రిమోట్ తో నడిపారు
సోనియా, రాహుల్‌పై మోడీ నిప్పులు నిర్ణయాలన్నీ వారివే.. మన్మోహన్ కీలుబొమ్మ
యూపీఏ మహిళలను మోసం చేసింది
రూ. వెయ్యి కోట్ల ‘నిర్భయ’ ఫండ్‌లో ఒక్క రూపాయీ ఖర్చు చేయలేదు
సోనియా, రాహుల్ ఒకే ప్రసంగాన్ని పదేపదే చెబుతున్నారు
నా దగ్గరకు వస్తే ప్రసంగాలు రాయడమెలాగో చెబుతా
కకోయ్‌జాన్, నవ్‌గాంగ్ (అస్సాం): యూపీఏ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ తెరవెనుక నుంచి రిమోట్ కంట్రోల్‌తో నడిపించారని, దీనికి వారు మూల్యం చెల్లించుకోకతప్పదని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మండిపడ్డారు. శనివారం ఆయన అస్సాం, బీహార్‌లలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. ప్రధాని మాజీ సలహాదారు సంజయ్‌బారు రాసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పుస్తకాన్ని ప్రస్తావిస్తూ.. యూపీఏపై, సోనియా, రాహుల్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
్ళ ప్రజలను ఉద్దేశించి.. ‘మీరు దేశాన్ని కాపాడాలనుకుంటున్నారా? అయితే ముందు ఆ తల్లీకొడుకు (సోనియా, రాహుల్)ల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. వారు రిమోట్ కంట్రోల్‌తో దేశాన్ని నడుపుతున్నారు..’’ అని మోడీ పేర్కొన్నారు.
్ళ సంజయ్‌బారు పుస్తకాన్ని ప్రస్తావిస్తూ... ‘ఎవరు అసలు ప్రధానో స్పష్టంగా తెలిసిపోతోంది. మన్మోహన్ ఏం చెబుతున్నారనేది అనవసరం. ఆ తల్లీకొడుకులు దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. నిర్ణయాలన్నీ తల్లీకొడుకు తీసుకుంటారు. మన్మోహన్ కేవలం తెరపై కనిపిస్తారు. ఆయనో కీలుబొమ్మ’ అని వ్యాఖ్యానించారు.
1.మన్మోహన్ పదేళ్లలో 1,100 సార్లకు పైగా మాట్లాడారంటూ పీఎంవో ప్రకటన విడుదల చేసిందని... కానీ, అదేదో పేదలు, సాధారణ ప్రజలకు మన్మోహన్ ఏం చేశారో చెబుతూ ప్రకటన విడుదల చేస్తే సంతోషించి ఉండేవాడినని మోడీ ఎద్దేవా చేశారు.
2.కాంగ్రెస్‌వన్నీ ఓటు బ్యాంకు రాజకీయాలని, వారికి ఓట్లు అవసరమైనప్పుడే ప్రజలు గుర్తుకువస్తారని ఆరోపించారు.
3. సోనియా, రాహుల్ ఇద్దరూ అంతటా ఒకేరకమైన ప్రసంగాలు మళ్లీ మళ్లీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వారు తన వద్దకు వస్తే ప్రసంగాలు రాయడంలో తోడ్పడతానని మోడీ పేర్కొన్నారు.
4.కాంగ్రెస్ గుజరాత్ అభివృద్ధి నమూనాను విమర్శిస్తున్న నేపథ్యంలో మోడీ.. సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా భూలావాదేవీలను లేవనెత్తారు. ‘రూ. లక్షను ఐదేళ్లలో రూ.400 కోట్లను చేసే ఆర్‌ఎస్‌వీపీ (రాహుల్, సోనియా, వాద్రా, సోనియా కుమార్తె ప్రియాంక) మోడల్ గురించి దేశం తెలుసుకోవాలనుకుంటోంది’ అని అన్నారు. ఆహ్వానపత్రికల్లో కనిపించే ఫ్రెంచి వాక్య సంక్షిప్తాక్షరాలు ఆర్‌ఎస్‌వీపీ(దయచేసి మీరొస్తారో, రారో తెలపండి)ను మోడీ ఇలా అన్వయించారు.
యూపీఏ ప్రభుత్వం దేశంలోని మహిళలను మోసం చేసిందని మోడీ ఆరోపించారు. ‘నిర్భయ’ పేరిట వెయ్యి కోట్లతో ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం అందులోంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. సోనియా, రాహుల్‌లు ప్రజలను వెర్రివాళ్లను చేయడం మానేసి.. మహిళల భద్రతకు ఎలాంటి చర్యలు చేపట్టాలో ఆలోచించాలని మోడీ సూచించారు.
మోడీ, రాహుల్ ముఖాబులా...
అస్సాంలోని నవ్‌గాంగ్ అరుదైన ఘటనకు వేదికైంది. పరస్పరం కత్తులు దూసుకుంటున్న మోడీ, రాహుల్‌గాంధీ ఇద్దరూ కూడా ఈ నియోజకవర్గంలో శనివారం పర్యటించారు. దీనిపై మోడీ మాట్లాడుతూ.. ‘‘ఎంతోకాలంగా మీడియా ఎదురు చూస్తున్న ‘ మోడీ, రాహుల్ ముఖాబులా (ఒకరికొకరు ఎదురుపడడం)’ అస్సాంలో ఇప్పుడు జరిగిం ది. ఎవరికి ఎంత ప్రజాదరణ ఉందో ఇప్పుడు తెలిసిపోతోంది. మీడియా దీనినంతటినీ పరిశీలించి.. ఎవరికి ఆదరణ ఉందో చూడాలి. రాహుల్ మీరూ, నేనూ ఈ రోజు అస్సాంలో ఉన్నాం. ఎవరేమిటిలో తేల్చుకుందాం’ అని అన్నారు.