న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009లో ఒక మహిళపై అనధికారికంగా నిఘా పెట్టారన్న ఆరోపణలపై గత యూపీఏ ప్రభుత్వం ఆదేశించిన జ్యుడీషియల్ కమిషన్ దర్యాప్తును రద్దుచేయాలని ఎన్‌డీఏ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. స్నూప్‌గేట్ దర్యాప్తు రద్దు అంశాన్ని కేంద్ర హోంశాఖ త్వరలో కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకువస్తుందని సమాచారం. స్నూప్‌గేట్‌పై దర్యాప్తుకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలంటూ యూపీఏ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 26న ఇచ్చిన ఆదేశాలు రాజకీయ ప్రేరేపితమని.. దీనిని ఎన్‌డీఏ సర్కారు సమీక్షిస్తుందని హోంశాఖ సహాయమంత్రి కిరెన్‌రిజిజు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
స్నూప్‌గేట్ దర్యాప్తు కోసం యూపీఏ సర్కారు ప్రకటించిన కమిషన్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కానీ, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కానీ నేతృత్వం వహిస్తారని.. హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్‌భద్రసింగ్ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఆయనపై అప్పటి బీజేపీ ప్రభుత్వం నిఘా పెట్టారన్న ఆరోపణల పైనా, బీజేపీ నేత (ప్రస్తుత కేంద్ర ఆర్థికమంత్రి) అరుణ్‌జైట్లీకి సంబంధించిన ఫోన్ కాల్స్ వివరాల రికార్డుల లీకేజీపైనా దర్యాప్తు చేస్తుందని పేర్కొంది. అయితే.. మాజీ న్యాయమూర్తి ఎవరూ ఈ కమిషన్‌కు నేతృత్వం వహించేందుకు సుముఖంగా లేకపోవటంతో యూపీఏ సర్కారు కమిషన్‌ను ఏర్పాటు చేయలేకపోయిందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.