కార్యక్రమంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి రైల్వే టెర్మినల్ విస్తరణ ప్రాజెక్టుకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం శంకుస్థాపన చేశారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలను రిమోట్ కంట్రోల్ లింక్ ద్వారా ప్రారంభించారు. ఈ మేరకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో ఎర్రగుంట్ల–నంద్యాల సెక్షన్‌లో విద్యుదీకరణకు శంకుస్థాపన చేశారు. గుంతకల్లు–కల్లూరు మధ్య పూర్తయిన రెండవ లైన్ మార్గం, విద్యుద్దీకరణను జాతికి అంకితం చేశారు. రూ.221 కోట్ల అంచనాలతో చేపట్టిన చర్లపల్లి టెర్మినల్ విస్తరణ వల్ల నిత్యం లక్ష మందికి రవాణా సదుపాయం లభించనుంది. రోజుకు 50 నుంచి 60 రైళ్లు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభించనున్న ప్రైవేట్ రైళ్ల రాకపోకలకు చర్లపల్లి కేంద్రం కానుంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం ఉన్న 3 ప్లాట్‌ఫామ్‌లను 6 ప్లాట్‌ఫామ్‌ల వరకు విస్తరించనున్నారు. హైలెవల్ ఐలాండ్ ప్లాట్‌ఫామ్‌లను అభివృద్ధి చేస్తారు. రైల్వేస్టేషన్ కొత్త భవనాన్ని నిర్మిస్తారు. స్టేషన్‌కు అప్రోచ్ రోడ్డు ఏర్పాటుతో పాటు స్టేషన్‌లోపల 9 లిఫ్టులను, 6 ఎస్కలేటర్లను ఏర్పాటు చేయనున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌లపై పెరిగిన ఒత్తిడి, రద్దీని దృష్టిలో ఉంచుకొని 4వ టెర్మినల్‌గా చర్లపల్లి విస్తరణ చేపట్టారు. వచ్చే రెండేళ్లలో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. టెర్మినల్‌తో పాటు మరో 4 ఫిట్‌లైన్‌లను ఏర్పాటు చేయనున్నారు. చర్లపల్లి టెర్మినల్ వల్ల శివారు ప్రాంతాలకు చెందిన ప్రజలు నగరంలోకి ప్రవేశించవలసిన అవసరం లేకుండా ఔటర్ మీదుగా రాకపోకలు సాగించవచ్చు. ఘట్‌కేసర్ నుంచి యాదాద్రికి వెళ్లేందుకు నిర్మించనున్న ఎంఎంటీఎస్ కూడా చర్లపల్లి మీదుగానే వెళ్తుంది. సబర్బన్ రైల్ నెట్ వర్క్‌కు ఇది కేంద్రం కానుంది.
పెరగనున్న వేగం
గుంతకల్లు–కల్లూరు సెక్షన్‌లో రూ.322 కోట్ల అంచనాలతో చేపట్టిన 41 కిలోమీటర్ల రెండవ లైన్ మార్గం నిర్మాణం పూర్తయింది. విద్యుదీకరణ పనులను పూర్తి చేశారు. ఈ మార్గాన్ని మంత్రి జాతికి అంకితం చేశారు. దీనివల్ల ఢిల్లీ, ముంబై, సికింద్రాబాద్‌ల నుంచి బెంగళూర్ వైపు వెళ్లే మార్గానికి ఇది అనుసంధానమవుతుంది. ఈ మార్గంలో రైళ్ల వేగం గంటకు 100 కి.మీ. వరకు పెరగనుంది.
ఎర్రగుంట్ల–నంద్యాల విద్యుదీకరణ
ఎర్రగుంట్ల–నంద్యాల సెక్షన్‌లో రూ.112 కోట్ల అంచనాలతో చేపట్టనున్న 123 కి.మీ. మేర విద్యుదీకరణ పనులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. సరుకు రవాణాకు, ప్రయాణికుల రవాణా సదుపాయానికి ఇది ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీలోని కర్నూలు, కడప జిల్లాలకు రైల్వేసదుపాయం విస్తరించనుంది. మద్దూరు, బనగానపల్లె, కోయిలకుంట్ల, సంజమల, నొస్సం, ఎస్.ఉప్పలపాడు, జమ్మలమడుగు, పొద్దుటూరు రైల్వేస్టేషన్‌ల నుంచి రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ సెక్షన్‌ను దక్షిణమధ్య రైల్వే మొట్టమొదటి సౌరశక్తి వినియోగ సెక్షన్‌గా ప్రకటించింది.
427 స్టేషన్లలో ఉచిత హై స్పీడ్ వైఫై
దక్షిణమధ్య రైల్వేలో ఉచిత హైస్పీడ్ వైఫై సదుపాయాన్ని మొట్టమొదట 2016లో సికింద్రాబాద్ స్టేషన్‌లో ప్రారంభించారు. ఇప్పుడు ఈ స్టేషన్ వైఫై వినియోగంలో దేశంలోనే 4వ స్థానంలో ఉంది. రూ.65 కోట్లతో 427 స్టేషన్‌లలో ఉచిత హైస్పీడ్ వైఫై సౌకర్యాన్ని కొత్తగా ప్రారంభించారు. దీన్ని మంత్రి మంగళవారం సికింద్రాబాద్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతికి అంకితం చేశారు.
ఆ రైళ్లు కేటాయించండి: లక్ష్మణ్
తెలంగాణకు తేజస్, హమ్‌సఫర్, అంత్యోదయ రైళ్లను కేటాయించాలని కోరుతూ పీయూష్ గోయల్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వినతిపత్రం అందజేశారు. కాగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన పీయూష్ గోయల్ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
కేంద్రం x రాష్ట్రం
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్, పీయూష్ గోయల్‌ల పరస్పర విమర్శలు చర్చనీయాంశమయ్యాయి. రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం, నిధుల కేటాయింపుల్లో కేంద్రం దక్షిణాది రాష్ట్రాలను పూర్తిగా విస్మరించిం దని తలసాని ఆరోపించారు. బడ్జెట్‌లో దక్షిణ భారతదేశానికి అతి తక్కువ నిధులను కేటాయించిందన్నారు. అనంతరం పీయూష్ మాట్లాడుతూ.. కేంద్రానికి ఏ ఒక్క రాష్ట్రం పట్ల ప్రత్యేక అభిమానం ఉండబోదని.. అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాలు సమానమేనని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్రాల సంయుక్త ప్రాజెక్టుగా ప్రారంభించిన ఎంఎంటీఎస్ రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.450 కోట్లు ఇవ్వకపోవడం వల్లనే పనులు నిలిచిపోయినట్లు పీయూష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ సహాయ మంత్రి సోంప్రకాష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఎంపీలు బండి సంజయ్, సీఎం రమేష్, రఘురామ కృష్ణంరాజు, పి.రంగయ్య, ధర్మపురి అరవింద్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా, ఎన్‌వీఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment