బీజేపీ, టీఆర్‌ఎస్ కలసిపోయినట్టే : ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ, టీఆర్‌ఎస్ కలసిపోవడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ముఖ్యనేతలు మల్లు భట్టివిక్రమార్క, మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులతో కలసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 26 నెలల తర్వాత రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించడం వల్ల ఒరిగిందేమిటని ప్రశ్నించారు. భవిష్యత్తులో టీఆర్‌ఎస్, బీజేపీ కలసి ప్రయాణం చేస్తాయనే సంకేతాన్ని ఈ పర్యటన ద్వారా ఇచ్చారని చెప్పారు. పొత్తుకోసం రెండు పార్టీలు తహతహలాడిపోతున్నాయని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.
అందుకే ప్రధాని మోదీని కేసీఆర్, సీఎం కేసీఆర్‌ను మోదీ పరస్పరం పొగుడుకున్నారని అన్నారు. మిషన్ భగీరథలో భారీ అవినీతి జరిగిందన్నారు. ఆ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా ఈ పథకాన్ని ప్రధాని మోదీతో ప్రారంభింపజేశారని ఉత్తమ్ ఆరోపించారు. గోదావరి నదీజలాల విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. యూపీఏ హయాంలో మంజూరైన పథకాలను, సగానికన్నా ఎక్కువగా పూర్తిచేసిన పనులను ప్రధాని మోదీ ప్రారంభించారని వివరించారు. తెలంగాణలోనూ దళితులకు అన్యాయం జరుగుతున్నదన్నారు.
దళితుల గురించి అనుచితంగా మాట్లాడి, అవమానించిన బీజేపీ ఎమ్మెల్యేపై ఆ పార్టీ ఇప్పటిదాకా ఏ చర్యలనూ తీసుకోలేదన్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేతలను గృహనిర్బంధంలో ఉంచడం, పోలీసుస్టేషన్లకు పంపడం అప్రజాస్వామికమని ఉత్తమ్ అన్నారు. ఈ నెల 16న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ సమన్వయ సమావేశం, రైతు సభ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్, అక్రమాలపై 17న పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామన్నారు.