బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్‌వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు పతకాల వేటలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే (ఆరో రోజు) భారత్ ఖాతాలో 14 పతకాలు చేరగా, మరో 3 పతకాలు జాబితాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. తదుపరి మ్యాచ్‌ల్లో భారత అథ్లెట్లు ఓడినప్పటికీ కనీసం ఓ రజతం, రెండు కాంస్య పతకాలు భారత్ ఖాతాలో చేరనున్నాయి. మహిళల జూడో 78 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరిన తులికా మాన్ సిల్వర్ మెడల్‌పై కర్చీఫ్ వేయగా.. పురుషుల బాక్సింగ్ 57 కేజీల విభాగంలో హుసముద్దీన్ ముహమ్మద్ కనీసం కాంస్యం, మహిళల 45-48 కేజీల విభాగంలో నీతు మరో కాంస్యాన్ని ఖరారు చేశారు.
ఇదిలా ఉంటే, కామన్‌వెల్త్ క్రీడల ఆరో రోజు లవ్‌ప్రీత్ సింగ్ కాంస్యం సాధించడంతో భారత్ పతకాల సంఖ్య 14కు చేరింది. ఒక్క వెయిట్ లిఫ్టింగ్‌లోనే భారత్ 9 పతకాలు సాధించడం విశేషం. మిరాబాయ్ చాను (గోల్డ్), జెరెమీ లాల్‌రిన్నుంగ (గోల్డ్), అచింట షెవులి (గోల్డ్), సంకేత్ సర్గార్ (సిల్వర్), బింద్యా రాణి (సిల్వర్), వికాస్ ఠాకుర్ (సిల్వర్), గురురాజ పుజారి (బ్రాంజ్), హర్జిందర్ కౌర్ (బ్రాంజ్), లవ్‌ప్రీత్ సింగ్ బ్రాంజ్ మెడల్స్ సాధించారు. మిగతా ఐదు పతకాల్లో జూడోలో 2 (సుశీలా దేవీ సిల్వర్, విజయ్ కుమార్ యాదవ్ బ్రాంజ్), లాన్స్ బౌల్స్‌లో ఒకటి (గోల్డ్), టేబుల్ టెన్నిస్లో ఒకటి (గోల్డ్), బ్యాడ్మింటన్‌లో ఒకటి (సిల్వర్) గెలిచారు.
ఇక పతకాల పట్టిక విషయానికొస్తే.. 5 స్వర్ణాలు , 5 రజతాలు, 4 కాంస్య పతకాలు సాధించిన భారత్ ఈ జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. 106 పతకాలతో (42 గోల్డ్, 32 సిల్వర్, 32 బ్రాంజ్) ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ 86 (31 గోల్డ్, 34 సిల్వర్, 21 బ్రాంజ్), న్యూజిలాండ్ 26 (13 గోల్డ్, 7 సిల్వర్, 6 బ్రాంజ్), కెనడా 46 (11 గోల్డ్, 16 సిల్వర్, 19 బ్రాంజ్), సౌతాఫ్రికా 16 (6 గోల్డ్, 5 సిల్వర్, 5 బ్రాంజ్) వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో నిలిచాయి.
చదవండి: కంటతడి పెట్టిన కిదాంబి శ్రీకాంత్.. స్వర్ణం చేజారాక తీవ్ర భావోద్వేగం
Comments
Please login to add a commentAdd a comment