మహిళల హక్కుల కోసం, సమానత్వం కోసం, సాధికారత కోసం విప్లవించిన తొలి తరం మహిళా సామాజిక ఉద్యమకారిణి వసంత కన్నాభిరాన్! ‘చట్టం ఉందంటే చేతిలో ఆయుధం ఉన్నట్లే’ అంటున్న ఈ ఉద్యమశీలి.. స్వయంశక్తితో పోరాడే ఒక కొత్తతరం సిద్ధమైందనీ.. మున్ముందరి అన్ని మహిళా ఉద్యమాలకు ఈ తరం స్ఫూర్తినివ్వగలదని ఆకాంక్షిస్తున్నారు.
వసంత కన్నాభిరాన్ పుట్టింది వెస్ట్ మారేడ్‌పల్లి, ఇప్పుడు ఉంటున్నది ఈస్ట్ మారేడ్‌పల్లి. పూర్తిగా హైదరాబాద్‌తోనే మమేకమైన జీవితం ఆమెది. పాఠశాల విద్య సికింద్రాబాద్‌లోని కీస్ హైస్కూల్‌లో. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్‌లో చదివిన తర్వాత తిరిగి హైదరాబాద్‌కి వచ్చి రెడ్డి కాలేజ్ (రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి ఉమెన్స్ కాలేజ్)లో లెక్చరర్‌గా జీవితాన్ని ప్రారంభించారు.
మహిళల హక్కుల కోసం ఉద్యమించిన తొలితరం మహిళ ఆమె. ఉద్యోగం, ఇల్లు, పిల్లల బాధ్యతలతోపాటు సామాజిక కార్యకర్తగా మారడానికి దారి తీసిన పరిస్థితులను, మహిళలకూ హక్కులుంటాయని గుర్తించని పితృస్వామ్య సమాజం నుంచి.. మహిళలు తమ హక్కులను సాధించుకుంటున్న నేటి సమాజం వరకు వచ్చిన మార్పులు, ఇప్పటి ‘మీ టూ’ స్వరాలు.. వీటి గురించి వసంత తన మనోభావాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.
‘‘మా తాత, చిన్న తాతలు కమ్యూనిస్ట్ పార్టీ స్థాపనలో కీలక పాత్ర వహించారు. మా నానమ్మ పూర్తి సంప్రదాయవాది, ఆమె నిర్ణయించిన సిస్టమ్ ఇంట్లో కొనసాగేది. కానీ ఇంట్లో ఎప్పుడూ సిద్ధాంతపరమైన చర్చలు, మేధోమథనం జరుగుతుండేది. చిన్న తాతలు ఒకరు ఆంగ్లో ఇండియన్‌ని, ఇంకొకరు మహారాష్ట్ర అమ్మాయిని వివాహం చేసుకున్నారు. మా ఇంటి చుట్టూ బెంగాలీ, పార్సీ, మరాఠీ వాళ్లు నివసించేవాళ్లు. సమాజాన్ని చూసే దృష్టి కోణం విస్తృతం కావడానికి అవన్నీ కారణమే. అయితే పెళ్లి తర్వాత నేను లెక్చరర్‌గా, కన్నాభిరాన్ న్యాయవాదిగా జీవితాన్ని మొదలుపెట్టాం. అప్పట్లో ఉద్యమాల్లో పాల్గొనాలనే ఆలోచన లేదు. మాకు తెలిసిందల్లా భుక్తి కోసం ఉద్యోగం చేయడమే. మా జీవితం ఈ మలుపు తిరుగుతుందని ఊహించనే లేదు.
ఎమర్జెన్సీ మార్చింది
ఎమర్జెన్సీకి ముందు రోజుల్లో... అంటే 1969–70లలో పరిస్థితి రాజకీయంగా ఉద్రిక్తంగా ఉండేది. కమ్యూనిస్ట్ పార్టీ ఎంఎల్ కార్యకర్తలు వాళ్ల కేసులను వాదించడం గురించి తరచూ కన్నాభిరాన్‌ని కలిసేవాళ్లు. నాగిరెడ్డి, చండ్ర రాజేశ్వర్రావులాంటి వాళ్లంతా ఇంటికి వస్తుండేవారు.
ఎమర్జెన్సీ వచ్చాక కన్నాభిరాన్ అకస్మాత్తుగా సెంటర్ పాయింట్ అయ్యారు. జ్వాలాముఖి వంటి వాళ్లు అరెస్టయ్యారు. వరవరరావు, గద్దర్, ప్రదీప్, మధుసూదన్ మొదలైన వాళ్లంతా అప్పుడే నాకు పరిచయమయ్యారు. రమా మెల్కోటే, వీణాశతృఘ్న, లలిత మొదలైన వాళ్ల మీద కుట్రకు పాల్పడ్డారనే తప్పుడు కేసులు నమోదయ్యాయి. అప్పుడు నా ఆలోచన పూర్తిగా మారిపోయింది. సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉందనిపించింది. టీచింగ్ కొనసాగిస్తూనే మెల్లగా ఉద్యమబాటలో అడుగులు వేశాను.
స్టూడెంట్స్ పలకరింపు నవ్వులు
నిజానికి నేను టీచింగ్‌లోకి వెళ్లాలనే సంకల్పంతో లెక్చరర్‌గా చేరలేదు. అన్ని ఉద్యోగాల్లాగానే అది కూడా అన్నట్లే చేరాను. పాఠాలు చెప్పడం మొదలు పెట్టిన తర్వాత టీచింగ్ మీద ప్రేమ పెరిగింది. రెడ్డి కాలేజ్‌లో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల పిల్లల కోసం 40 శాతం సీట్లు ఉండేవి. వాళ్లు ఎక్కువగా తెలుగు మీడియంలో చేరేవాళ్లు.
సబ్జెక్టుని ఇంగ్లిష్ మీడియం క్లాసులో వివరించినంత డెప్త్‌గా తెలుగు మీడియంలో చెప్పడం కుదిరేది కాదు. వాళ్లను ప్రధాన స్రవంతి(భాష పరంగా వెనుకబాటు తనం నుంచి)లో కలిపే వరకు వాళ్ల గ్రహింపుశక్తికి మాత్రమే చెప్పాల్సి వచ్చేది. అయితే సంతోషం ఏమిటంటే... ఆ పిల్లలు మాక్కూడా ఇంగ్లిష్ మీడియం వాళ్లకు చెప్పినంత క్షుణ్ణంగా చెప్పమని అడిగారు. వాళ్లకు విషయాన్ని పూస గుచ్చినట్లు చెప్పడం కోసం నేను పెద్ద ఎక్సర్‌సైజ్ చేశాననే చెప్పాలి. దాంతో నాలో ట్రాన్స్‌లేషన్ లెవెల్స్ బాగా పెరిగాయి.
ఒక విషయాన్ని తెలుగులో అనర్గళంగా మాట్లాడటమూ వచ్చేసింది. టీచింగ్‌ని 1985లో వదిలేసినప్పటికీ పర్యటనల్లో ఎక్కడైనా నన్ను చూడగానే నా స్టూడెంట్స్ నవ్వుతూ దగ్గరకు వచ్చేవారు. ఆ నవ్వులోనే వీళ్లు నా దగ్గర చదువుకున్నట్లున్నారని తెలిసిపోయేది. ఇలాంటి అనుభవాలన్నీ పాఠాలు చెప్పిన రోజులను గర్వంగా గుర్తు చేసుకునేట్లు చేస్తుంటాయి.
యూఎన్ గుర్తించాకనే...
ఐక్యరాజ్యసమితి 1975ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఇయర్‌గా ప్రకటించింది. అప్పటి వరకు మనదేశం అనే కాదు, ప్రపంచంలో ఎక్కడా మహిళల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. విమెన్ ఇష్యూస్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని తెలిసిందప్పుడే. మన దగ్గర కూడా మార్చి ఎనిమిదవ తేదీన మహిళల గురించి మాట్లాడుకోవడం మొదలైంది. వక్తగా చాలా సమావేశాల్లో ప్రసంగించాను.
కానీ నేను చూసి, విని తెలుసుకున్న అంశాలనే మాట్లాడుతున్నాను తప్ప సమాజాన్ని అధ్యయనం చేసిన రచనలు చదవలేదప్పటికి. రాడికల్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ మీటింగ్‌లో ప్రసంగించడానికి ఆహ్వానం వచ్చినప్పుడు నాకు అంత లోతుగా తెలియదని చెప్పాను. ‘నేర్చుకోవడం ఎంత సేపు’ అంటూ ఎమ్‌వీ రామ్మూర్తి గారు ఐదారు పుస్తకాలు తెచ్చిచ్చారు. అలా పూర్తిస్థాయి సామాజిక ఉద్యమంలోకి వచ్చాను. ఫెమినిస్టు సాహిత్యం చదవడం నన్ను నేను వికసింప చేసుకోవడానికి దోహదం చేసింది.
ఒక్కో సంఘటన ఒక్కో పాఠం
రమ, వీణ, లలిత, సూజి, రత్నమాల అందరం కలిసి స్త్రీ శక్తి సంఘటన్ ప్రారంభించాం. అప్పటి నుంచి సమాజంలో బాధితులవుతున్న మహిళలకు అండగా నిలిచే ప్రయత్నంలో ఎన్ని నేర్చుకున్నామో చెప్పలేం. మధుర పదహారేళ్లమ్మాయి. పోలీస్ స్టేషన్ టాయిలెట్‌లో నలుగురు పోలీసులు రేప్ చేశారామెని. తప్పిపోయి దొరికిన ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేసి ఇంటికి పంపించారు పోలీసులు.
ఆ సంఘటన మాకు ఎంత షాక్ అంటే... మనదేశంలో మహిళకు ఎంత న్యాయం జరుగుతుందో అర్థమైంది. ‘ఇలా కూడా జరుగుతుందా అనే సందేహం, ఎందుకు జరగదు; ఇప్పుడు జరిగింది అదేగా’ అని మాలో మేమే అనుకునేవాళ్లం. రమీజాబీ రేప్ కేస్‌తో నగరం అట్టుడిగిపోయింది. మతాలు, వర్గాలకతీతంగా స్పందించారంతా. ముక్తిధర్ కమిషన్ విచారణలో ఎంత విచిత్రాలంటే... ఒక్కొక్క సాక్షి వచ్చి (వాళ్లంతా పోలీసులు అన్ని కేసుల్లోనూ ప్రవేశపెట్టే ఆస్థాన సాక్షులే) రమీజాబీని బురఖా తియ్యమనేవాడు, ముఖం చూసి ‘అవును నేను ఈమెకు డబ్బిచ్చి హోటల్ గదిలో గడిపాను’ అని చెప్పి వెళ్లిపోయేవాడు.
అంటే... మన సమాజంలో ఒక మహిళ తన గురించి తాను ఏం చెప్పిందనేది ముఖ్యం కాదు, పదిమంది మగాళ్లు ‘ఆమెతో గడిపాం’ అంటే.. అదే నిజం అంటారు. మేల్ సొసైటీ ఎంత బలంగా ఉండేదో చెప్పడానికి అదొక ఉదాహరణ. మహిళల కోసం పోరాడాలంటే మహిళా యాక్టివిస్టులందరం న్యాయశాస్త్రం చదవాల్సిన అవసరం ఉందనే మరో విషయం తెలుసుకున్నాం.
చట్టం ఉందంటే... చేతిలో ఆయుధం ఉన్నట్లే!
పబ్లిక్ డొమైన్, ప్రైవేట్ డొమైన్ అనే తేడా ఉండటం లేదు. ఇంట్లో మామ, బావ, మరుదులు వేధిస్తున్నారని చెప్పి కన్నీళ్లు పెట్టుకునే వాళ్లెందరో. ఇల్లు దాటి బయటకు వెళ్తే స్కూల్ టీచరు, పోలీసులు, ఉద్యోగంలో పై అధికారి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్‌లో తలదాచుకున్న అమ్మాయిల మీద వార్డెన్ లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా తమ పనుల కోసం ఇతర అధికారుల దగ్గరకు పంపించడం... ఇలా ప్రతి చోటా లైంగిక వేధింపులే ఎదురవుతున్నాయి.
స్త్రీ గొప్పతనాన్ని స్తుతించడం ప్రసంగాలకే పరిమితం. ఆచరణలో ఉన్నదంతా స్త్రీని దేహంగా చూసే కరడుగట్టిన భావజాలమే. రాజస్తాన్‌లో బాల్యవివాహాలను అరికట్టడానికి ప్రయత్నించిన భన్వారీదేవి మీద అగ్రకులస్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఆ కేసు విచారణలో ఎంతటి అర్ధరహితమైన వాదన విన్నామంటే ‘అప్పర్ క్యాస్ట్ మెన్ వోన్ట్ రేప్ ఎ లోవర్ క్లాస్ వుమన్’ అన్నారు. మహిళను నీ స్థానం ఇదేనని నియంత్రించడానికి ఎప్పుడూ ఆమె మీద లైంగిక దాడినే ఆయుధంగా మార్చుకుంటోంది మగ సమాజం.
ఆ పోరాటంతో వచ్చిన విశాఖ జడ్జిమెంట్.. పని ప్రదేశంలో లైంగిక వేధింపులను అరికట్టడానికి కొంతవరకు ఆసరా అవుతోంది. చట్టం వచ్చిన తర్వాత వేధింపులు ఆగిపోయాయా అనే కౌంటర్ ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది, విశాఖ అయినా, నిర్భయ చట్టం అయినా సరే... వాటికి ముందు లైంగిక దాడులు జరిగాయి, తరవాత కూడా జరుగుతున్నాయి. కానీ చట్టం ఉంటే చేతిలో ఆయుధం ఉన్నట్లే. వేధింపులకు పాల్పడే వాళ్లకి అది హెచ్చరికలా ఉంటుంది, వేధింపులకు గురయ్యే వర్గానికి ధైర్యాన్నిస్తుంది.
మహిళల కోసం మహిళలే...
వివక్షకు, వేధింపులకు లోనవుతున్న మహిళల కోసం ఎవరో ఒకరు పోరాడాల్సి వచ్చేది. ఇప్పుడు మహిళలు తెలివిమంతులయ్యారు. తమకు జరుగుతున్న అన్యాయం మీద ‘మీటూ’ అంటూ గళమెత్తగలుగుతున్నారు. కాలం మారిందనడానికి ఇదొక ప్రతీక. కంప్లయింట్ చేస్తే ఉద్యోగం పోతుందేమోననే భయం ఒకప్పుడు నోరు తెరవనిచ్చేది కాదు. ఆ ఉద్యోగాన్ని వదలడానికి సిద్ధమై కంప్లయింట్ చేసినా సరే... ఓల్డ్ బాయ్స్ క్లబ్ మగవాళ్లు ఇలాంటి విషయాలను త్వరగా సర్క్యులేట్ చేసుకుంటారు. ఆమెకి ఉద్యోగం ఇవ్వకుండా ఇబ్బంది పెడతారు. ఉద్యోగం ఇవ్వాలంటే బేరం పెడతారు. అలాంటి అవరోధాలన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధమైంది కొత్త తరం.
మహిళలు ఇంతకాలం ఓర్చుకున్నారు, సర్దుకుపోయారు, వేధింపులకు భయపడి ఇంట్లో కూర్చున్నారు. పడింది చాలు. ఇక గొంతు పెంచాలి, గొంతు విప్పిన అమ్మాయికి బాసటగా నిలవాలి. ఇప్పుడు మగవాళ్లు... ‘తప్పుడు ఆరోపణలు చేస్తే మా కెరీర్ ఏమైపోవాలి’ అని గొంతు చించుకుంటున్నారు. ‘నా మీద చెయ్యి వేశాడు’ ఒక మహిళ బాధ్యతరహితంగా ఆరోపించదు, ఆరోపించినా అది నూటికి ఒకటికంటే మించదు. ఆ ఒక్కరిని చూపించి 99 అసలైన ఆరోపణలను కొట్టి పారేయాలని చూసే ధోరణిని మార్చుకోవాలని చెబుతున్నాను. తరతరాల అణచివేతను తమకు తాముగా ఛేదించుకోగలిగిన శక్తిని పుంజుకున్నారు మహిళలు. ఇది స్వయంశక్తి ఉద్యమం. ఉద్దేశం నెరవేరే వరకు ఉద్యమించే స్త్రీ శక్తి’’.
ఎంత వారలైనా... బుద్ధి మారదా
ఢిల్లీలో ఒక పెద్ద ఆర్గనైజేషన్‌లో జెండర్ పాలసీ మీద మాట్లాడినప్పుడు ఓ కొత్త కోణం తెలిసింది. అక్కడి మహిళలతో మాట్లాడినప్పుడు సహోద్యోగులైన మగవాళ్లు తమను అదోలా చూడడం, అసభ్యకరమైన జోకులు వేయడం, తాకడానికి ప్రయత్నించడం వంటి ఇబ్బందులను చెప్పుకొచ్చారు.
మగవాళ్లూ ఒక కంప్లైంట్ చేశారు! ఆడవాళ్లు సీట్లో పని చేసుకుంటూ మధ్యలో చేతులు పైకెత్తి జుట్టు సరిచేసుకుని క్లిప్ పెట్టుకుంటుంటారు. అప్పుడు వాళ్ల దేహాకృతి ఎక్స్‌పోజ్ అవుతుంటుంది, మాకది ఇబ్బంది కలిగిస్తోంది... అన్నారు. వెంటనే ఆ సంస్థ.. ఆడవాళ్లు వాష్‌రూమ్‌లోనే జుట్టు సరి చేసుకోవాలనే నిబంధన పెట్టారు. అయితే మగవాళ్లకు ఎటువంటి నియమావళినీ పెట్టలేదు. ఉన్నత విద్యావంతులు, పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవాళ్లలో కూడా తమ ఆలోచనలను అదుపులో పెట్టుకోలేరా అనిపిస్తుంది. – వసంత కన్నాభిరాన్ సామాజిక ఉద్యమకారిణి
– ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment