రాష్ట్రంలోనూ మ్యాజిక్‌పై ఆశలు | BJP Hopes in the state on 2019 election | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలోనూ మ్యాజిక్‌పై ఆశలు

Published Mon, Mar 13 2017 3:45 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

రాష్ట్రంలోనూ మ్యాజిక్‌పై ఆశలు - Sakshi

రాష్ట్రంలోనూ మ్యాజిక్‌పై ఆశలు

మిషన్‌ 2019 కార్యాచరణకు బీజేపీ కసరత్తు
టీఆర్‌ఎస్‌ వైఫల్యాలు, మోదీ అభివృద్ధి నినాదంతో ముందుకెళ్లాలని నిర్ణయం
వచ్చే నెలలో రాష్ట్రానికి అమిత్‌ షా


సాక్షి, హైదరాబాద్‌: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో పార్టీ అఖండ విజయాల నేపథ్యం లో తెలంగాణలోనూ మోదీ మ్యాజిక్‌ పనిచేసేలా ముందుకు సాగాలని రాష్ట్ర బీజేపీ ఉవ్విళూరుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మిషన్‌ 2019కు కార్యాచరణను సిద్ధం చేసుకుంటోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలతోపాటు మోదీ అభివృద్ధి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. సర్కారు ముస్లిం రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనతోపాటు ఉద్యోగాల భర్తీ, డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో జాప్యం, ఎస్సీల భూపంపిణీ, రైతాంగ, సింగరేణి కార్మికుల సమస్యలపై టీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టాలనుకుంటోంది.

క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితిపై అంచనా...
రాష్ట్ర పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వచ్చే నెలలో నల్లగొండ, మెదక్‌ తదితర జిల్లాల్లో పర్యటించే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రభావాన్ని ఆయన అంచనా వేయనున్నారు. ముఖ్యంగా పోలింగ్‌ బూత్‌ స్థాయిలో పార్టీ యంత్రాంగం పనితీరు, పార్టీకి చేయాల్సిన కాయకల్ప చికిత్సపై దృష్టి సారించనున్నారు. ఈ పర్యటన తర్వాత జాతీయ నాయకత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలోకి రాష్ట్ర పార్టీ వెళ్లనుంది. జాతీయ స్థాయిలో, వివిధ రాష్ట్రాల్లో అనుసరించే వ్యూహాలను, ఇక్కడ అమలు చేసి పూర్తి ఫలితాలను రాబట్టాలనే ఆలోచనతో జాతీయనాయకత్వం ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో  తెలంగాణ, ఏపీ, ఒడిశాలలో బీజేపీ గణనీయమైన ఫలితాలు సాధించేందుకు అనుకూల పరిస్థితులున్నాయని వివిధ నివేదికల్లో స్పష్టమైందని అమిత్‌షా పార్టీ నాయకులకు గతంలోనే తెలిపారు.

దూకుడు పెంచుతాం
రాష్ట్రంలో రాబోయే రోజుల్లో దూకుడు పెంచుతాం. హామీల అమలుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి కావాల్సినంత వ్యవధి (మూడేళ్లు) ఇచ్చాం. ఇక ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని అనుకూలంగా మలుచుకునేందుకు కృషి చేస్తాం. గ్రామాల్లో పార్టీ ప్రభావం పెరిగేందుకు కార్యక్రమాలను రూపొందిస్తున్నాం. కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడిన నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా నిర్మాణాత్మక విపక్షంగా వ్యవహరించేలా, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటున్నాం. టీఆర్‌ఎస్‌కు కూడా లేనట్లుగా ఇప్పటికే 31 జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం.  
 – కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement