ముంబై: ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ ఫలితాల ప్రకటనతో గతేడాది క్యూ4 (జనవరి–మార్చి) సీజన్ ప్రారంభమైంది. శుక్రవారం వెల్లడైన ఈ సంస్థల ఫలితాలు ప్రోత్సాహకరంగా వున్న నేపథ్యంలో.. ఇక మీదట ఫలితాలను ప్రకటించనున్న కంపెనీలపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. ఇదే పాజిటివ్ ట్రెండ్ కొనసాగితే.. వచ్చే కొన్ని రోజుల్లోనే నూతన శిఖరాలను చేరవచ్చని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈవారంలో మార్కెట్ కదలికలు ఏవిధంగా ఉండవచ్చనే అంశంపై స్పందించిన ఎడిల్‌వీస్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్.. ‘సాధారణ ఎన్నికల కారణంగా భారత వీఐఎక్స్ (వొలటాలిటీ ఇండెక్స్) 20 స్థాయిని అధిగమించింది. ఇది రానున్న రోజుల్లో మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉంటుందనేందుకు సంకేతం’ అని విశ్లేషించారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ బాటమింగ్ అవుట్ అవుతోంది.
మెరుగైన ఆర్థిక నిర్వహణతో కూడిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సత్ఫలితాలను ఇవ్వనుందని భావిస్తున్నాం. ఈ కారణంగా మార్కెట్ పడిన ప్రతిసారీ కొనుగోళ్ళు జరపడం మంచి స్ట్రాటజీగా సూచిస్తున్నట్లు చెప్పారాయన. ‘సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈనెల 18న రెండో దశ పోలింగ్ ప్రారంభంకానుంది. ప్రస్తుత ఎన్నికల వేడిలో... అధికార పార్టీనే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందనే అంచనాలు బలంగా కొనసాగుతున్నందున మార్కెట్ మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్లనుందని అంచనావేస్తున్నాం’ అని ఎస్‌ఎమ్‌సీ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్ డీ కే అగర్వాల్ అన్నారు. అయితే, ఒడిదుడుకులు మాత్రం కొనసాగుతాయని అంచనావేశారు. మరోవైపు ఈవారంలో ట్రేడింగ్ కేవలం మూడు రోజులకే పరిమితమైంది. మహావీర్ జయంతి సందర్భంగా 17న (బుధవారం) మార్కెట్లకు సెలవు కాగా, 19న (శుక్రవారం) గుడ్ ఫ్రైడే సెలవు ఉన్నట్లు ఎక్సే్ఛంజీలు ప్రకటించాయి.
ఆర్‌ఐఎల్ ఫలితాలు ఈవారంలోనే..
మార్కెట్ విలువ పరంగా దేశీ అతిపెద్ద కంపెనీగా ఎదిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) ఈవారంలోనే క్యూ4 ఫలితాలను ప్రకటించనుంది. ఆయిల్ రిటైల్ నుంచి విభిన్న రంగాల్లో వ్యాపారం కొనసాగిస్తున్న ఈ సంస్థ.. జియో పేరుతో టెలికం రంగంలో దూసుకుపోతోంది. 18న (గురువారం) ఫలితాలను వెల్లడించనుంది. రిఫైనరీ, పెట్రోకెమికల్ విభాగాలు ఫ్లాట్‌గా ఉండేందుకు అవకాశం ఉన్నప్పటికీ.. టెలికం, రిటైల్ విభాగాలు ఎర్నింగ్స్‌కు ఊతం ఇవ్వనున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈవారం ఫలితాలను ప్రకటించనున్న దిగ్గజ కంపెనీలను పరిశీలిస్తే.. విప్రో (మంగళవారం), మైండ్‌ట్రీ, క్రిసిల్ (బుధవారం).. ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, ఆర్‌బీఎల్ బ్యాంక్ (గురువారం), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (శుక్రవారం) ఫలితాలను ఇవ్వనున్నాయి. ఫలితాల సీజన్ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. తక్కువ బేస్ ఎఫెక్ట్, కార్పొరేట్ లెండింగ్ బ్యాంకుల లాభదాయకత, ఎనర్జీ రంగ కంపెనీల ఆరోగ్యకర వృద్ధి ప్రధాన సూచీలను నడిపించనున్నాయని షేర్‌ఖాన్ అడ్వైజరీ హెడ్ హేమంగ్ జానీ అన్నారు.
స్థూల ఆర్థిక అంశాలపై మార్కెట్ దృష్టి
ఈ ఏడాది మార్చి నెల టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ డేటాలను ప్రభుత్వం సోమవారం ప్రకటించనుంది. గురువారం మానిటరీ పాలసీ మినిట్స్, శుక్రవారం విదేశీ మారక నిల్వల డేటా వెల్లడికానున్నాయి. ఇక అంతర్జాతీయ అంశాల పరంగా.. అమెరికా వాణిజ్య గణాంకాలు బుధవారం వెల్లడికానుండగా.. రిటైల్ అమ్మకాల సమాచారం గురువారం వెల్లడికానుంది. జపాన్ సీపీఐ ద్రవ్యోల్బణం శుక్రవారం విడుదలకానుంది.
ముడిచమురు ధరల ప్రభావం
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ శుక్రవారం 0.69 శాతం పెరిగింది. 71.52 డాలర్ల వద్ద ముగిసింది. క్రమంగా పెరుగుతూ 70 డాలర్ల స్థాయిని అధిగమించిన క్రూడ్ ధర మరింత పెరిగితే సూచీల ప్రయాణానికి ప్రతికూల అంశంగా మారుతుందని ఎడిల్‌వీస్ సెక్యూరిటీస్ ఫారెక్స్ హెడ్ సజల్ గుప్తా అన్నారు.
కొనసాగుతున్న విదేశీ నిధుల వెల్లువ
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల పరంపరా కొనసాగుతోంది. ఫిబ్రవరిలో రూ.11,182 కోట్లు, మార్చిలో రూ.45,981 కోట్లను దేశీ మార్కెట్లలో పెట్టుబడిపెట్టిన వీరు.. ఏప్రిల్‌లో కూడా ఇదే ట్రెండ్‌ను కొనసాగించారు. ఏప్రిల్‌లో ఇప్పటివరకు రూ.11,096 కోట్లను నికరంగా ఇన్వెస్ట్‌చేసినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఈనెల 1–12 కాలంలో ఈమేరకు పెట్టుబడి పెట్టినట్లు వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment