జంషెడ్‌పూర్: ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌కు రాబోయే మూడు దశాబ్దాలు అభివృద్ధి విషయంలో కీలకమైనవని టాటా స్టీల్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. గత 30–40 ఏళ్లలో చైనా వేగంగా అభివృద్ధి చెందిందని, ఇక ఇదే విధమైన వృద్ధి తీరును భారత్ కొనసాగించే సమయం ఆసన్నమైందని ఇక్కడ సింగ్‌భూమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎస్‌సీసీఐ) సభ్యులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
► ప్రస్తుతం చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి చేసే దేశం. భారత్ రెండవ స్థానంలో ఉంది. ఉక్కు రంగం ఎదుర్కొంటున్న ప్రపంచ సవాళ్లను, ధరలను దృష్టిలో ఉంచుకుని మనం విధాన కల్పనలో ముందుకుసాగాలి.
► భారత్‌లో గత రెండు, మూడేళ్లలో మౌలిక సదుపాయాల రంగం ఊపందుకుంది. దీని ఫలితంగా ప్రైవేట్ స్టీల్ దిగ్గజ సంస్థల ద్వారా సరఫరా పెరిగింది.
► టాటా స్టీల్‌కు చెందిన జంషెడ్‌పూర్ ప్లాంట్ జనసాంద్రత కలిగిన ప్రాంతంలో ఉన్నందున, ఇక్కడి ప్లాంట్‌ను మరింత విస్తరించే అవకాశం లేదు.
► సింగ్‌భూమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీతో టాటా స్టీల్ సంబంధాలు నిరంతరం బలపడుతున్నాయి. ఇది మరింత పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతుంది.
► కంపెనీ వృద్ధిలో కారి్మకులు చేసిన త్యాగాలు చిరస్మరణీయం. టాటా స్టీల్ ఒక ‘‘బహుళ తరం కంపెనీ’’. టాటా స్టీల్– టాటా వర్కర్స్ యూనియన్‌ల మధ్య ఉన్న సత్సంబంధాలు కంపెనీని ముందుకు నడిపించాయి. ప్రపంచ ఆర్థిక, ఫైనాన్షియల్ పరిస్థితులు అనిశి్చతిగా ఉన్నప్పటికీ కంపెనీ విజయాలు గర్వకారణం.
► ఎకానమీ, పరిశ్రమల పురోగతిలో సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) కీలకం. ఎంఎస్‌ఎంఈ నాణ్యమైన ఉత్పత్తులపై ఆధారపడే పెద్ద పరిశ్రమలు పురోగమిస్తాయి. పెద్ద పరిశ్రమలకు ఎంఎస్‌ఎంఈలే వెన్నెముక. టాటా స్టీల్ ఒక పెద్ద కంపెనీ. దాని వెన్నెముక కూడా ఎంఎస్‌ఎంఈ యూనిట్లే. ఎంఎస్‌ఎంఈలకు సంబంధించినంత వరకు జంషెడ్‌పూర్ ఒక ముఖ్యమైన ప్రదేశం.
సంస్థ పురోగతి హర్షణీయం: ఆనంద్ మూన్కా
కాగా, సింగ్‌భూమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ విజయ్ ఆనంద్ మూన్కా తన స్వాగత ప్రసంగంలో నరేంద్రన్ అద్భుత నాయకత్వంలో టాటా స్టీల్ నిరంతరం అభివృద్ధి చెందుతోందని ప్రశంసించారు. జంషెడ్‌పూర్ పరిసరాల్లో విమానాశ్రయం అభివృద్ధికి టాటా స్టీల్ ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment