సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ఇరుకున పెట్టేందుకు యూపీఏ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన ‘స్నూప్‌గేట్’ ఉదంతం ఆ కూటమిలో చిచ్చురేపింది.
విచారణ నిర్ణయాన్ని తప్పుబట్టిన ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్
16లోగా జడ్జి నియామకం అవసరమేంటని ప్రశ్న
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ఇరుకున పెట్టేందుకు యూపీఏ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన ‘స్నూప్‌గేట్’ ఉదంతం ఆ కూటమిలో చిచ్చురేపింది. స్నూప్‌గేట్ వ్యవహారంపై విచారణకు మే 16లోగా జడ్జిని నియమించాలన్న మన్మోహన్ సర్కారు నిర్ణయాన్ని యూపీ ఏ భాగస్వామ్యపక్షాలైన ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఆది వారం తీవ్రంగా తప్పుబట్టాయి. మరో రెండు వారాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉండగా ఆగమేఘాలపై ఈ నిర్ణ యం తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాయి. ఈ అంశంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్...ప్రధాని మన్మో హన్‌సింగ్‌కు ఫోన్ చేసి తన నిరసన తెలియజేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సిన వేళ ఈ ఉదంతంపై న్యాయ విచారణకు జడ్జిని నియమించాలనుకోవడాన్ని తప్పుబట్టారు. మరోవైపు జమ్మూకాశ్మీర్ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా సైతం తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ‘ఈ అంశంపై శనివారం రాత్రి నాన్న (కేంద్ర మంత్రి ఫరూఖ్ అబ్దుల్లా)తో మాట్లాడా. యూపీఏ ప్రభుత్వం చివరి రోజుల్లో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం తప్పేనని ఆయన కూడా అభిప్రాయపడ్డారు’ అని ఒమర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఏమిటీ స్నూప్‌గేట్?: గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ 2009లో ఓ యువతిపై అక్రమంగా నిఘా పెట్టాలని తనకు అత్యంత సన్నిహితుడైన నాటి హోంమంత్రి అమిత్ షాను ఆదేశించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీన్నే స్నూప్‌గేట్ ఉదంతంగా పిలుస్తున్నారు.
వెనకడుగు ప్రసక్తే లేదు: కాంగ్రెస్
ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ వ్యతిరేకించినా స్నూప్‌గేట్‌పై విచారణ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తేలేదని కాంగ్రెస్ తేల్చిచెప్పింది. ఇది దేశ జనాభాలో సగమైన మహిళలకు సంబంధించిన వ్యవహారమని...అందువల్ల విచారణ జరిగి తీరాల్సిందేనని కాంగ్రెస్ ప్రతినిధి, మహిళా కాంగ్రెస్ చీఫ్ శోభా ఓజా చెప్పారు. మోడీకి ఆ యువతితో 2005 నుంచే పరిచయం ఉందన్న విషయాన్ని ఆయనగానీ, యువతి తండ్రి ప్రాణ్‌లాల్ సోనీగానీ ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. కాగా, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ వైఖరిని బీజేపీ స్వాగతించింది.