అక్కడ ట్రంప్‌పై.. ఇక్కడ బెంగళూరుపై..!
బెంగళూరు: దేశంలోని దాదాపు యావత్తు మహిళా లోకం కదం తొక్కనుంది. తమపై దాడులు ఇక చాలంటూ గొంతెత్తి చెప్పనుంది. అసభ్యతకు పాల్పడేవారు, ఈ ఘటనలపై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యానాలు చేసేవారు ఇక ఖబడ్దార్ అంటూ భారీ ఎత్తున ర్యాలీకి సమాయత్తమవుతోంది. జనవరి 21న మొత్తం దేశంలోని మహిళలంతా తమ కంఠాన్ని మార్చ్ రూపంలో వచ్చి విప్పనున్నారు. బెంగళూరులోని మహిళల హక్కుల సంస్థ ఈ మార్చ్ దాదాపు 12 పెద్ద నగరాల్లో నిర్వహించాలని అనుకుంటోంది.
బెంగళూరులోని ఎంజీ రోడ్డులో నూతన సంవత్సరం వేడుకల ప్రారంభం సందర్భంగా వేల మంది మహిళలు, యువతులపై లైంగిక వేధింపులు జరిగిన విషయం తెలిసిందే. దీనిపై తొలుత ఆ రాష్ట్ర నాయకులు చులకనగా మాట్లాడారు. మహిళల మనోభావాలు దెబ్బకొట్టేలా వ్యాఖ్యానించారు. దీంతో జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని ఆ రాష్ట్ర హోంమంత్రికి నోటీసులు జారీ చేసింది.
ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కువవుతున్నాయని, మహిళలు ప్రతి రోజు ఏదో ఒక దాడిని ఎదుర్కోవడంతోపాటు అదనంగా నాయకులతో కూడా చులకనైన మాటలు పడాల్సి వస్తుందని ఇక వీటిని ఏం ఉపేక్షించకూడదని వారు నిర్ణయించుకున్నారు. జనవరి 21న దేశంలోని మహిళలందరూ కలసి వీధుల్లోకి వచ్చి తమ డిమాండ్లు బహిరంగపర్చనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ‘ఐవిల్ గో ఔట్’ అనే యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రచారం హల్ చల్ చేస్తోంది.
అదే సమయంలో అమెరికాలో ట్రంప్‌కు వ్యతిరేకంగా ‘మిలియన్ ఉమెన్ మార్చ్’ జరుగుతుండటం విశేషం. దీంతో ఆ ర్యాలీకి సమాంతరంగా భారత్‌లో కూడా మహిళలు బెంగళూరు ఘటన, గతంలో జరిగిన ఘటనలు, వాటిపై నాయకులు అడ్డగోలు వ్యాఖ్యానాలకు వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో మార్చ్‌నిర్వహించాలని అనుకుంటున్నారు.