సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఆకాశంలో సగం మహిళలు అంటూ ప్రగల్బాలు పలికే పాలకులు తమకు చట్టబద్ధమైన హక్కులు కల్పించడంలో మాత్రం పురుషాధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారని, మహిళా సాధికారతను తుంగలో తొక్కుతున్నారని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గాదె ఝాన్సీ, చండ్ర అరుణ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అగ్రభాగాన నిలిచి ఉద్యమాలు చేసిన మహిళలు తమ హక్కుల కోసం మరో పోరాటానికి సిద్ధమవుతున్నారని చెప్పారు.
ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి 7 నెలలు గడుస్తున్నా నేటికీ ప్రభుత్వం మహిళా కమిషన్ ఏర్పాటు చేయకపోవడం విచారకరమని అన్నారు. మహిళలకు ప్రభుత్వాలు ఇచ్చే ప్రాధాన్యత ఏపాటిదో దీన్నిబట్టి తెలుస్తోందన్నారు. మహిళా సమస్యల పరిష్కారానికి తమ సంఘం పోరాడుతోందని చెప్పారు. శనివారం నుంచి మూడు రోజుల పాటు ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్న సందర్భంగా వారు ‘సాక్షి’తో మాట్లాడారు.
1973 సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీలో మహిళా విద్యార్థినులపై వేధింపులు ఎక్కువ కావడంతో లలిత అనే విద్యార్థిని ఆధ్వర్యంలో ఏర్పాటైన అభ్యుదయ సంఘం.. 1974లో అన్ని రాష్ట్రాల్లో ప్రగతిశీల మహిళా సంఘంగా రూపాంతరం చెందిందని తెలిపారు. అదే సంవత్సరంలో ఖమ్మం నగరంలో కుటుంబ హింసపై పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించామని, మహిళలపై జరుగుతున్న వేధింపులపై ఈ సభలో సందేశం ఇచ్చామని చెప్పారు.
ఈ సంఘం మహిళల కోసం.. వారి హక్కుల కోసం.. స్త్రీలలో సామాజిక చైతన్యం తీసుకురావడం కోసం కృషి చేస్తోందని తెలిపారు. సామ్రాజ్యవాద విష వలయంలో మహిళను ఒక వ్యాపార వస్తువుగా చూస్తున్నారని, దీనిని వ్యతిరేకిస్తూ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చామని చెప్పారు. 2003-04లో కేంద్ర ప్రభుత్వం గృహహింస ముసాయిదా చట్టం తీసుకొచ్చిందని, అయితే అందులో భర్త అప్పుడప్పుడు భార్యను కొట్టడం నేరం కాదని చెప్పడాన్ని వ్యతిరేకిస్తూ పీవోడబ్ల్యూ అనేక పోరాటాలు చేసిందని, దీని ఫలితంగానే చట్టంలో మార్పులు వచ్చాయని వివరించారు.
ప్రభుత్వాలు మహిళల హక్కులపై ఎన్ని చట్టాలు చేసినా, వారికి ఉన్న హక్కులను మహిళలు తెలుసుకోలేకపోతున్నారని, దీనిపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఢిల్లీ ఘటన తర్వాత ప్రభుత్వం నిర్భయ చట్టం రూపొందించిందని, ఈ చట్టం రూపకల్పనకు ముందు వర్మ కమిషన్ వేశారని, ఈ కమిషన్ మహిళలపై జరుగుతున్న హింస, దాడులకు కారణాలేంటి.. ఈ సంఘటనలపై సామాజిక ప్రభావం ఎలా ఉంది.. పోలీసుల ప్రవర్తన ఎలా ఉంది అనే వాటిపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిందని, దీనిని పట్టించుకోకపోవడంతో నిర్భయ చట్టం తర్వాత కూడా మహిళలపై దాడులు ఆగలేదని పేర్కొన్నారు.
30 సంవత్సరాలుగా సంఘం ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న దాడులపైనే కాకుండా మహిళల ప్రధాన సమస్యలపై పోరాటానికి, వారిని చైతన్యం చేసేందుకు రాత్రి పాఠశాలలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వమే ఈ పాఠశాలలను ప్రస్తుతం యువజన విద్య పేరుతో నిర్వహిస్తోందన్నారు. అనేక మంది ఆకలితో చనిపోతుంటే పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చామని, దాని ద్వారా పనికి ఆహార పథకం ప్రారంభించారని, దీనిని ప్రస్తుతం ఉపాధి హామీ పథకంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఏదైనా సమస్య పరిష్కారం కావాలంటే అది ఉద్యమాల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. తెలంగాణలో ఇంకా జోగిని వ్యవస్థ ఉందని, ఈ మూఢాచారాల నుంచి మహిళలను విముక్తి చేసేందుకు ఉద్యమిస్తున్నామని చెప్పారు. పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రూపొందించిన చట్టాల నుంచి తప్పించుకునేందుకు పురుషులు కొత్త దారులు వెతుకుతున్నారని, కొందరు భార్యాబాధితుల పేరుతో సంఘాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారని అన్నారు.
సమాజంలో మహిళలే వివక్షకు గురవుతుంటే పురుషులను ఎలా వేధిస్తారని ప్రశ్నించారు. 3,4,5 తేదీల్లో ఖమ్మంలో జరిగే పీవోడబ్ల్యూ రాష్ట్ర మహాసభల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై చర్చిస్తామని తెలిపారు. బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని, పీకే హిందీ చిత్రంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంశాలు ఏమీ లేవని, అయినప్పటికీ కొన్ని సంస్థలు, వ్యక్తులు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ఎంతో మేలు జరుగుతుందని ప్రజలు భావించారని, ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలలు గడుస్తున్నా రాష్ట్రంలో మహిళా మంత్రి కాని, మహిళ కమిషన్‌ను కాని నియమించకపోవడం నిరాశను కల్పించిందని అన్నారు.
మహిళా హక్కుల సాధనకు మరో పోరాటం
Published Sat, Jan 3 2015 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 7:07 PM
Advertisement
Advertisement