కేంద్రం నిర్ణయంపై మండిపడిన బీజేపీ
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి సన్నిహితుడైన ఆ రాష్ట్ర హోం శాఖ మాజీ సహాయ మంత్రి అమిత్ షా ఆదేశాలతో ఒక మహిళపై పోలీసులు నిఘా కొనసాగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గురువారం ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీల్లో అనధికారిక నిఘా వ్యవహారాలపై ఈ కమిషన్ దర్యాప్తు జరుపుతుందని ఒక ప్రకటనలో పేర్కొంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఈ దర్యాప్తు కమిషన్‌కు నేతృత్వం వహించే అవకాశం ఉంది. ఈ కమిషన్ మూడు నెలల్లో నివేదిక సమర్పించనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి కొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా, రాజకీయ దురుద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ, యూపీఏ సర్కారు విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని, కేంద్రం నిర్ణయంలో చట్టబద్ధతను సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ ప్రకటించారు.