జస్టిస్ హిమా కోహ్లిపై సీజేఐ చంద్రచూడ్ ప్రశంసలు
న్యూఢిల్లీ: జస్టిస్ హిమా కోహ్లి ఒక మహిళా జడ్జి మాత్రమే కాదని స్త్రీ హక్కుల పరిరక్షణకు తీవ్రంగా పాటుపడ్డారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ కితాబిచ్చారు. సెప్టెంబరు 1న రిటైరవుతున్న హిమా కోహ్లి గౌరవార్థం సీజేఐ శుక్రవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఆమె రిటైరయ్యాక సర్వోన్నత న్యాయస్థానంలో ఇద్దరు మహిళా న్యాయమూర్తులు.. జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ బేలా ఎం. త్రివేదిలు ఉంటారు.
‘జస్టిస్ కోహ్లితో కలిసి ధర్మాసనంపై కూర్చోవడం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. హిమా.. మీరొక మహిళా జడ్జి మాత్రమే కాదు.. స్త్రీల హక్కుల పరిరక్షకురాలు కూడా’ అని సీజేఐ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చంద్రచూడ్, హిమాకోహ్లిలు బ్యాచ్‌మేట్లు కావడం గమనార్హం.
న్యాయం కోసం జస్టిస్ కోహ్లి తన జీవితాన్ని ధారబోశారని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి అన్నారు. 2006 మే నెలలో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులైన హిమా కోహ్లి.. 2007 ఆగస్టులో శాశ్వత జడ్జి అయ్యారు. జనవరి 7, 2021న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021 ఆగస్టు 31న సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు.
Comments
Please login to add a commentAdd a comment