అష్ట కాంతులు | Michelle Obama to be inducted into Womens Hall of Fame | Sakshi
Sakshi News home page

అష్ట కాంతులు

Published Thu, Mar 11 2021 12:06 AM | Last Updated on Thu, Mar 11 2021 2:40 AM

Michelle Obama to be inducted into Womens Hall of Fame - Sakshi

కిడ్స్‌ టీవీ షోలో మిషెల్‌ ఒబామా

న్యూయార్క్‌లో 1969 నుంచీ ‘నేషనల్‌ ఉమెన్స్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ అనే సంస్థ ఉంది. ఆ సంస్థ ఉన్న ప్రదేశంలో 173 ఏళ్ల క్రితం తొలిసారి మహిళా హక్కుల సదస్సు జరిగింది. ఆ సదస్సు జరిగిన స్థలం కావడం, రెండేళ్లకోసారి ఆ సంస్థ అమెరికాలోని ప్రసిద్ధ మహిళల్ని విశిష్ట వ్యక్తులుగా ఎంపిక చేసుకోవడం.. ఈ రెండు కారణాల వల్ల ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’కి చారిత్రక ప్రాధాన్యం ఏర్పడి, ఆ హాల్‌కి (సంస్థకి) ఎంపికవడం ఒక ప్రతిష్ట అయింది. ప్రతి బేసి (సంఖ్య) సంవత్సరంలో ఈ ప్రతిష్టాత్మక ఎంపిక జరుగుతుంది. ఈ ఏడాది మిషెల్‌ బబామా, మరో ఏడుగురు మహిళలు హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో స్థానం పొందారు. వచ్చే అక్టోబర్‌ 2 న ఈ ఎనిమిది మందిని నేషనల్‌ ఉమెన్స్‌ ఆఫ్‌ ఫేమ్‌ అధికారికంగా తన రికార్డులలో చేర్చుకుంటుంది. మొన్నటి మహిళా దినోత్సవం రోజు హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ వీళ్ల పేర్లను ప్రకటించింది.

మిషెల్‌ ఒబామా (57) నలభై నాల్గవ అమెరికా ప్రథమ మహిళ. ఆ స్థానంలోకి వచ్చిన తొలి నల్లజాతి మహిళ కూడా. ‘21వ శతాబ్దపు అత్యంత ప్రభావశీలి అయిన ఆదర్శమూర్తి’ అని హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ మిషెల్‌ను అభివర్ణించింది. మిషెల్‌ మహిళలు, బాలికల హక్కుల ఉద్యమకారిణి, న్యాయవాది, రచయిత్రి. ప్రథమ మహిళగా ఉన్న ఎనిమిదేళ్ల కాలంలోనూ మిషెల్‌ శ్వేత సౌధానికి వన్నెతెచ్చారు. వైట్‌ హౌస్‌ను పీపుల్స్‌ హౌస్‌గా మార్చారు! ఆ తర్వాత కూడా మిషెల్‌ ప్రజా సంక్షేమం కోసమే పనిచూస్తూ ఉన్నారు. బాలల్లో స్థూలకాయం తగ్గించేందుకు ‘లెటజ్‌ మూవ్‌’, నిరుద్యోగ యువతకు మంచి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ‘రీచ్‌ హయ్యర్‌’, వృద్ధుల కోసం ‘జాయినింగ్‌ ఫోర్సెస్‌’, కౌమారదశలోని బాలిక ల విద్యకు ‘లెట్‌ గర్ల్స్‌ లెర్న్‌’.. ఇలా అనేక కార్యక్రమాలను రూపొందించారు మిషెల్‌. 2018లో ‘బికమింగ్‌’ అనే పేరుతో తన జ్ఞాపకాలను పుస్తకంగా తీసుకువచ్చారు. తన బెస్ట్‌ స్పోకెన్‌ వర్డ్‌ ఆల్బమ్‌కు 2020లో గ్రామీ అవార్డు పొందారు!

హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో స్థానం సంపాదించిన మిగతా ఏడుగురిలో రెబెక్కా హాల్‌స్టెడ్‌ (62) మిలటరీ అధికారి. జోయ్‌ హర్జో (69) కవయిత్రి, రచయిత్రి. ఇంద్రానూయీ (65) పెప్సీ కంపెనీ తొలి మహిళా సీఈవో. మియా హమ్‌ (48) సాకర్‌ లెజెండ్‌. జూడీ చికాకో (81) చిత్రకారిణి. తక్కిన ఇద్దరిలో ఆక్టేవియా ఇ బట్లర్‌ (1947–2006) సైన్స్‌ రైటర్‌. ఆమె గౌరవార్థం ఆమె పేరుతో నాసా ఇటీవలే అంగారకుడిపై పెర్సీ రోవర్‌ దిగిన చోటుకు నామకరణం చేసింది. ఆక్టేవియా ల్యాండింగ్‌ అంటారు ఇకపై ఆ ప్రదేశాన్ని! ఇక నాసా గణితశాస్త్ర వేత్త అయిన క్యాథరీన్‌ జాన్సన్‌ (1918–2020) ముప్పై ఐదేళ్ల పాటు నాసాలో పని చేశారు.
 
మిషెల్‌ బబామా, మరో ఏడుగురు మహిళలు ఈ ఏడాది ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో స్థానం పొందారు. వారిలో ఇద్దరు.. బెస్ట్‌ సెల్లింగ్‌ సైన్స్‌–ఫిక్షన్‌ రచయిత్రి ఆక్టేవియా, నాసా గణిత శాస్త్రవేత్త క్యాథరీన్‌ జాన్సన్‌లకు.. మరణానంతరం ఈ గౌరవం దక్కింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement