హైదరాబాద్: నగరంలోనే అత్యంత ఎత్తులో.. మెట్రోరైలు మార్గంపైన నిర్మించిన ఫ్లై ఓవర్ త్వరలో ప్రారంభం కానుంది. వీఎస్టీ నుంచి ఇందిరాపార్కు వరకు నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ ఈ నెలలో ప్రారంభం కానున్నట్లు మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో తెలపడంతో, ఇప్పటికే పూర్తయిన ఈ ఫ్లైఓవర్‌కు తుది మెరుగులద్దే పనులు చేస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ చిక్కులు తప్పించేందుకు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్‌డీపీ) కింద జీహెచ్‌ఎంసీ వివిధ ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు నిర్మిస్తోంది.
వాస్తవానికి ఈపాటికే ప్రారంభం కావాల్సిన ఈ ఫ్లైఓవర్ పనుల్లో స్థల సేకరణ తదితర సమస్యలతో జాప్యం ఏర్పడింది. గుడి స్థలాన్ని సైతం సేకరించాల్సి వచ్చింది. కొద్దిరోజుల క్రితం ఈ ఫ్లైఓవర్‌ను తనిఖీ చేసిన మంత్రి కేటీఆర్.. పనులు సత్వరం పూర్తి చేయాల్సిందిగా ఆదేశించడంతో వేగం పెంచి పూర్తి చేశారు. ఎస్సార్‌డీపీ కింద జీహెచ్‌ఎంసీ ఇప్పటికే 32 పనులు పూర్తి చేసింది. ఫ్లై ఓవర్లలో ఇది 20వ ఫ్లై ఓవర్‌గా అధికారులు తెలిపారు.
ఎంతో ఎత్తులో..
ఎస్సార్‌డీపీ కింద ఇప్పటి వరకు నిర్మించిన ఫ్లై ఓవర్లు ఒక ఎత్తయితే. ఇది మరో ఎత్తు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద ఈ ఫ్లై ఓవర్ మెట్రో మార్గాన్ని క్రాస్ చేయాల్సి ఉండటంతో మెట్రో మార్గం పైనుంచి దీన్ని తీసుకువెళ్లారు. అక్కడ భూమి నుంచి ఫ్లై ఓవర్ ఎత్తు 26 మీటర్లకు పైగా ఉందని జీహెచ్‌ఎంసీ చీఫ్ ఇంజినీర్ (ప్రాజెక్ట్స్)ఎం.దేవానంద్ తెలిపారు. బహుశా ఈ నెల రెండో వారంలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ దీన్ని ప్రారంభించే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ పేర్కొంది. ఎస్సార్‌డీపీలో పొడవైన ఫ్లై ఓవర్లలో ఇది మొదటి స్టీల్ ఫ్లైఓవర్ అని తెలిపింది. దీని అంచనా వ్యయం రూ.450 కోట్లు. ఫ్లై ఓవర్ పొడవు 2.6 కి.మీ.
స్టీల్‌తో నిర్మాణం
నగరీకరణ, ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా నిర్మాణ సమయం తగ్గించేందుకు స్టీల్‌తో నిర్మించారు. ఖర్చు దాదాపు 30 శాతం అధికమైనప్పటికీ, 40 శాతం మేర సమయం తగ్గుతుండటంతో ట్రాఫిక్ సమస్యలున్న ప్రాంతాల్లో స్టీల్‌బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. హౌరా– కోల్‌కత్తా నగరాలను కలుపుతూ హుగ్లీ నదిమీద నిర్మించిన పొడవైన హౌరాబ్రిడ్జి స్టీలు బ్రిడ్జేనని అధికారులు తెలిపారు.
ప్రయోజనాలు
ఈ ఫ్లై ఓవర్(ఎలివేటెడ్ కారిడార్) అందుబాటులోకి వచ్చాక ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద ట్రాఫిక్ తగ్గుతుంది.
సచివాలయం నుంచి హిందీ మహావిద్యాలయం, ఉస్మానియా యూనివర్సిటీ, అంబర్‌పేట, మూసారంబాగ్‌ల వైపు వెళ్లే వారికి ప్రయాణ సమయం కలిసి వస్తుంది.
ప్రస్తుతం ట్రాఫిక్ సిగ్నళ్లున్న ఇందిరాపార్కు, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద ఎక్కడా ఆగకుండా సిగ్నల్ ఫ్రీగా వెళ్లిపోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment