snoopgate
-
‘స్నూప్‌గేట్’ దర్యాప్తునకు మంగళం!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009లో ఒక మహిళపై అనధికారికంగా నిఘా పెట్టారన్న ఆరోపణలపై గత యూపీఏ ప్రభుత్వం ఆదేశించిన జ్యుడీషియల్ కమిషన్ దర్యాప్తును రద్దుచేయాలని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. స్నూప్‌గేట్ దర్యాప్తు రద్దు అంశాన్ని కేంద్ర హోంశాఖ త్వరలో కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకువస్తుందని సమాచారం. స్నూప్‌గేట్‌పై దర్యాప్తుకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలంటూ యూపీఏ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 26న ఇచ్చిన ఆదేశాలు రాజకీయ ప్రేరేపితమని.. దీనిని ఎన్డీఏ సర్కారు సమీక్షిస్తుందని హోంశాఖ సహాయమంత్రి కిరెన్రిజిజు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. స్నూప్‌గేట్ దర్యాప్తు కోసం యూపీఏ సర్కారు ప్రకటించిన కమిషన్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కానీ, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కానీ నేతృత్వం వహిస్తారని.. హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్‌భద్రసింగ్ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఆయనపై అప్పటి బీజేపీ ప్రభుత్వం నిఘా పెట్టారన్న ఆరోపణల పైనా, బీజేపీ నేత (ప్రస్తుత కేంద్ర ఆర్థికమంత్రి) అరుణ్‌జైట్లీకి సంబంధించిన ఫోన్ కాల్స్ వివరాల రికార్డుల లీకేజీపైనా దర్యాప్తు చేస్తుందని పేర్కొంది. అయితే.. మాజీ న్యాయమూర్తి ఎవరూ ఈ కమిషన్‌కు నేతృత్వం వహించేందుకు సుముఖంగా లేకపోవటంతో యూపీఏ సర్కారు కమిషన్‌ను ఏర్పాటు చేయలేకపోయిందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. -
యూపీఏలో ‘మోడీ నిఘా’ చిచ్చు
విచారణ నిర్ణయాన్ని తప్పుబట్టిన ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ 16లోగా జడ్జి నియామకం అవసరమేంటని ప్రశ్న న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ఇరుకున పెట్టేందుకు యూపీఏ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన ‘స్నూప్‌గేట్’ ఉదంతం ఆ కూటమిలో చిచ్చురేపింది. స్నూప్‌గేట్ వ్యవహారంపై విచారణకు మే 16లోగా జడ్జిని నియమించాలన్న మన్మోహన్ సర్కారు నిర్ణయాన్ని యూపీ ఏ భాగస్వామ్యపక్షాలైన ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఆది వారం తీవ్రంగా తప్పుబట్టాయి. మరో రెండు వారాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉండగా ఆగమేఘాలపై ఈ నిర్ణ యం తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాయి. ఈ అంశంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్...ప్రధాని మన్మో హన్సింగ్కు ఫోన్ చేసి తన నిరసన తెలియజేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సిన వేళ ఈ ఉదంతంపై న్యాయ విచారణకు జడ్జిని నియమించాలనుకోవడాన్ని తప్పుబట్టారు. మరోవైపు జమ్మూకాశ్మీర్ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా సైతం తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ‘ఈ అంశంపై శనివారం రాత్రి నాన్న (కేంద్ర మంత్రి ఫరూఖ్ అబ్దుల్లా)తో మాట్లాడా. యూపీఏ ప్రభుత్వం చివరి రోజుల్లో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం తప్పేనని ఆయన కూడా అభిప్రాయపడ్డారు’ అని ఒమర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఏమిటీ స్నూప్‌గేట్?: గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ 2009లో ఓ యువతిపై అక్రమంగా నిఘా పెట్టాలని తనకు అత్యంత సన్నిహితుడైన నాటి హోంమంత్రి అమిత్ షాను ఆదేశించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీన్నే స్నూప్‌గేట్ ఉదంతంగా పిలుస్తున్నారు. వెనకడుగు ప్రసక్తే లేదు: కాంగ్రెస్ ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ వ్యతిరేకించినా స్నూప్‌గేట్‌పై విచారణ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తేలేదని కాంగ్రెస్ తేల్చిచెప్పింది. ఇది దేశ జనాభాలో సగమైన మహిళలకు సంబంధించిన వ్యవహారమని...అందువల్ల విచారణ జరిగి తీరాల్సిందేనని కాంగ్రెస్ ప్రతినిధి, మహిళా కాంగ్రెస్ చీఫ్ శోభా ఓజా చెప్పారు. మోడీకి ఆ యువతితో 2005 నుంచే పరిచయం ఉందన్న విషయాన్ని ఆయనగానీ, యువతి తండ్రి ప్రాణ్‌లాల్ సోనీగానీ ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. కాగా, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ వైఖరిని బీజేపీ స్వాగతించింది. -
గుజరాత్ ‘నిఘా’పై దర్యాప్తునకు కేబినెట్ ఓకే
కేంద్రం నిర్ణయంపై మండిపడిన బీజేపీ న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి సన్నిహితుడైన ఆ రాష్ట్ర హోం శాఖ మాజీ సహాయ మంత్రి అమిత్ షా ఆదేశాలతో ఒక మహిళపై పోలీసులు నిఘా కొనసాగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గురువారం ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీల్లో అనధికారిక నిఘా వ్యవహారాలపై ఈ కమిషన్ దర్యాప్తు జరుపుతుందని ఒక ప్రకటనలో పేర్కొంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఈ దర్యాప్తు కమిషన్‌కు నేతృత్వం వహించే అవకాశం ఉంది. ఈ కమిషన్ మూడు నెలల్లో నివేదిక సమర్పించనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి కొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా, రాజకీయ దురుద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ, యూపీఏ సర్కారు విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని, కేంద్రం నిర్ణయంలో చట్టబద్ధతను సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ ప్రకటించారు.