చేదు మాత్రలు తప్పవు
రాబోయే రెండేళ్లు కఠిన నిర్ణయాలు అవసరం: మోడీ
దేశ ఆర్థిక వ్యవస్థను గత యూపీఏ సర్కారు అధఃపాతాళానికి దిగజార్చింది
రాష్ట్రాల ప్రగతితోనే దేశ సుసంపన్నత..కేంద్ర, రాష్ట్రాలు జట్టుగా పనిచేయాలి
పణజిలో బీజేపీ కార్యకర్తల సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యలు
త్వరలో ‘సాగరమాల’కు రూపకల్పన
పణజి: రోగగ్రస్తమైన దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలంటే రాబోయే రెండేళ్లలో.. చేదు మాత్రలతో కఠిన నిర్ణయాలు తప్పవని.. ఇవి కొన్ని వర్గాల వారికి మింగుడుపడక పోవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ విషయంలో గత యూపీఏ ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యను శనివారం జాతికి అంకితం చేసిన కార్యక్రమం అనంతరం మూడు వేరువేరు కార్యక్రమాల్లో మోడీ పాల్గొన్నారు. మొదట పణజిలో బీజేపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. తర్వాత ఓ స్టార్ హోటల్లో 150 మంది ప్రత్యేక ఆహ్వానితులైన పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. అనంతరం మాండవి నదిపై వంతెనకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మోడీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
పణజిలో బీజేపీ కార్యకర్తల సదస్సులో..
► యూపీఏ హయాంలో పదేళ్ల పాటు అసలు పాలనే లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యపరిస్థితి అధఃపాతాళానికి దిగజారింది. ఖజానా ఖాళీ అయిన పరిస్థితుల్లో దేశ పాలనాపగ్గాలు చేపట్టాను. ఇప్పుడిక దేశ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దాల్సి ఉంది.
► ఆర్థిక క్రమశిక్షణను తీసుకురావటానికి.. రాబోయే ఒకటి, రెండు సంవత్సరాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఈ నిర్ణయాలు అందరికీ నచ్చకపోవచ్చు. దేశం నాకు ఇచ్చిన అపారమైన ప్రేమకు.. ఈ నిర్ణయాలు గండి కొట్టవచ్చని నాకు బాగా తెలుసు. కానీ.. ఈ చర్యల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని నా దేశ ప్రజలు గుర్తించినప్పుడు ఆ ప్రేమను నేను తిరిగి పొందుతాను.
► రాష్ట్రాల సుసంపన్నత దేశ ప్రగతిపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల కోసం, పథకాల కోసం గతంలో మాదిరిగా కేంద్రం వద్ద ప్రాధేయపడాల్సిన అవసరం ఇక లేదు. రాష్ట్రాలు, కేంద్రం ఒక జట్టుగా కలిసి పనిచేయాలి. భారత రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థ గురించి చెప్తోంది. అయితే.. మేం సహకార సమాఖ్య విధానం అనే కొత్త విధానాన్ని రూపొందించాం.
పారిశ్రామికవేత్తలతో భేటీలో..
► పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు, నైపుణ్యాల అభివద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. నైపుణ్యం గల సిబ్బంది ప్రోత్సాహానికి అభివద్ధి చెందిన దేశాలు సైతం ప్రాధాన్యం ఇస్తున్నాయి.
► దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ల లోపు వయసున్న వారే. నైపుణ్యాల అభివద్ధికి ప్రోత్సాహమివ్వటం ద్వారా.. చదువుకున్న నిరుద్యోగులకు దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ తగినన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
► ఆర్థికాభివద్ధికి తోడ్పాటునందించేందుకు, వ్యయం తగ్గించేందుకు పొదుపు చర్యలు చేపడుతాం. ఆర్థిక రంగ పునరుజ్జీవానికి భారీ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తాం.
► 2022 సంవత్సరానికి దేశానికి స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లు పూర్తవుతాయి. అప్పటికల్లా దేశంలో ప్రతి ఒక్కరికీ నీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలతో కూడిన ఇళ్లను సమకూరుస్తాం.
మాండవి నదిపై వంతెనకు శంకుస్థాపన కార్యక్రమంలో..
► అన్ని తీరప్రాంత నగరాలు, పట్టణాలను రోడ్డు, రైలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలతో అనుసంధానించే ప్రతిష్టాత్మక ‘సాగర్‌మాల’ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తాం. దీనిద్వారా తీర నగరాల ప్రత్యేకత, ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుంది.
నేడు భూటాన్‌కు ప్రధాని: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం భూటాన్ పర్యటనకు వెళ్లనున్నారు. మూడు వారాల కిందట ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత మోడీ చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇది. రెండ్రోజులపాటు సాగనున్న ఈ పర్యటనలో మోడీ వెంట విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్, విదేశాంగ కార్యదర్శి సుజాతా సింగ్ ఉంటారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్‌చుక్, ప్రధాని షెరింగ్ తోబ్గేలతో మోడీ సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. భూటాన్ ఉభయ సభలను (జాతీయ అసెంబ్లీ, జాతీయ మండలి) ఉద్దేశించి ప్రసంగిస్తారు.