న్యూఢిల్లీ: కొత్తగా ఏ ఇతర కంపెనీలనూ కొనుగోలు చేసే యోచనలో లేమని ప్రయివేట్ రంగ మెటల్ దిగ్గజం టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ తాజాగా పేర్కొన్నారు. ఇటీవల స్టీల్, స్టీల్ తయారీ ముడిసరుకుల తయారీ బిజినెస్‌ల నిర్వహణపై బిలియనీర్ అనిల్ అగర్వాల్ గ్రూప్ కంపెనీ వేదాంతా.. సమీక్షను చేపట్టిన నేపథ్యంలో నరేంద్రన్ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
స్టీల్ బిజినెస్‌పై పునఃసమీక్షతోపాటు, విలువ మదింపును చేపట్టినట్లు జూన్‌లో వేదాంతా ప్రకటించింది. తద్వారా విడిగా లేదా పూర్తి స్టీల్ సంబంధ విభాగాల వ్యూహాత్మక విక్రయానికి తెరతీసే వీలున్నట్లు వెల్లడించింది. అయితే ఈ అంశంపై విలేకరుల ప్రశ్నలకు స్పందిస్తూ నరేంద్రన్ కొత్తగా ఇతర కంపెనీల కొనుగోళ్లపై అంతగా ఆసక్తి లేదని స్పష్టం చేశారు. కంపెనీ సొంత బిజినెస్‌ల విషయంలో ఇంకా చేయవలసినది చాలా ఉన్నట్లు పేర్కొన్నారు.
స్టీల్ తయారీలో 2030కల్లా దేశీయంగా 4 కోట్ల టన్నుల వార్షిక సామర్థ్యాన్ని అందుకోవలసి ఉన్నట్లు తెలియజేశారు. టాటా స్టీల్ ప్రస్తుతం 2.2 కోట్ల టన్నుల వార్షిక సామర్థ్యాన్ని కలిగి ఉన్న విషయం విదితమే. కాగా.. దివాలా పరిష్కారంలో భాగంగా 2018 జూన్‌లో వేదాంతా.. జార్ఖండ్‌లోని ఈఎస్‌ఎల్ స్టీల్ లిమిటెడ్‌ను సొంతం చేసుకుంది. తదుపరి 2.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో కొత్త ప్లాంటును ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment