న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2023–24 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండవ త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్) అంచనాలను మించి 7.6 శాతంగా నమోదయ్యింది. చైనా వృద్ధి రేటు ఇదే కాలంలో 4.9 శాతంగా నమోదుకావడంతో ప్రపంచంలో తన వేగవంతమైన ఎకానమీ హోదాను సైతం భారత్ మరోసారి ఉద్ఘాటించింది. సమీక్షా త్రైమాసికంలో తయారీ, మైనింగ్, సేవలు చక్కటి పనితీరును ప్రదర్శించాయి. వ్యవసాయ రంగం మాత్రం బలహీన ఫలితాన్ని నమోదుచేసుకుంది.
మొదటి త్రైమాసికంలో భారత్ ఎకానమీ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదయ్యింది. రెండవ త్రైమాసికంలో ఈ రేటు 6.5 శాతానికి పరిమితం అవుతుందన్న అంచనాలను మించి పటిష్ట ఫలితం నమోదుకావడం పట్ల ఆర్థికవేత్తలు, విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో వృద్ధి 6.2 శాతం కావడం గమనార్హం. 2022–23లో భారత్ జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం. 2023–24లో ఈ రేటు 6.5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) అంచనావేస్తోంది.
7.6 శాతం వృద్ధి అంటే..
2011–12 ధరల ప్రకారం (ఈ సంవత్సరం బేస్‌గా ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసిన రియల్ ఎకానమీ వృద్ధి) 2022–23 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో భారత్ ఎకానమీ విలువ రూ.38.78 లక్షల కోట్లు. 2023–24 ఇదే కాలంలో (సమీక్షా కాలంలో) ఈ విలువ రూ.41.74 లక్షల కోట్లుగా నమోదయ్యింది. అంటే వృద్ధి రేటు 7.6 శాతమన్నమాట. ఇక ద్రవ్యోల్బణం సర్దుబాటు చేయకుండా కరెంట్ ప్రైస్ పాతిపదిక చూస్తే, ఇదే కాలంలో జీడీపీ వృద్ధి రేటు (నామినల్) రూ.65.67 లక్షల కోట్ల నుంచి రూ. 71.66 లక్షల కోట్లకు ఎగసింది. అంటే నామినల్ వృద్ధి రేటు 9.1 శాతంగా ఉంది. ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వరకూ చూస్తే... రియల్ జీడీపీ విలువ రూ.76.22 లక్షల కోట్ల నుంచి రూ. 82.11 లక్షల కోట్లకు ఎగసింది. అంటే ఆరు నెలల్లో వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదయ్యింది. ఇక ఇదే సమయంలో నామినల్ రేటు 8.6 శాతంగా ఉంది.
రంగాల వారీగా వృద్ధి తీరు ఇలా...
వస్తువులు, సేవల ఉత్పత్తికి సంబంధించి గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ)విలువల ప్రకారం... జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) రంగాల వారీగా విడుదల చేసిన ఫలితాలు పరిశీలిస్తే...
తయారీ: మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 78 శాతం వాటా కలిగిన ఈ రంగంలో వృద్ధి భారీగా 13.9 శాతంగా నమోదయ్యింది. 2022 ఇదే కాలంలో అసలు వృద్ధిలేకపోగా 3.8 శాతం క్షీణత నమోదయ్యింది.
► గనులు, తవ్వకాలు: ఈ రంగంలో 0.1 శాతం క్షీణత సమీక్ష కాలంలో 10 శాతం వృద్ధిలోకి మారింది.
►విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవలు: వృద్ధి రేటు 6.1 శాతం నుంచి 10.1 శాతానికి ఎగసింది.
►నిర్మాణం: వృద్ధి రేటు 5.7 శాతం నుంచి 13.3 శాతానికి ఎగసింది.
►వ్యవసాయం: ఎకానమీలో దాదాపు 15 శాతం వాటా ఉన్న ఈ కీలక రంగంలో వృద్ధి రేటు (2022 ఇదే కాలంతో పోల్చిచూస్తే) 2.5 శాతం నుంచి 1.2 శాతానికి తగ్గింది.
►ఫైనాన్షియల్, రియలీ్ట, ప్రొఫెషనల్ సేవలు: 7.1% నుంచి వృద్ధి 6 శాతానికి పడిపోయింది.
►ఎకానమీ పటిష్టతకు ప్రతిబింబం
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరీక్షా కాలంలో ఎదురవుతున్న సవాళ్లను భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్ట స్థాయిలో తట్టుకుని నిలబడుతోందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరిన్ని అవకాశాలను సృష్టించేందుకు, పేదరికాన్ని త్వరితగతిన నిర్మూలించడానికి, మన ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, వేగవంతమైన వృద్ధిని కొనసాగించడానికి కట్టుబడి ఉన్నాము.
– ప్రధాని నరేంద్ర మోదీ
Comments
Please login to add a commentAdd a comment