాలజీ ఉపయోగిస్తామని మీడియాతో చెప్పారు. ఏడాదిలో తొలి పైలట్ ప్రాజెక్ట్... ప్రాజెక్టుకు అవసరమైన యూఏవీ, డ్రోన్లను వేల్ టెక్ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది. సెన్సర్లను విక్టోరియా వర్సిటీ రూపొందించింది. సెన్సర్లను యూఏవీ, డ్రోన్లతో అనుసంధానించే ప్రక్రియ జరుగుతున్నట్లు వేల్ టెక్ ప్రో-వీసీ యు.చంద్రశేఖర్ తెలిపారు. ఏడాదిలో తొలి పైలట్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని విక్టోరియా యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ రిషి గుప్త ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. ‘ఈ టెక్నాలజీతో ఫలితాల్లో కచ్చితత్వం ఉంటుంది. ఖర్చు తక్కువ. సమయమూ ఆదా అవుతుంది. వంతెనల కింది భాగంలోకి డ్రోన్లు సులువుగా వెళ్లి తనిఖీ చేస్తాయి. భారతీయ రైల్వేల ఆధ్వర్యంలో 50,000కు పైగా పెద్ద వంతెనలున్నాయి. వీటిలో 100 ఏళ్లకు పైబడ్డవి చాలానే ఉన్నాయి’ అని తెలిపారు. టెక్నాలజీని కెనడాలోనూ వినియోగిస్తామన్నారు. కాగా పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఏటా రూ.30 కోట్ల దాకా వెచ్చిస్తున్నట్టు వేల్ టెక్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ కె.వి.డి.కిషోర్ కుమార్ చెప్పారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ, అనుబంధ పరిశ్రమల కోసం రూ.8 కోట్లతో టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్‌ను నెలకొల్పామని, ఇప్పటికే ఇందులో 20 స్టార్టప్‌లు పనిచేస్తున్నాయని చెప్పారు.