TV Narendran
-
T V Narendren: రానున్న మూడు దశాబ్దాలు భారత్‌కు కీలకం
జంషెడ్పూర్: ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌కు రాబోయే మూడు దశాబ్దాలు అభివృద్ధి విషయంలో కీలకమైనవని టాటా స్టీల్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. గత 30–40 ఏళ్లలో చైనా వేగంగా అభివృద్ధి చెందిందని, ఇక ఇదే విధమైన వృద్ధి తీరును భారత్ కొనసాగించే సమయం ఆసన్నమైందని ఇక్కడ సింగ్భూమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎస్‌సీసీఐ) సభ్యులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► ప్రస్తుతం చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి చేసే దేశం. భారత్ రెండవ స్థానంలో ఉంది. ఉక్కు రంగం ఎదుర్కొంటున్న ప్రపంచ సవాళ్లను, ధరలను దృష్టిలో ఉంచుకుని మనం విధాన కల్పనలో ముందుకుసాగాలి. ► భారత్‌లో గత రెండు, మూడేళ్లలో మౌలిక సదుపాయాల రంగం ఊపందుకుంది. దీని ఫలితంగా ప్రైవేట్ స్టీల్ దిగ్గజ సంస్థల ద్వారా సరఫరా పెరిగింది. ► టాటా స్టీల్‌కు చెందిన జంషెడ్పూర్ ప్లాంట్ జనసాంద్రత కలిగిన ప్రాంతంలో ఉన్నందున, ఇక్కడి ప్లాంట్‌ను మరింత విస్తరించే అవకాశం లేదు. ► సింగ్భూమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీతో టాటా స్టీల్ సంబంధాలు నిరంతరం బలపడుతున్నాయి. ఇది మరింత పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతుంది. ► కంపెనీ వృద్ధిలో కారి్మకులు చేసిన త్యాగాలు చిరస్మరణీయం. టాటా స్టీల్ ఒక ‘‘బహుళ తరం కంపెనీ’’. టాటా స్టీల్– టాటా వర్కర్స్ యూనియన్ల మధ్య ఉన్న సత్సంబంధాలు కంపెనీని ముందుకు నడిపించాయి. ప్రపంచ ఆర్థిక, ఫైనాన్షియల్ పరిస్థితులు అనిశి్చతిగా ఉన్నప్పటికీ కంపెనీ విజయాలు గర్వకారణం. ► ఎకానమీ, పరిశ్రమల పురోగతిలో సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) కీలకం. ఎంఎస్ఎంఈ నాణ్యమైన ఉత్పత్తులపై ఆధారపడే పెద్ద పరిశ్రమలు పురోగమిస్తాయి. పెద్ద పరిశ్రమలకు ఎంఎస్ఎంఈలే వెన్నెముక. టాటా స్టీల్ ఒక పెద్ద కంపెనీ. దాని వెన్నెముక కూడా ఎంఎస్ఎంఈ యూనిట్లే. ఎంఎస్ఎంఈలకు సంబంధించినంత వరకు జంషెడ్పూర్ ఒక ముఖ్యమైన ప్రదేశం. సంస్థ పురోగతి హర్షణీయం: ఆనంద్ మూన్కా కాగా, సింగ్భూమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ విజయ్ ఆనంద్ మూన్కా తన స్వాగత ప్రసంగంలో నరేంద్రన్ అద్భుత నాయకత్వంలో టాటా స్టీల్ నిరంతరం అభివృద్ధి చెందుతోందని ప్రశంసించారు. జంషెడ్పూర్ పరిసరాల్లో విమానాశ్రయం అభివృద్ధికి టాటా స్టీల్ ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
ఆ ఆలోచనే లేదు.. టాటా స్టీల్ సీఈవో కీలక ప్రకటన
న్యూఢిల్లీ: కొత్తగా ఏ ఇతర కంపెనీలనూ కొనుగోలు చేసే యోచనలో లేమని ప్రయివేట్ రంగ మెటల్ దిగ్గజం టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ తాజాగా పేర్కొన్నారు. ఇటీవల స్టీల్, స్టీల్ తయారీ ముడిసరుకుల తయారీ బిజినెస్‌ల నిర్వహణపై బిలియనీర్ అనిల్ అగర్వాల్ గ్రూప్ కంపెనీ వేదాంతా.. సమీక్షను చేపట్టిన నేపథ్యంలో నరేంద్రన్ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. స్టీల్ బిజినెస్‌పై పునఃసమీక్షతోపాటు, విలువ మదింపును చేపట్టినట్లు జూన్‌లో వేదాంతా ప్రకటించింది. తద్వారా విడిగా లేదా పూర్తి స్టీల్ సంబంధ విభాగాల వ్యూహాత్మక విక్రయానికి తెరతీసే వీలున్నట్లు వెల్లడించింది. అయితే ఈ అంశంపై విలేకరుల ప్రశ్నలకు స్పందిస్తూ నరేంద్రన్ కొత్తగా ఇతర కంపెనీల కొనుగోళ్లపై అంతగా ఆసక్తి లేదని స్పష్టం చేశారు. కంపెనీ సొంత బిజినెస్‌ల విషయంలో ఇంకా చేయవలసినది చాలా ఉన్నట్లు పేర్కొన్నారు. స్టీల్ తయారీలో 2030కల్లా దేశీయంగా 4 కోట్ల టన్నుల వార్షిక సామర్థ్యాన్ని అందుకోవలసి ఉన్నట్లు తెలియజేశారు. టాటా స్టీల్ ప్రస్తుతం 2.2 కోట్ల టన్నుల వార్షిక సామర్థ్యాన్ని కలిగి ఉన్న విషయం విదితమే. కాగా.. దివాలా పరిష్కారంలో భాగంగా 2018 జూన్‌లో వేదాంతా.. జార్ఖండ్‌లోని ఈఎస్ఎల్ స్టీల్ లిమిటెడ్‌ను సొంతం చేసుకుంది. తదుపరి 2.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో కొత్త ప్లాంటును ఏర్పాటు చేసింది. -
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎకానమీ గ్రోత్ ఎంతంటే!
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) 7.5 శాతం నుంచి 8 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్లు పారిశ్రామిక వేదిక– సీఐఐ ప్రెసిడెంట్ టీవీ నరేంద్రన్ అభిప్రాయపడ్డారు. దేశ వృద్ధిలో ఎగుమతులు కీలక పాత్ర పోషిస్తాయని కూడా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నరేంద్రన్ అభిప్రాయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 7.2 శాతం అంచనాలకన్నా అధికంగా ఉండడం గమనార్హం. ఏప్రిల్ మొదటి వారంలో జరిగిన 2022–23 ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను ఆర్బీఐ ఏకంగా 60 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించిన సంగతి తెలిసిందే. దీనితో ఈ అంచనా 7.8 శాతం నుంచి 7.2 శాతానికి దిగివచ్చింది. ఈ నేపథ్యంలో ఎకానమీపై సీఐఐ ప్రెసిడెంట్ అభిప్రాయాలు ఇవీ... ►కోవిడ్–19 మహమ్మారి తదుపరి వేవ్‌ను, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రభావాలను తట్టుకోడానికి దేశం సిద్ధంగా ఉండాలి. ఈ సవాళ్లను దేశం ఎదుర్కొంటుందన్న భరోసా ఉంది. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి పథాన్ని నిలుపుకోగలదని మేము విశ్వసిస్తున్నాము. ప్రత్యేకించి ఎగుమతి విషయంలో మేము చాలా ఆశాజనకంగా ఉన్నాము. భారతదేశ పురోగతిలో ఎగుమతులు కీలక భాగమవుతాయి. ►ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ తాజా సవాళ్లు ప్రపంచ సప్లై చైన్‌పై ప్రభావం చూపుతుంది. ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనా 7.5–8 శాతం ఉంటుందని భావిస్తున్నాం. ► కోవిడ్ సవాళ్లకు సంబంధించి అనుభవాలు చూస్తే, ప్రపంచవ్యాప్తంగా కొత్త వేవ్ ఉన్న ప్రతిసారీ, అది భారతదేశాన్ని కూడా తాకుతుంది. కాబట్టి, భవిష్యత్తులో వచ్చే వేవ్‌లను ఎదుర్కొనడానికి మనం సిద్ధంగా ఉండాలి. ►కోవిడ్‌ను ఎదుర్కొనడానికి పరిశ్రమ పటిష్ట రక్షణాత్మక ప్రోటోకాల్‌లను కలిగి ఉంది. మహమ్మారి నిర్వహణలో అలాగే ఇన్ఫెక్షన్లు పెరిగినప్పటికీ సురక్షితంగా పనిచేయడంలో సామర్థ్యానికి సంబంధించి మంచి అనుభవాన్ని సముపార్జించింది. ► గతంలో మైక్రో–కంటైన్మెంట్ (తక్కువ పరిధిలో ఆంక్షలు) వ్యూహం భారతదేశానికి బాగా పనిచేసింది. మళ్లీ భారీగా లాక్డౌన్ విధించే అవకాశం ఉండబోదని పరిశ్రమ విశ్వసిస్తోంది. ►ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ను నిర్వహించడంలో విస్తృతంగా ఆమోదించబడిన సూత్రం ఏమిటంటే, కఠినమైన లాక్డౌన్లకు వెళ్లడం కంటే దానితో జీవించడం నేర్చుకోవడం. దీనిని భారత్ అర్థం చేసుకుంది. ► చమురు, ఇతర వస్తువుల ధరల పెరుగుదల పరిశ్రమల మార్జిన్లు, వినియోగదారుల కొనుగోలు శక్తిపై ప్రభావం చూపుతోంది. అయితే భారతదేశంలో స్టాగ్ఫ్లేషన్ (ధరలు పెరుగుతూ, వస్తు డిమాండ్ పడిపోవడం) వంటి పదాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదని విశ్వసిస్తున్నాం. ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7.5–8 శాతం పరిధిలోనే ఉంటుందని భావిస్తున్నాం. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ భారత్ 8.2 శాతం వృద్ధి సాధిస్తుందని పేర్కొంటోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని అంచనా వేస్తోంది. సంవత్సరానికి సగటు ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్య పరిధిలోనే (2–6 శాతం) ఉంటుందని విశ్వసిస్తున్నాం. ►మహమ్మారి సంబంధిత ఆంక్షలు ఎత్తివేసినందున, వినియోగ డిమాండ్ బలంగా పుంజుకుంటోంది. ముఖ్యంగా కాంటాక్ట్–ఇంటెన్సివ్ రం గాలలో ఈ పరిస్థితి నెలకొనడం హర్షణీయం. ప్రపంచ ఎగుమతుల్లో కోకింగ్ కోల్ కీలకమైనది. ఈ ఎగుమతుల్లో రష్యా, ఉక్రెయిన్ వాటా దాదాపు 11 శాతం. ఉక్కుకు సంబంధించి కీలకమైన ముడి పదార్థం ఇది. సరఫరా అంతరాయాలు ఈ ఇన్పుట్ ధర పెరగడానికి కారణమయ్యాయి, ఇది భారతీయ ఉక్కు తయారీ సంస్థలపై ప్రభావం చూపుతోంది.గ్లోబల్ బొగ్గు ధరలు వార్షిక ప్రాతిపదికన ఇప్పటివరకు 400 శాతానికి పైగా పెరిగాయి. విద్యుత్ ఉత్పత్తితో పాటు అనేక తయారీ పరిశ్రమలలో కీలకమైన ముడి పదార్థంగా ఉండటం వల్ల ఆయా రంగాల వ్యయ భారాలు భారీగా పెరిగవచ్చు. యుద్ధ ప్రభావాల నుంచి తప్పించుకోలేం... యుద్ధ పరిణామాల నుంచి భారత్ తప్పించుకోలేదని నరేంద్రన్ స్పష్టం చేశారు. ఆయన దీనిపై ఏమన్నారంటే, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రభావాల గురించి పరిశీలిస్తే, మనం నివసిస్తున్న, పెరుగుతున్న ప్రపంచీకరణ, పరస్పరం అనుసంధానిత ప్రపంచంలో, ఏ దేశమూ దాని రాజకీయ సరిహద్దుల వెలుపల ఉత్పన్నమయ్యే సంఘటనల నుండి పూర్తిగా రక్షించబడదు. ఈ నేపథ్యంలో రష్యా లేదా ఉక్రెయిన్‌తో భారత్ ఆర్థిక సంబంధాలు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ యుద్ధం ప్రభావం భారత్‌పై తప్పనిసరిగా ఉం టుంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు మార్చిలో బేరల్‌కు 128 డాలర్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 100 డాలర్ల పైన కొనసాగుతున్నాయి. ఇది ద్రవ్యోల్బణాన్ని, పలు రంగాలలో ఇన్పుట్ వ్యయ భారాలను పెంచే విషయం. -
రూ. 3 లక్షల కోట్ల ఉద్దీపన అవసరం
న్యూఢిల్లీ: కరోనా కష్టాల్లో కూరుకుపోయిన ఎకానమీకి ఊతం ఇవ్వడానికి రూ.3 లక్షల కోట్ల ఉద్దీపన అవసరమని ఇండస్ట్రీ చాంబర్ సీఐఐ ప్రెసిడెంట్ టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. ఉద్దీపనలో భాగంగా జన్ ధన్ అకౌంట్ల ద్వారా కుటుంబాలకు ప్రత్యక్ష నగదు బదలాయింపు జరపాలనీ ఆయన సూచించారు. బ్రిటన్ తరహాలో వ్యాక్సినేషన్ సత్వర విస్తృతికి ‘వ్యాక్సిన్ జార్’ను (లేదా మంత్రి) నియమించాలని సిఫారసు చేశారు. దేశ ఆర్థిక పురోగతి విషయమై విలేకరులతో ఆయన మాట్లాడిన అంశాల్లో ముఖ్యమైనవి... ► భారత్ ఎకానమీ వినియోగ ఆధారితమైనది.ఈ డిమాండ్‌ను మహమ్మారి తీవ్రంగా దెబ్బతీసింది. ఈ పరిస్థితుల్లో నగదు ప్రత్యక్ష బదలాయింపు కీలకమని సీఐఐ భావిస్తోంది. ► ఎంఎన్ఆర్ఈజీఏ (మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) కింద కేటాయింపులు మరింత పెంచాలి. ► వస్తు సేవల పన్ను(జీఎస్టీ) తగ్గింపులు డిమా ండ్ పురోగతికి దోహదపడుతుంది. గృహ కొనుగోలుదారులకు స్టాంప్ డ్యూటీ, వడ్డీ రాయితీలు అవసరం. గతేడాది తరహాలో ఎట్‌టీసీ క్యాష్ వోచర్ స్కీమ్ ఆత్మనిర్బర్ భారత్ రోజ్‌గార్ యోజనను 2022 మార్చి 31 వరకూ పొడిగించాలి. ► లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎం ఎస్ఎంఈ) సహా కంపెనీలకు సకాలంలో తగిన అన్ని చెల్లింపులూ జరిగేలా చర్యలు తీసుకోవాలి. ► వృద్ధికి సంబంధించి వ్యయాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో సత్వర పురోగతి ఉండాలి. ► దేశంలోని వయోజనులు అందరికీ 2021 డిసెంబర్ కల్లా వ్యాక్సినేషన్ పుర్తికావాలి. ఇందుకు రోజుకు సగటున కనీసం 71.2 లక్షల డోసేజ్ వ్యాక్సినేషన్ జరగాలి. ఈ దిశలో ఏజెన్సీలు, రాష్ట్రాలు, కేంద్రం, ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల మధ్య సమన్వయ సహకారం అవసరం. వ్యాక్సినేషన్ ఆవశ్యకత ప్రచారానికి క్రీడా, సినీ ప్రముఖుల సేవలను వినియోగించుకోవాలి. ► కోవిడ్–19 మూడవ వేవ్ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ కేర్ కేంద్రాల ఏర్పాటుకు జిల్లా పాలనా యంత్రాంగాలు, ప్రైవేటు రంగ భాగస్వాములు దృష్టి సారించాలి. ► బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య సత్వర పరిష్కారానికి కృషి చేయాలి. ► భవిష్యత్‌లో ఎటువంటి మహమ్మారినైనా తట్టుకుని నిలబడ్డానికి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి. -
సీఐఐ ప్రెసిడెంట్‌గా నరేంద్రన్
న్యూఢిల్లీ: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నూతన ప్రెసిడెంట్‌గా 2021–22 సంవత్సరానికిగాను టాటా స్టీల్ సీఈవో, ఎండీ టి.వి.నరేంద్రన్ నియమితులయ్యారు. 2016–17లో సీఐఐ తూర్పు ప్రాంత చైర్మన్‌గా ఆయన వ్యవహరించారు. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఎక్స్ఎల్ఆర్ఐ జంషెడ్పూర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్‌గా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ వైస్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. సీఐఐ ప్రెసిడెంట్ డెసిగ్నేట్గా బజాజ్ ఫిన్సర్వ్ సీఎండీ సంజీవ్ బజాజ్ ఎన్నికయ్యారు. అలాగే సీఐఐ వైస్ ప్రెసిడెంట్‌గా హీరో మోటోకార్ప్ చైర్మన్, సీఈవో పవన్ ముంజాల్ బాధ్యతలు చేపట్టారు. -
టాటా స్టీల్‌కు డీమోనిటైజేషన్ సెగ
జంషెడ్పూర్: పెద్ద నోట్ల రద్దు ప్రభావం తమ వ్యాపార కార్యకలాపాలపై గణనీయంగానే ఉందని టాటా స్టీల్ వెల్లడించింది. అయితే, ఇది తాత్కాలికమే కాగలదని.. పరిస్థితులు త్వరలోనే మెరుగుపడగలవని సంస్థ ఎండీ (భారత్, ఆగ్నేయాసియా) టీవీ నరేంద్రన్ తెలిపారు. డీమోనిటైజేషన్ ప్రభావాలు ఎలా ఉన్నప్పటికీ.. జంషెడ్పూర్, కళింగనగర్లలోని తమ ప్లాంట్లలో ఉత్పత్తి యథాప్రకారమే కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. నగదు ఆధారిత గ్రామీణ మార్కెట్లలో డీమోనిటైజేషన్ సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వం తలపెట్టిన నగదు రహిత లావాదేవీల ప్రతిపాదనకు తోడ్పాటునిచ్చేలా గ్రామీణ ప్రాంతాల్లో 10,000 పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్), క్రెడిట్, డెబిట్ కార్డు స్వైపింగ్ మెషీన్లను ఇన్స్టాల్ చేస్తున్నట్లు నరేంద్రన్ వివరించారు.