సాక్షి, హైదరాబాద్: ప్రకృతి విపత్తులను ఎదుర్కోడానికి హైదరాబాద్ సిద్ధమవుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy). వరదలు లేని నగరంగా హైదరాబాద్(Hyderabad)ను తీర్చిదిద్దాలనుకుంటున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణలో ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్ సిటీని నిర్మించడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి నేడు సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించడం సంతోషం. తెలంగాణ ఏర్పడి దశాబ్దం గడుస్తోంది.. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మాకు ఓ కల ఉంది. అదే తెలంగాణ రైజింగ్. హైదరాబాద్‌లో ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్ సిటీ(Fourth city)ని నిర్మించాలని నిర్ణయించుకున్నాం. న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ వంటి నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడుతుంది. భారతదేశంలోనే గొప్ప నగరాన్ని నిర్మించాలని అనుకుంటున్నాం.. ఇందులో సేవా రంగం మాత్రమే ఉంటుంది. ఫ్యూచర్ సిటీ కాలుష్య రహిత నెట్ జీరో సిటీగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
ఈవీ బస్సులే..
ఇక, తెలంగాణలో 3,200 ఈవీ బస్సులను ఆర్టీసీలోకి తీసుకువస్తున్నాం. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్నును తొలగించాం. భారతదేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాలు అత్యంత వేగంగా అమ్ముడవుతున్న రాష్ట్రం తెలంగాణ. ప్రకృతి విపత్తులను ఎదుర్కొనడానికి హైదరాబాద్ సిద్ధమవుతోంది. వరదలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలనుకుంటున్నాం. మూసీ పునరుజ్జీవనంతో 55 కిలో మీటర్ల వరకు మంచినీటితో ప్రవహించేలా చేయబోతున్నాం. 2050 సంవత్సరానికి అవసరమయ్యే తాగు నీటి అవసరాలకు కావాల్సిన కార్యచరణను ఇప్పటి నుంచే ప్రారంభించాం.
ఆర్‌ఆర్‌ఆర్..
రీజినల్ రింగ్ రోడ్ ప్రణాళికల దశలో ఉంది. 360 కి.మీల పొడవు రీజినల్ రింగ్ రోడ్‌ను నిర్మిస్తున్నాం.. దాని చుట్టూ రీజినల్ రింగ్ రైల్వేను ప్లాన్ చేస్తున్నాము. ఓఆర్‌ఆర్, ట్రిపుల్ ఆర్‌లను అనుసంధానించే రేడియల్ రోడ్లు కూడా నిర్మించబోతున్నాం. రెండు రింగ్ రోడ్డుల మధ్య ప్రాంతం తయారీ రంగానికి కేంద్రంగా ఉండబోతుంది. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీలు, సోలార్ వంటి పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటు కాబోతున్నాయి. స్కిల్స్, ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించాం. ప్రపంచంలో హైదరాబాద్‌ను చైనాకు ప్లస్ సిటీగా మార్చే వ్యూహంతో ముందుకు వెళ్తున్నామన్నారు.
ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్న గ్రామీణ తెలంగాణలో వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగుల వంటి వాటిపైన దృష్టి పెడతాము. తెలంగాణ కు తీరప్రాంతం లేదు. అందుకే ఇక్కడ డ్రై పోర్ట్ ఏర్పాటు చేయనున్నాం. ఏపీలోని బందర్ ఓడరేవుతో అనుసంధానం చేస్తూ ప్రత్యేక రహదారితో పాటు రైల్వే కనెక్షన్ ఏర్పాటు చేయబోతున్నాం. మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాలని, మార్కెట్లు స్వేచ్ఛగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాము. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మాతో కలిసి రండి. అందరం కలిసి అద్భుతాలు సృష్టిద్దాం. భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అత్యున్నత వ్యాపార సౌలభ్యాన్ని నేను మీకు అందిస్తాను’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment