గేరు మార్చు.. స్పీడు పెంచు! | Finance Minister Nirmala Sitharaman to present maiden Budget | Sakshi
Sakshi News home page

గేరు మార్చు.. స్పీడు పెంచు!

Published Fri, Jul 5 2019 5:34 AM | Last Updated on Fri, Jul 5 2019 10:03 AM

Finance Minister Nirmala Sitharaman to present maiden Budget - Sakshi

న్యూఢిల్లీ: అయిదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం మళ్లీ పుంజుకోనుంది. అయితే, 2024–25 నాటికి నిర్దేశించుకున్న 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్‌ ఎదగాలంటే మాత్రం... ఇటు పెట్టుబడులకు, అటు సంస్కరణలకు తోడ్పడేలా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. తద్వారా నిలకడగా 8 శాతం స్థాయిలో అధిక వృద్ధి సాధిస్తే తప్ప లక్ష్యాన్ని చేరుకోగలిగే పరిస్థితి లేదు. ఈ దిశగా ప్రైవేట్‌ పెట్టుబడులు, ఎగుమతులు, ఉద్యోగాల కల్పన పెరగటమనేది చాలా కీలకంగా నిలవనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ఈ అంశాలను వెల్లడించింది. బడ్జెట్‌కు ముందురోజు ప్రవేశపెట్టే ఆర్థిక సర్వే...  ఇటు ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించడంతో పాటు భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యలకు కూడా దిశానిర్దేశం చేసేదిగా ఉంటుంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శుక్రవారం (నేడు) పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఎకనమిక్‌ సర్వేకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది.  

పుంజుకోనున్న పెట్టుబడులు ..  
ఆర్థిక సర్వే అంచనాల ప్రకారం 2018–19లో 6.8%కి క్షీణించిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2019–20లో 7% స్థాయిలో నమోదు కానుంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వృద్ధి రేటు అయిదేళ్ల కనిష్ట స్థాయి అయిన 5.8%కి పడిపోయింది. ఇది చైనా నమోదు చేసిన 6.4% వృద్ధి కన్నా తక్కువ కావడం గమనార్హం.  ఇక 2011–12 నుంచి క్రమంగా తగ్గుతున్న పెట్టుబడుల రేటు.. ప్రస్తుతం కనిష్ట స్థాయికి చేరుకుందని, ఇక నుంచి మళ్లీ పుంజుకోగలదని ఆర్థిక సర్వే ఆశాభావం వ్యక్తం చేసింది. వినియోగదారుల డిమాండ్, బ్యాంకుల రుణాలు సైతం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని సర్వే తెలియజేసింది. అయితే, పన్ను వసూళ్లు, వ్యవసాయ రంగంపై పెరుగుతున్న ప్రభుత్వ వ్యయాల కారణంగా ద్రవ్యపరమైన ఒత్తిళ్లు తప్పకపోవచ్చని వివరించింది. ప్రస్తుతం 2.7 లక్షల కోట్ల డాలర్ల పరిమాణంతో భారత ఎకానమీ ప్రపంచంలో ఆరో స్థానంలో ఉంది. వచ్చే ఏడాది బ్రిటన్‌ను దాటేసి అయిదో స్థానానికి చేరొచ్చన్న అంచనాలున్నాయి.  

రుతుపవనాలు కీలకం..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019–20)లో చమురు ధరలు తగ్గవచ్చని ఆర్థిక సర్వే తెలిపింది. దేశ జీడీపీలో దాదాపు 60%గా ఉన్న వినియోగానికి ఇది ఊతమివ్వగలదని పేర్కొంది. కాకపోతే వినియోగం మందగించే రిస్కు లున్నాయని హెచ్చరించింది. ‘వ్యవసాయ రం గం రికవరీ, వ్యవసాయోత్పత్తుల ధరలే గ్రామీణ ప్రాం తాల్లో వినియోగానికి కీలకం కానున్నాయి. రుతుపవనాల పరిస్థితి వీటన్నింటినీ నిర్దేశిస్తుంది. కొన్ని ప్రాం తాల్లో సాధారణ స్థాయికన్నా తక్కువగా వర్షపాతం నమోదు కావొచ్చు. ఇది పంటల దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు’ అని సర్వే పేర్కొంది.

కార్మిక సంస్కరణలు ప్రధానం ..
దేశంలో డిమాండ్‌కు ఊతమివ్వాలన్నా, సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవాలన్నా, కార్మిక ఉత్పాదకత పెర గాలన్నా ప్రైవేట్‌ పెట్టుబడులు కీలకమని సర్వే తెలిపింది. ఇవే కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టేందుకు, ఉద్యోగాల కల్పనకు తోడ్పడగలవని వివరించింది. ప్రైవేట్‌ పెట్టుబడులను ఆకర్షించేందుకు కార్మిక రంగం మొదలైన వాటిల్లో వ్యవస్థాగత సంస్కరణలు అవసరమని పేర్కొంది. ఇక లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలు ప్రధానంగా ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, ఈ రంగం నుంచే వృద్ధికి మరింత ఊతం లభించగలదని ఆర్థిక సర్వే వివరించింది.

సర్వేలోని మరిన్ని ముఖ్యాంశాలివీ...
►  ఒప్పందాలు సక్రమంగా అమలయ్యేలా చూసేందుకు న్యాయవ్యవస్థలో సంస్కరణలు తేవాలి. పెట్టుబడులను ఆకర్షించేలా ఉండాలి.

►  2018–19లో ద్రవ్య లోటు 3.4 శాతంగా నమోదు కావొచ్చు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ద్రవ్య లోటు 5.8 శాతంగా ఉండొచ్చని అంచనా. అంతక్రితం ఏడాదిలో ఇది 6.4%.

►  రాజకీయ స్థిరత్వం వృద్ధి అవకాశాలకు సానుకూలాంశం. పెట్టుబడులు, వినియోగమే ఎకానమీ వృద్ధికి ఊతమివ్వనున్నాయి.  

►  2024–25 నాటికి భారత్‌ 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలంటే (ప్రస్తుత స్థాయికి రెట్టింపు) నిలకడగా 8 శాతం వృద్ధి రేటు నమోదు చేయాల్సి ఉంటుంది. పొదుపు, పెట్టుబడులు, ఎగుమతుల ద్వారానే ఇది సాధ్యపడగలదు.

►  చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) మరింత ఎదిగేందుకు, ఉద్యోగాలు కల్పించేందుకు, ఉత్పాదకత పెంచుకునేందుకు అనువైన విధానాలు ఉండాలి. ఎప్పటికీ చిన్న స్థాయిలోనే ఉండిపోయే సంస్థల కన్నా భవిష్యత్‌లో భారీగా ఎదిగే సత్తా ఉన్న అంకుర సంస్థలను ప్రోత్సహించాలి.

►  వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వైద్యంపై పెట్టుబడులు పెంచాలి. రిటైర్మెంట్‌ వయస్సునూ దశలవారీగా పెంచాలి.

►  తక్కువ జీతభత్యాలు, వేతనాల్లో అసమానతలే సమ్మిళిత వృద్ధి సాధనకు అవరోధాలుగా ఉంటున్నాయి. వీటిని సరి చేసేందుకు చట్టపరమైన సంస్కరణలు, స్థిరమైన విధానాలు అవసరం.  

►  కాంట్రాక్టుల అమలయ్యేలా చూసేందుకు సరైన వ్యవస్థ లేకపోవడమే వ్యాపారాలకు అనువైన దేశాల జాబితాలో ర్యాంకులను మెరుగుపర్చుకోవడానికి పెద్ద ప్రతిబంధకంగా మారుతోంది.

►  2018–19లో రూ. 38,931 కోట్ల విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ) తరలిపోయాయి. 2017–18లో నికరంగా రూ. 1,44,681 కోట్లు వచ్చాయి.

►  28 ప్రభుత్వ రంగ సంస్థల్లో వ్యూహాత్మక వాటాల విక్రయం విషయంలో ఆర్థిక శాఖ గణనీయ పురోగతి సాధించింది. మూడింట్లో వాటాల విక్రయం పూర్తి కూడా అయింది.  

►  2021 నాటికి ఉక్కు ఉత్పత్తి 128.6 మిలియన్‌ టన్నులకు చేరనుండగా, 2023 నాటికి వినియోగం 140 మిలియన్‌ టన్నులకు చేరనుంది. 2018–19లో ఉత్పత్తి 106.56 మిలియన్‌ టన్నులు.  

►  ఉపాధి లేని గ్రామాలను గుర్తించేందుకు, ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) ప్రయోజనాలను కల్పించేందుకు రియల్‌ టైమ్‌లో వివరాలు లభించేలా ప్రత్యేక సూచీని ఏర్పాటు చేయాలి.  

►   ప్రజలకు ప్రయోజనం చేకూర్చడంలో డేటా ప్రాధాన్యాన్ని గుర్తించి, దానిపై తగినంత ఇన్వెస్ట్‌ చేయాలి.  

►   2018–19లో దిగుమతులు 15.4 శాతం, ఎగుమతులు 12.5 శాతం వృద్ధి నమోదు చేసి ఉండొచ్చని అంచనా.

►   2018–19లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 283.4 మిలియన్‌ టన్నుల మేర ఉంటుంది.


ఆర్థిక క్రమశిక్షణే ముఖ్యం: సీఈఏ
కేంద్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే రూపకర్త, ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణియన్‌ స్పష్టం చేశారు. అలా కాకుండా ప్రభుత్వమే భారీగా రుణాలు సమీకరిస్తూ పోతే పెట్టుబడులకు అవకాశాలు దెబ్బతింటాయని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ‘అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి. నిధుల లభ్యత బాగుంది. కాబట్టి ఇటు ప్రైవేట్‌ సంస్థలు, అటు ప్రభుత్వం రుణాల సమీకరణ కోసం అటువైపు దృష్టి పెట్టొచ్చు. 8 శాతం వృద్ధి రేటు సాధించాలంటే జీడీపీలో పెట్టుబడులనేవి 30 శాతానికి పైగా ఉండాలి. చైనాలో ఇది 50 శాతానికి చేరింది. ప్రస్తుతం మన దగ్గర 29.6 శాతంగా ఉన్న పెట్టుబడుల రేటును 35 శాతం దాకానైనా పెంచుకోవాలి‘ అని సుబ్రమణియన్‌ చెప్పారు. ‘మన వృద్ధి రేటు బాగానే ఉంది. కానీ నిలకడగా 8 శాతం వృద్ధి రేటు సాధించాలంటే మనం గేర్లు మార్చాలి. టేకాఫ్‌ తీసుకోవడానికి ఇదే సరైన సమయం‘ అని ఆయన పేర్కొన్నారు.  


టాప్‌ ట్యాక్స్‌పేయర్స్‌కు ప్రత్యేక వెసులుబాట్లు..

సక్రమంగా పన్నులు చెల్లించడాన్ని ప్రోత్సహించే దిశగా ప్రతి జిల్లాలో టాప్‌ 10 ట్యాక్స్‌పేయర్స్‌కు ప్రత్యేక గుర్తింపునిచ్చే అంశాన్ని పరిశీలించాలని ఆర్థిక సర్వే సూచించింది. ఇమ్మిగ్రేషన్‌ కౌంటర్‌లో డిప్లమాటిక్‌ తరహా వెసులుబాట్లు, ఎయిర్‌పోర్టుల్లో ఎక్స్‌ప్రెస్‌ బోర్డింగ్‌ సదుపాయాలు కల్పించవచ్చని పేర్కొంది. అలాగే ఒక దశాబ్దకాలంలో అత్యధికంగా పన్నులు చెల్లించిన వారి పేర్లను ముఖ్యమైన భవంతులు, రహదారులు, రైళ్లు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఆస్పత్రులు, విమానాశ్రయాలకు పెట్టే అంశాన్ని కూడా పరిశీలించవచ్చని ఆర్థిక సర్వే సూచించింది. చాలా మంది కోరుకునే సామాజిక హోదాతో పాటు సంఘంలో గౌరవం కూడా లభించేలా ప్రత్యేక క్లబ్స్‌ను ఏర్పాటు చేయొచ్చని పేర్కొంది.


వ్యవసాయ రంగానికి తోడ్పాటు..

దేశీయంగా కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా ఉండొచ్చన్న వాతావరణ శాఖ అంచనా నేపథ్యంలో వ్యవసాయ రంగంలో నీటి వనరులను సమర్థంగా వినియోగించుకునేలా కొత్త విధానాలు ప్రవేశపెట్టాలని సర్వే సూచించింది. 2050 నాటికి భారత్‌లో నీటి వనరులు ఆందోళనకరంగా అడుగంటుతాయన్న వార్తల మధ్య .. ’భూమిపరమైన ఉత్పాదకత’పై కాకుండా ’సాగు నీటిపరమైన ఉత్పాదకత’ సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని పేర్కొంది. నీటి ఎద్దడిని అధిగమించేందుకు రైతాంగం జలవనరులను సమర్ధంగా వినియోగించుకునేలా ప్రోత్సహించాలని సూచించింది.


ఇన్‌ఫ్రాపై ఏటా 200 బిలియన్‌ డాలర్లు  
మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే దిశగా ఇన్‌ఫ్రా రంగంపై భారత్‌ వార్షిక వ్యయాలను దాదాపు రెట్టింపు చేయాలని, ఏటా 200 బిలియన్‌ డాలర్లు పెట్టాల్సి ఉంటుందని ఆర్థిక సర్వే వెల్లడించింది. 2032 నాటికి 10 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలంటే దానికి తగ్గ పటిష్టమైన మౌలిక సదుపాయాలూ ఉండాలని పేర్కొంది. అయితే ఈ క్రమంలో ప్రైవేట్‌ పెట్టుబడులు మరిన్ని వచ్చేలా చూడటమే పెద్ద సవాలుగా ఉండగలదని పేర్కొంది. ప్రస్తుతం భారత్‌ ఏటా కేవలం 100 నుంచి 110 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఇన్‌ఫ్రాపై వెచ్చించగలుగుతోందని వివరించింది.  


స్వచ్ఛ భారత్‌ లక్ష్యాల సాధన..
స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం లక్ష్యాలు చాలావరకూ నెరవేరాయని, పలు రాష్ట్రాల్లో ప్రతీ ఇంటా మరుగుదొడ్ల నిర్మాణంతో బహిరంగ మలవిసర్జన నూటికి నూరు శాతం నిల్చిందని ఆర్థిక సర్వే పేర్కొంది. 2014 అక్టోబర్‌లో ఈ పథకం ప్రారంభించినప్పట్నుంచీ దేశవ్యాప్తంగా 9.5 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని తెలిపింది. 2019 జూన్‌ 14 నాటికి 30 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో 100 శాతం కుటుంబాలకు మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయని వివరించింది. రాబోయే రోజుల్లో ఎస్‌బీఎం కింద ద్రవ, ఘన వ్యర్థాల విసర్జనపై దృష్టి సారించాల్సి ఉంటుందని సూచించింది.


విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలి..

ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సర్వే సూచించింది. వాటిపై పెట్టే వ్యయం తగ్గే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా వాహనదారులు ఎలక్ట్రిక్‌ వాహనాలవైపు మళ్లేలా చూడొచ్చని పేర్కొంది. ప్రస్తుతం విద్యుత్‌ వాహనాల వినియోగం నార్వేలో 39 శాతం, చైనాలో రెండు శాతం ఉండగా భారత్‌లో 0.06 శాతమే ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో చార్జింగ్‌ మౌలిక సదుపాయాలు పెంచడం వంటి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. మరోవైపు, విద్యుత్‌ వాహనాలపై ఆర్థిక సర్వే సూచనలను పరిశ్రమవర్గాలు స్వాగతించాయి.


కొత్త మార్కెట్లలో ఐటీకి బాటలు

భారత ఐటీ, ఐటీఈఎస్‌ సంస్థలు చాన్నాళ్లుగా సర్వీసులు అందిస్తున్న దేశాల్లో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న మార్కెట్లలో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంతో పాటు కొత్త మార్కెట్లపైనా అవి దృష్టి సారించాలి. యూరప్, జపాన్, చైనా, ఆఫ్రికా వంటి మార్కెట్లలో అవకాశాలు అందిపుచ్చుకోవాలి. ప్రస్తుతం దేశీ ఐటీ–బీపీఎం (బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌) ఎగుమతులు 2018–19లో 136 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. మొత్తం దేశీ ఐటీ–బీపీఎం పరిశ్రమ పరిమాణం 181 బిలియన్‌ డాలర్లుగా ఉంటుందని అంచనా. అటు స్టార్టప్‌ సంస్థలకు తోడ్పాటునిచ్చేలా పన్నులను క్రమబద్ధీకరించాలని కూడా సర్వే సూచించింది.


రిటైర్మెంట్‌ వయస్సు పెంచాలేమో...

 భారతీయుల జీవన ప్రమాణాలు పెరుగుతున్న నేపథ్యంలో పదవీ విరమణ వయస్సును కూడా పెంచే అవకాశాలు పరిశీలించాల్సి రావొచ్చని ఆర్థిక సర్వే సూచనప్రాయంగా తెలిపింది. వచ్చే రెండు దశాబ్దాల్లో జనాభా వృద్ధి గణనీయంగా మందగించే అవకాశం ఉందని పేర్కొంది. ఓవైపు యువ జనాభా (0–19 మధ్య వయస్సున్న వారు) సంఖ్య 2041 నాటికి 25 శాతానికి తగ్గనుండగా వృద్ధుల సంఖ్య (60 ఏళ్లు పైబడిన వారు) రెట్టింపై 16 శాతానికి చేరనుంది. ఇక ప్రాథమిక స్థాయి విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతున్నందున పాఠశాలలు లాభదాయకంగా నడవాలంటే కొన్నింటిని విలీనం చేయాల్సి రావొచ్చని ఆర్థిక సర్వే పేర్కొంది.


100 స్మార్ట్‌ సిటీలు..

స్మార్ట్‌ సిటీస్‌ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా దాదాపు 100 నగరాలు తలపెట్టగా, ఈ ప్రాజెక్టుల విలువ సుమారు రూ. 2.05 లక్షల కోట్లు ఉంటుందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఈ ప్రాజెక్టుల అమల్లో చెప్పుకోతగిన పురోగతి సాధించినట్లు తెలిపింది. నగర ప్రజలకు మెరుగైన జీవన విధానాలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో 2015 జూన్‌లో అయిదేళ్ల వ్యవధికి కేంద్రం స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌ (ఎస్‌సీఎం)ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం 100 నగరాల్లో 5,151 ప్రాజెక్టులు అమలవుతున్నాయి. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పట్టణ ప్రాంత) కింద ఇప్పటిదాకా 4,427 నగరాలు, పట్టణాలను చేర్చినట్లు తాజా
ఆర్థిక సర్వే పేర్కొంది.


ఐబీసీతో పటిష్టంగా రికవరీ..
ఇటీవలి కాలంలో ప్రవేశపెట్టిన కీలక ఆర్థిక సంస్కరణల్లో దివాలా స్మృతి (ఐబీసీ) ఒకటని, దీనివల్ల మొండిబాకీల రికవరీ వ్యవస్థ మరింత పటిష్టంగా మారిందని ఆర్థిక సర్వే తెలిపింది. ఇప్పటిదాకా దీని కింద రూ. 1.73 లక్షల కోట్ల క్లెయిమ్స్‌ సెటిల్‌ అయినట్లు వివరించింది. 94 కేసులు పరిష్కారమైనట్లు పేర్కొంది. మరోవైపు మొండిబాకీల భారం తగ్గడంతో బ్యాంకింగ్‌ రంగం పనితీరు కూడా మెరుగుపడిందని ఆర్థిక సర్వే వివరించింది.

ప్రధాన సూచీ 17 శాతం అప్‌..

గత ఆర్థిక సంవత్సరంలో  సెన్సెక్స్‌ 17 శాతం, నిఫ్టీ సుమారు 15 శాతం పెరిగాయని ఆర్థిక సర్వే తెలిపింది. 2018 మార్చి 31న 32,969గా ఉన్న సెన్సెక్స్‌ గతేడాది మార్చి 31న 38,673 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 10,114 నుంచి 11,624కి చేరింది.

ఆచరణాత్మక లక్ష్యం: పరిశ్రమ వర్గాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7 శాతంగా ఉండొచ్చన్న ఆర్థిక సర్వే అంచనాలను.. ఆచరణాత్మక లక్ష్యంగా పరిశ్రమవర్గాలు అభివర్ణించాయి. సర్వేలో పేర్కొన్నట్లుగా 2024–25 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదిగే క్రమంలో 8 శాతం వృద్ధి రేటు సాధించాలంటే.. ప్రైవేట్‌ పెట్టుబడులకు ప్రోత్సాహం లభించాలని, వినియోగం పెరగాలని పేర్కొన్నాయి. అలాగే నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు ఎదుర్కొంటున్న నిధుల కొరత వంటి సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుందని సీఐఐ, ఫిక్కీ, అసోచాం తదితర పరిశ్రమ సమాఖ్యలు అభిప్రాయపడ్డాయి. ‘7 శాతం వృద్ధి రేటు అంచనా కాస్త ఆచరణాత్మక లక్ష్యమే. విధానాలపరమైన తోడ్పాటు ఉన్నప్పుడు వచ్చే ఐదేళ్లలో సగటున 8 శాతం వృద్ధి రేటు కూడా సాధించవచ్చు‘ అని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ పేర్కొన్నారు. ‘పెట్టుబడులను ప్రోత్సహించడానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. కేంద్ర బడ్జెట్‌లో పెట్టుబడులు, వినియోగం, పొదుపును ప్రోత్సహించేలా నిర్దిష్ట చర్యలు ఉంటాయని ఆశిస్తున్నాం‘ అని ఫిక్కీ ప్రెసిడెంట్‌ సందీప్‌ సోమానీ చెప్పారు.

ఎగవేతదారులు నరకానికే!
ప్రస్తుతం దేశంలో ఎక్కువగా వినబడుతున్న మాట ‘ఎగవేత’ అంటే అతిశయోక్తి కాదేమో!!  పన్నులు, రుణాలను ఎగ్గొడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. సర్కారు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా పరిష్కారం మాత్రం అంతంతే. బహుశా! అందుకేనేమో!! ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు... ప్రభుత్వం ఎగవేతల కట్టడికి ‘మతం’ మంత్రం జపిస్తోంది. ప్రజలకున్న మత విశ్వాసాలను దీనికి విరుగుడుగా వాడాలని చూస్తోంది. ఆర్థిక సర్వేలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది.

హిందూ మతం ప్రకారం ఎవరైనాసరే అప్పు తీసుకొని ఎగ్గొట్టడం అంటే పాపం చుట్టుకోవడమేకాదు.. తీవ్రమైన నేరం కూడా!!. ఇక రుణగ్రస్తులుగా కన్ను మూస్తే... ఏకంగా నరకానికి పోతారన్నది నానుడి!! అందుకే ఆ నరకకూపంలోకి పోకుండా చూడాలంటే ఆ అప్పులన్నీ తీర్చాల్సిన బాధ్యత తమ పిల్లలదేనని కూడా పెద్దలు చెబుతుంటారు. ఇస్లాం, బైబిల్‌లో కూడా ఇలాంటి బోధనలే కనబడతాయి. భారతీయ సంస్కృతిలో అప్పులు ఎగ్గొట్టడం అంటే ఎంత పాపమో, నేరమో అన్నది మన మతాలే చెబుతున్నప్పుడు.. దీన్నే ప్రచారాస్త్రంగా వాడుకోవాలన్నది సర్వే చెబుతున్న సారాంశం. మరి మోదీ సర్కారు చేస్తున్న ఈ కొత్త ప్రయోగం ఏమేరకు ఫలిస్తుందో ఆ దేవుడికే తెలియాలి!!.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement