ఆర్‌బీఐ రెపో రెపలు! | Rajan dramatically reduced the repo rate by half | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ రెపో రెపలు!

Published Tue, Sep 29 2015 11:54 PM | Last Updated on Sun, Sep 3 2017 10:11 AM

ఆర్‌బీఐ రెపో రెపలు!

ఆర్‌బీఐ రెపో రెపలు!

వృద్ధికి ‘రఘురామ’ బాణం..
 
♦ అనూహ్యంగా అర శాతం రెపో రేటు తగ్గించిన రాజన్
♦ ఈ తగ్గింపుతో 6.75 శాతానికి దిగివచ్చిన బెంచ్‌మార్క్ రుణ రేటు
♦ ఈ ఏడాది తగ్గింపు ఇది నాలుగోసారి; మొత్తంగా 1.25 శాతం కోత
♦ మార్కెట్లు సానుకూలం; ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాల హర్షం
♦ తగ్గనున్న పారిశ్రామిక, గృహ, వాహన, విద్యా రుణాల భారం
 
 ముంబై : బ్యాంకులిచ్చే రుణాలపై వడ్డీ రేట్లకు బెంచ్‌మార్క్‌గా భావించే రెపో రేటును రిజర్వు బ్యాంకు తగ్గించింది. డిమాండ్ పెరగాలంటే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గాలి కనక... రెపో రేటును తగ్గించాలంటూ కొన్నాళ్లుగా డిమాండ్లు, ఒత్తిళ్లు వస్తున్నా అంతగా పట్టించుకోని ఆర్‌బీఐ గవర్నరు... అనూహ్యంగా మంగళవారం రెపో రేటును ఏకంగా 0.50 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ రేటు 7.25 నుంచి 6.75 శాతానికి చేరింది. ఇది నాలుగేళ్ల కనిష్ట స్థాయి. తద్వారా మార్కెట్‌కు కాస్త ముందుగానే దీపావళి బహుమతిని రాజన్ అందజేసినట్లయ్యింది. రెపోకు అనుగుణంగా రివర్స్ రెపో రేటు కూడా 5.75 శాతానికి చేరుకుంది.

కాగా నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్) 4 శాతంగానే ఉండగా... స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో (ఎస్‌ఎల్‌ఆర్) కూడా 21.5 శాతంగానే ఉంది. ఈ రెండింట్లో ఎలాంటి మార్పులూ చేయలేదు. వ్యవస్థలో తగిన లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) ఉందని, అందుకని ఈ రేషియోల్లో మార్పు ఉండకపోవచ్చని ఉన్న అంచనాలకు అనుగుణంగానే ఆర్‌బీఐ వ్యవహరించింది. మంగళవారం నాటి  నాల్గవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది.

 ప్రభుత్వ ఒత్తిడి వల్లేనా?
 నిజానికి రేటు కోత ఉండకపోవచ్చని కొందరు, ఒకవేళ ఉన్నా 0.25 శాతమే ఉంటుందని కొందరు విశ్లేషించారు. అంచనాలు కూడా వేశారు. అయితే రాజన్ నిర్ణయం వీటన్నిటికీ భిన్నంగా ఉండటం గమనార్హం. నిజానికి ఇటీవల హాంకాంగ్, సింగపూర్‌లలో ఇన్వెస్టర్లనుద్దేశించి మాట్లాడిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ... దేశంలో వృద్ధికి దోహదం చేసే చర్యలు తీసుకోవాల్సి ఉందని గట్టిగా చెప్పారు. మరో గమనించాల్సిన సంగతేమిటంటే... మంగళవారం రాజన్ ప్రకటన వెలువడిన 10 నిమిషాలకే ఆర్థిక మంత్రి జైట్లీ తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న ప్రకటనను విడుదల చేస్తూ... ఈ నిర్ణయం వృద్ధికి ఊతమిస్తుందని చెప్పారు. ‘‘మరి కేంద్రం ఒత్తిడి వల్లే ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుందని భావించవచ్చా?’’ అని విలేకరులడిగిన ప్రశ్నకు జవాబిస్తూ... మీరెలా కావాలంటే అలా ఊహించుకోవచ్చని  చెప్పటం గమనార్హం. నిజానికి ఈ ఏడాది రెపో రేటు తగ్గింపు ఇది నాల్గవసారి. తాజా నిర్ణయంతో ఈ ఏడాది ఇప్పటిదాకా మొత్తం 1.25 శాతం రేటు తగ్గించినట్లయింది. అయితే ఇప్పటి దాకా మూడు విడతలుగా కోత వేసిన 0.75 శాతంలో మూడవ వంతు... అంటే దాదాపు 33 శాతాన్ని మాత్రమే బ్యాంకులు కస్టమర్లకు బదలాయించాయి. ఆర్‌బీఐ తాజా నిర్ణయం నేపథ్యంలో ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంక్ సహా పలు బ్యాంకులు తక్షణం కనీస (బేస్) రుణ రేటు కోత నిర్ణయం తీసుకున్నాయి.

 ఎందుకింత ప్రాధాన్యమంటే...
 రెపో రేటు తగ్గిస్తే బ్యాంకులకు కొంత తక్కువ వడ్డీకే ఆర్‌బీఐ నుంచి నిధులు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రయోజనాన్ని రుణాలకు సంబంధించి కస్టమర్లకు బదలాయిస్తే... పారిశ్రామిక రంగానికి, అలాగే రిటైల్ విభాగానికి తక్కువ రుణ రేటుకు నిధులు అందుతాయి. ఈ ప్రక్రియ మొత్తం బ్యాంకింగ్ రుణ వృద్ధికి, పారిశ్రామిక  పురోగతికి, వ్యవస్థలో వినియోగం పెరగటానికి ఉపయోగడుతుంది. ఉదాహరణకు తక్కువ వడ్డీకి గనక రుణాలు లభిస్తే ఇళ్లు, వాహనాలు కొనటం... పరిశ్రమలకు రుణాలు తీసుకోవటం వంటివి పెరుగుతాయి. మొత్తంగా ఇవన్నీ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికి ఉపకరిస్తాయి.

అయితే వ్యవస్థలోకి అధిక నిధులు రావడం వల్ల ధరలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే అందరిదగ్గరా డబ్బులుంటే వస్తువులకు డిమాండ్ ఏర్పడి వాటి ధరలు పెరగటమన్నది సహజం కదా! ఈ కారణంగానే గడచిన రెండు ద్రవ్య, పరపతి సమీక్షల సందర్భంగా ఆర్‌బీఐ రెపోను తగ్గించలేదు. ముడి చమురు సహా అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు తక్కువ స్థాయిలో కొనసాగడం, ఇప్పట్లో ఇవి పెరిగే అవకాశాలు తక్కువగా ఉండడం... అటు టోకు ధరలు ద్రవ్యోల్బణం, రిటైల్ ద్రవ్యోల్బణం చరిత్రాత్మక కనిష్ట స్థాయిల్లో కొనసాగుతుండడం (ఆగస్టులో టోకు ద్రవ్యోల్బణం -4.95 శాతం.  రిటైల్ ద్రవ్యోల్బణం  3.66 శాతం), మందగించిన బ్యాంకింగ్ రుణ వృద్ధి, పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిలో ఒడిదుడుకులు  వంటి అంశాల నేపథ్యంలో రాజన్ తాజాగా రెపో రేటు కోత నిర్ణయం తీసుకున్నారు.

ఆర్‌బీఐ ప్రకటనలో ఇతర ముఖ్యాంశాలు ...
2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనా 7.4%కి తగ్గింపు. ఇంతక్రితం ఈ అంచనా 7.6%.
నవంబర్ చివరికల్లా బ్యాంకుల కనీస రుణ రేటు  (బేస్‌రేటు) నిర్ణయానికి సంబంధించి మార్గదర్శకాలు. నిధుల సమీకరణ వ్యయం ప్రాతిపదికన ఈ మార్గదర్శకాలు వెలువడతాయి.
నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు. చిన్న పట్టణాల్లో కార్డు వినియోగ సంస్కృతి పెంపుపై దృష్టి. ఎలక్ట్రానిక్ పేమెంట్ల పెంపునకు సంబంధించి నవంబర్‌కల్లా ఒక అవగాహనా పత్రం విడుదల.
ఆర్థిక రికవరీ నెమ్మదిగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి భాగంలో వేగం పుంజుకునే అవకాశం ఉంది.
అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉన్నాయి. ఆయా అంశాలు భారత్‌కు ప్రతికూలమే.
సెప్టెంబర్ నుంచి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2016 జనవరినాటికి సగటున వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) 5.8%గా ఉండొచ్చు. 2018కల్లా లక్ష్యం 5.5%.
డెట్ సెక్యూరిటీల్లో ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ (ఎఫ్‌పీఐ) రూపాయి రూపంలో పెట్టే పెట్టుబడుల పరిమితి స్థిరీకరణ. 2018 నాటికి ప్రభుత్వ బాండ్లలో ఎఫ్‌పీఐ పెట్టుబడి పరిమితిని దశలవారీగా 5%కి పెంపు. ప్రస్తుతం ఇది 3.5%.  ఈ పెంపు ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీల్లోకి అదనంగా రూ.1.2 లక్షల కోట్లు వచ్చే వెసులుబాటు.
 
 నా పేరు రఘురామ్ రాజన్..!
  మీరు నన్ను ఏమని పిలవాలనుకుంటున్నారో నాకు తెలియదు. వరాలిచ్చే ‘శాంటాక్లాజ్’ అని పిలుద్దామని అనుకుంటారో.. లేక కఠినంగా వ్యవహరించే ‘డేగ’ అని పిలుద్దామని అనుకుంటున్నారో.. అది మీ ఇష్టం. దీనిపై నేను ఏమీ మాట్లాడను. నా పేరు రఘురామ్ రాజన్. నేను ఏమి చేయగలనో అది చేస్తాను. సుస్థిర, పటిష్ట ఆర్థికాభివృద్ధికి మేము ఏది చేయగలమో అది చేశాం. భారీగా రేటు తగ్గించామనో లేక.. దీపావళి బోనస్ ఇచ్చామనో నేను భావించడం లేదు, ఫైనాన్షియల్ మార్కెట్ సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి సైతం తాజా పాలసీ నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నా.

రెపో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకులు త్వరితగతిన కస్టమర్లకు బదలాయించే అంశంపై ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. బ్యాంకులూ ఇందుకు చొరవ చూపాలి. రుణ రేటు బదలాయింపునకు డిపాజిట్ రేటు తగ్గింపు ఒక మార్గం. చిన్న పొదుపు రేట్ల సమీక్ష, కాస్ట్ ఆఫ్ ఫండ్స్ (నిధుల సమీకరణ వ్యయం) ప్రాతిపదికన కనీస రుణ రేటు  నిర్ణయం వంటి అంశాలూ ఉన్నాయి. రుతుపవన పరిస్థితులు, క్రూడ్ ధరలు, చైనా మందగమన ధోరణి ఇతర అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులను అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తాజా నిర్ణయం తీసుకున్నాం.  ఫెడ్ రేటు పెంపుసహా ఏ ఒక్క అంశం ప్రాతిపదికనో పాలసీ నిర్ణయం ఉండదు.  అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితుల గురించి ఆందోళన పడడంకన్నా... అవకాశాలను అందిపుచ్చుకోవడం ఎలా అన్న అంశంపై దృష్టి పెట్టాలి.
 
 తగ్గింపు లాభం... కస్టమర్లకు

  వడ్డీ రేట్ల తగ్గింపు ఆరంభించిన బ్యాంకులు  ముందడుగు వేసిన ఎస్‌బీఐ; తక్షణం 0.40% కోత
 ఆంధ్రా బ్యాంక్‌దీ అదే బాట    ఐసీఐసీఐ సహా పలు బ్యాంకుల సంకేతాలు
 పొదుపు రేట్లు కూడా తగ్గాలని మరికొందరు బ్యాంకర్ల వ్యాఖ్యలు...
 
 రిజర్వ్ బ్యాంక్ రెపోరేటు కోత ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించే లెక్కల్లో పలు బ్యాంకులు నిమగ్నమయ్యాయి.  బ్యాం కింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కనీస రుణ రేటును 0.40 శాతం తగ్గించింది. దీనితో  బ్యాంక్ బేస్ రేటు 9.30 శాతానికి చేరింది. అక్టోబర్ 5 నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుంది. కనీస రుణ రేటు కోత నేపథ్యంలో- డిపాజిట్ రేటు కూడా పావు శాతం వరకూ తగ్గించనున్నట్లు ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు.  వడ్డీరేట్లపై మరికొన్ని బ్యాంకుల నుంచి వస్తున్న  సంకేతాలను చూస్తే...
 ఆంధ్రాబ్యాంక్: తక్షణం అమల్లోకి వచ్చేవిధంగా ఆంధ్రాబ్యాంక్ కనీస రుణ రేటును పావు శాతం తగ్గించింది. ఈ ఏడాది  ఆర్‌బీఐ 1.25 శాతం రెపో రేటు తగ్గిస్తే, ఇందులో 50 బేసిస్ పాయింట్ల ప్రయోజనాన్ని మాత్రమే కస్టమర్లకు బ్యాంక్ అందించింది. ప్రస్తుత బ్యాంక్ కనీస రేటు 9.75.

 ఐసీఐసీఐ బ్యాంక్: ప్రైవేటు రంగంలో బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ కూడా కనీసం పావు శాతం కనీస రుణ రేటు కోత సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు బ్యాంక్ చీఫ్ చందా కొచర్ ఒక ప్రకటన సైతం చేశారు.

 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: ఇటీవలే బేస్‌రేటును 9.35 శాతానికి తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి తాజా కోతకు సంబంధించి ఎటువంటి వ్యాఖ్యా వెలువడలేదు. ఇప్పటి వరకూ ఈ బ్యాంకుదే బ్యాంకింగ్‌లో కనీస రుణ రేటుకు సంబంధించి కనిష్ట స్థాయి. తాజా 0.40% కోతతో ఇప్పుడు ఈ స్థానాన్ని తిరిగి ఎస్‌బీఐ (తాజా రేటు కోతతో 9.30%) సొంతం చేసుకుం ది. తాజా ఆర్‌బీఐ నిర్ణయంపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ ఆదిత్య పురి మాట్లాడుతూ, పాలసీ రేటు మరింత తగ్గాలని అన్నారు.

 యాక్సిస్ బ్యాంక్: ప్రైవేటు రంగంలో మూడవ పెద్ద బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ మాత్రం తమ బ్యాంక్ రేటు కోత ఉంటుందని, అయితే దీనికి మరికొంత సమయం పడుతుందని తెలిపింది. చిన్నమొత్తాల పొదుపు డిపాజిట్ రేటు ఇప్పటికీ 8.7%-9.3% శ్రేణిలో ఉంటే, రెపో ప్రయోజనం మొత్తాన్ని బ్యాంకింగ్ కస్టమర్లకు బదలాయించాలనడం సరికాదని సైతం యాక్సిస్ బ్యాంక్ చీఫ్ శిఖా శర్మ వ్యాఖ్యానించడం గమనార్హం.

 దేనాబ్యాంక్: రుణ రేటు తగ్గింపు, దీనికి అనుగుణంగా డిపాజిట్ రేటు తగ్గింపునకు ఇప్పుడు బ్యాంకింగ్‌కు పెద్ద ఇబ్బంది ఉంటుందని దేనా బ్యాంక్ చీఫ్, ఐబీఏ చైర్మన్ అశ్వనీ కుమార్ పేర్కొన్నారు. పీపీఎఫ్, ఎన్‌సీఎస్ వంటి చిన్న పొదుపు పథకాల వడ్డీరేట్లు అధికంగా ఉండడమే ఇప్పుడు బ్యాంకింగ్ డిపాజిట్ల విషయంలో ప్రతికూలంగా కనబడుతున్నాయని వివరించారు.

 కొటక్ మహీంద్రా: చిన్న పొదుపు రేట్లు అరశాతం మేర తగ్గిస్తే (దాదాపు 8.25 శాతం స్థాయికి) అది స్వాగతనీయ అంశం అవుతుందని కొటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఉదయ్ కొటక్ పేర్కొన్నారు. 8 శాతం లోపునకు పొదుపురేటు పడిపోతే అది మానసికంగా మదుపుదారుపై ప్రభావం చూపుతుందని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో నిధుల సమీకరణ కష్టంగా మారుతుందని వివరించారు. రేటు కోత నిర్ణయానికి తమ బ్యాంకుకు మరికొన్ని రోజులు పడతాయని ఆయన అన్నారు.

 బంధన్ బ్యాంక్: ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడే నిర్ణయం ఇదని బంధన్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డెరైక్టర్             సీఎస్ ఘోష్ అన్నారు.  

 బ్యాంక్ ఆఫ్ ఇండియా: కనీస రుణ రేటును పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 9.70 శాతానికి చేరింది. అక్టోబర్ 5 నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుంది.
 
 ఆర్‌బీఐ అస్త్రాలు

  రెపో: బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటే- రెపో. ఒకరకంగా బ్యాంకులు నిర్ణయించే వడ్డీ రేట్లన్నిటికీ ఇదే మూలం. తాజా తగ్గింపుతో ఇది 6.75 శాతానికి చేరింది.

 రివర్స్ రెపో: బ్యాంకులు తమ వద్ద అదనంగా ఉండే నిధులను రిజర్వ్ బ్యాంక్ వద్ద స్వల్పకాలిక డిపాజిట్లు చేస్తాయి. వీటిపై ఆర్‌బీఐ ఇచ్చే వడ్డీ రేటే రివర్స్ రెపో. ప్రస్తుతం ఇది 5.75 శాతంగా ఉంది.

 సీఆర్‌ఆర్: క్యాష్ రిజర్వ్ రేషియో. అంటే బ్యాంకులు తమ దగ్గరున్న మొత్తం డిపాజిట్లలో కొంత మొత్తాన్ని తప్పనిసరిగా ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సి ఉంటుంది. ఇదే సీఆర్‌ఆర్. దీనిపై ఎటువంటి వడ్డీరాదు. ప్రస్తుతం ఇది 4 శాతంగా ఉంది.

 ఎస్‌ఎల్‌ఆర్: స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. ఆర్‌బీఐ నిర్దేశించే పత్రాల్లో బ్యాంకులు తప్పనిసరిగా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. వ్యవస్థలో ద్రవ్య లభ్యత(లిక్విడిటీ), డిమాండ్, ధరల కట్టడి వంటి అంశాలను నియంత్రించడానికి ఆర్‌బీఐ ఈ ఇన్‌స్ట్రమెంట్లను వినియోగించుకుంటుంది. ప్రస్తుతం ఇది 21.5%గా ఉంది.
 
పరిశ్రమలు ఖుషీ
 వృద్ధికి ఊతమిచ్చే దిశగా ఆర్‌బీఐ తగ్గించిన వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని ఇక బ్యాంకులు.. కస్టమర్లకు బదలాయించాలని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. తద్వారా డిమాండ్ పునరుద్ధరణకు, మళ్లీ పెట్టుబడుల రాకకు తోడ్పాటునివ్వాలని సూచించాయి. ఆర్థిక కార్యకలాపాలు మందగించడాన్ని ఎట్టకేలకు గుర్తించిన ఆర్‌బీఐ తగు నిర్ణయం తీసుకుని వడ్డీ రేట్ల దిశపై నెలకొన్న సందిగ్ధానికి తెర దించిందని సీఐఐ డెరైక్టర్ జన రల్ చంద్రజిత్ బెనర్జీ చెప్పారు. ఇది కార్పొరేట్లకు సానుకూలమని పేర్కొన్నారు.  రేట్ల తగ్గింపుతో ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆశ్చర్యపర్చారని, దీపావళి బోనస్ ఇచ్చారని అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ వ్యాఖ్యానించారు.

 ఎకానమీకి మంచిది..
 పండుగల సీజన్ నేపథ్యంలో రేట్ల తగ్గింపు నిర్ణయం సరైన సమయంలో వచ్చినట్లయిం ది. ఇది ఎకానమీకి మేలు చేస్తుంది. రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ మొదలైన వాటి కొనుగోళ్లు పెరగగలవు. దేశ ఆర్థిక వృద్ధికి కూడా ఇది మంచిది.
 - ఆది గోద్రెజ్, చైర్మన్, గోద్రెజ్ గ్రూప్

 డిమాండ్ మెరుగవుతుంది..
 ఈ ప్రయోజనాలను బ్యాంకులు .. ఇక ఖాతాదారులకు మళ్లించాలి. దీనివల్ల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గి వివిధ రంగాల్లో డిమాండ్ మెరుగుపడుతుంది. దేశీ కార్పొరేట్లు.. విదేశీ మార్కెట్లలో రూపాయి ఆధారిత బాండ్ల జారీకి అనుమతినివ్వడం కూడా సానుకూల నిర్ణయమే.
 - హర్షపతి సింఘానియా, వైస్ చైర్మన్, జేకే పేపర్ వృద్ధికి ఊతమిస్తుంది..

 ఆర్థిక వృద్ధికి, పెట్టుబడుల రాకకు, భారీ యంత్రాల తయారీ రంగానికి అవసరమైన తోడ్పాటు లభించగలదు. రుణాలపై వడ్డీ రేట్లు కీలకంగా ఉండే పునరుత్పాదక విద్యుత్  రంగానికీ ఇది సానుకూలమే.
 - తుల్సి తంతి, చైర్మన్, సుజ్లాన్ గ్రూప్
 
 ఎవరిపై.. ఏమిటి ప్రభావం...
 రిజర్వ్ బ్యాంక్ ఎట్టకేలకు ఏకంగా అర శాతం మేర పాలసీ రేట్లు తగ్గించింది. ఇది ఆర్థిక వ్యవస్థకి ఊతమిస్తుందని, పెట్టుబడుల రాకకు తోడ్పడుతుందని.. విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ రేట్ల కోత వల్ల వివిధ వర్గాలపై ప్రభావాలేమిటంటే ..
 
  రుణగ్రహీతలకు...

  బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తే.. గృహ రుణాలు, వాహన రుణాలు, పర్సనల్ లోన్స్ మొదలైన రుణాలన్నీ కూడా మరింత చౌకగా మారతాయి. తదనుగుణంగా కొనుగోళ్ల కార్యకలాపాలూ పెరిగి, ఆయా రంగాల్లో డిమాండ్ మెరుగుపడుతుంది. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఉపయోగపడగలదు.
 
 ఆర్థిక వ్యవస్థ...
  వ్యాపారాల నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో పాటు రుణాలపై వడ్డీ రేట్లూ ఎక్కువగా ఉన్నందునే తాము పెట్టుబడులు పెట్టలేకపోతున్నామంటూ కంపెనీలు చెబుతూ వస్తున్నాయి. అధిక వడ్డీకి రుణాలు తీసుకుని ఇన్వెస్ట్ చేసినా ప్రాజెక్టు వ్యయం పెరిగిపోయి నష్టపోవాల్సి వస్తుందన్నది వాటి వాదన. ఇప్పుడు ఆర్‌బీఐ రేట్లు తగ్గించిన నేపథ్యంలో ఇక ప్రభుత్వం కూడా తన వంతు విధాన నిర్ణయాలు తీసుకుంటే పెట్టుబడులు మళ్లీ రాగలవు.. ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగుపడగలదు.
 
 కరెన్సీపై...
 అధిక వడ్డీ రేటు ఉంటే అధిక రాబడులు వస్తాయన్న ఆశతోనే పెట్టుబడులు వస్తాయి. ఫలితంగా కరెన్సీ మారకం విలువా పెరుగుతుంది. రేట్లు తగ్గితే ప్రయోజనాలూ తగ్గుతాయి కనుక.. ఇన్వెస్ట్‌మెంట్ల రాక తగ్గి, వచ్చిన పెట్టుబడుల్లో కొన్ని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయే అవకాశం ఉంది. ఫలితంగా కరెన్సీ విలువా తగ్గుతుంది. ఇక అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ గానీ వడ్డీ రేట్లు పెంచిందంటే.. ఇక్కడికి వచ్చిన విదేశీ నిధులు వెనక్కి వెళ్లిపోవచ్చు.
 
 పొదుపు
 ఆర్‌బీఐ పాలసీ రేట్లు ఎప్పుడు తగ్గించినా.. బ్యాంకులు ముందుగా డిపాజిట్ రేట్లు తగ్గించేస్తుంటాయి. రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాల్సి వచ్చినప్పుడు.. అధిక వడ్డీ ఇచ్చి డిపాజిట్లు సమీకరించేందుకు అవి ఇష్టపడవు. కనుక, తాజా పరిణామంతో సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కావొచ్చు.. ఫిక్సిడ్ డిపాజిట్లు కావొచ్చు... వీటిపై వడ్డీ రేటు తగ్గుతుంది.
 
 ఈక్విటీ మార్కెట్లు..
  స్టాక్ మార్కెట్లకు అనేక రకాలుగా ప్రయోజనాలు ఉంటాయి. ముందుగా వడ్డీ రేట్లు తగ్గడం వల్ల కంపెనీలకు రుణాలపై ఆర్థిక భారం కొంత తగ్గి, ఆ మేరకు ఆదాయాలు మెరుగుపడతాయి. వడ్డీ భారం తగ్గుతుంది కనుక లాభాలు, వేల్యుయేషన్లూ పెరుగుతాయి. ఇక డెట్ సాధనాలపై వచ్చే రాబడులు తగ్గిపోతాయి కనుక .. ఆ నిధులు కొంత అధిక రాబడుల ఆశతో స్టాక్ మార్కెట్లలోకి రాగలవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement