దొంగాట | sports quota cirtficates submission in wrong way for medicin | Sakshi
Sakshi News home page

దొంగాట

Published Wed, Sep 6 2017 7:51 AM | Last Updated on Sun, Sep 17 2017 6:29 PM

దొంగాట

దొంగాట

ప్రతిభకు పాతరేస్తూ సర్టిఫికెట్ల ప్రదానం
ఫెన్సింగ్‌.. జూడో.. సాఫ్ట్‌బాల్‌
అసోసియేషన్ల పాత్రపై అనుమానం
ఈ ఏడాది స్పోర్ట్స్‌ కోటాలో మెడిసిన్‌కు 15 మంది విద్యార్థులు
నేతల జోక్యంతో గుట్టుగా వ్యవహారం
ఉన్నత స్థాయి విచారణతో కలకలం


మెడిసిన్‌ కోటా లక్ష్యంగా క్రీడలు
జూడో ఓపెన్‌ కేటగిరీ కింద జిల్లాకు చెందిన రెడ్డప్పరెడ్డి 100 కేజీల విభాగంలో బంగారు పతకాన్ని సాధిస్తే.. దీన్ని చిత్తూరు జిల్లాకు చెందిన రుత్విక్‌ అనే విద్యార్థికి కట్టబెట్టారు. ప్రస్తుతం ఈ విద్యార్థి ఎస్‌వీ మెడికల్‌ కళాశాలలో మెడిసిన్‌ చదువుతుండటం గమనార్హం.

క్రీడా వ్యాపారం అనంతను కుదిపేస్తోంది. దొడ్డిదారిలో మెడిసిన్‌ సీటు దక్కించుకునేందుకు ఆడిన ‘ఆట’.. ప్రతిభ కలిగిన విద్యార్థుల కంట తడి పెట్టిస్తోంది. గెలుపొందిన క్రీడాకారులకు.. సర్టిఫికెట్‌లోని పేర్లకు పొంతన లేకుండా సాగించిన దొంగాట క్రీడాలోకంలో చర్చనీయాంశంగా మారింది. స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ నాయకులు.. ప్రజాప్రతినిధుల కన్నుసన్నల్లోనిదే ఈ తంతు.  


అనంతపురం సప్తగిరి సర్కిల్‌:
ప్రతిభకు స్పోర్ట్స్‌ కోటా పాతరేసింది. మెడిసిన్‌ సీటు సాధించడమే లక్ష్యంగా కొందరు తల్లిదండ్రులు, స్పోర్ట్స్‌ అసోసియేషన్ల ప్రతినిధులతో పాటు నేతలు రంగ ప్రవేశం చేయడంతో సర్టిఫికెట్ల వ్యాపారం మొదలైంది. అనంతపురంలోనే జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించి సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. క్రీడాకారుడు ఒకరయితే.. సర్టిఫికెట్‌ను మరో విద్యార్థి పేరిట ఇవ్వడం ద్వారా దొంగాటకు తెర తీశారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రధాన క్రీడా మైదానం కేంద్రంగా ఈ తంతు సాగింది. చిత్తూరుకు చెందిన రుత్విక్‌ విషయంలో ఆయా క్రీడా సంఘాల ప్రతినిధులు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, యూత్‌ అఫైర్స్‌కు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం బట్టబయలయింది.

ఇంటర్‌ పూర్తి చేసిన ఈ విద్యార్థి సీనియర్‌ నేషనల్‌ క్రీడాంశాల్లో పాల్గొనేందుకు అనర్హుడు. అయితే ధనార్జనే ధ్యేయంగా ఇతనికి సర్టిఫికెట్‌ను ప్రదానం చేయడం గమనార్హం. గతేడాది తెలంగాణలో నిర్వహించిన స్పోర్ట్స్‌ కోటా సీట్ల విషయంలో ఆ ప్రాంత రాష్ట్ర ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ధన్‌కిషన్‌ను దోషిగా తేల్చారు. ఈ ఏడాది అనంతపురం జిల్లా కేంద్రంగా ప్రధాన క్రీడాంశాలైన ఫెన్సింగ్‌.. జూడో.. సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్ల రాష్ట్ర కార్యదర్శుల పాత్ర జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నకిలీ ధ్రువీకరణ పత్రాల జారీ వెనుక వీరి హస్తం ఉందనే అనుమానం పలువురు క్రీడాకారులతో పాటు తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు.

నలుగురు బోగస్‌
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్‌లో మెడిసిన్‌కు 0.05 స్పోర్ట్స్‌ కోటాలో 16 మెడిసిన్, 4 డెంటల్‌ సీట్లు కేటాయిస్తుం ది. ఇందులో మిగతా క్రీడాంశాలతో పోలిస్తే ఫెన్సింగ్, జూడో, సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారులకే అధిక లబ్ధి చేకూర్చడం అనుమానాలకు తావిస్తోంది. ఇదే విషయమై గత ఏడాది పలువురు తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించడంతో విచారణకు ఈ ఏడాది ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటయింది. ఆ మేరకు నలుగురు క్రీడాకారులు బోగస్‌ అని వెల్లడయింది.

ఈ ఏడాది స్పోర్ట్స్‌ కోటాలో 15 మంది
రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల నిర్వహణకు సంబం ధించి స్పోర్ట్స్‌ అథారిటీకి, ఒలంపిక్స్‌ అసోసియేషన్‌కు పూర్తి నివేదికలను, రెఫరీల వివరాలను అం దించాల్సి ఉంది. అయితే అంతర్జాతీయ క్రీడలకు వెళ్లే క్రీడాకారులకు ఇండియా ఫెడరేషన్, యూత్‌ అఫైర్స్‌ నుంచి ఎలాంటి అప్రూవల్‌ ఉండదు. అ యినప్పటికీ అంతర్జాతీయ క్రీడలకు ఆయా జిల్లా ల నుంచి క్రీడాకారులను పంపుతుండటం గమనార్హం. గత ఏడాది వరకు ఎంసెట్‌కు ఎంత మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారనే వివరాలు కూడా ఆయా జిల్లాల క్రీడా ప్రాధికార సంస్థ వద్ద లేకుండానే క్రీడాకారులకు హైదరాబాద్, విజయవాడలోని ప్రధాన కేంద్రాల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ ఏడాది అనంతపురం జిల్లా నుంచి 15 మంది క్రీడాకారులు ఎంసెట్‌కు స్పోర్ట్స్‌ కోటాలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిలో ఎంత మంది అర్హులనే విషయం విచారణలో వెల్లడి కావాల్సి ఉంది.

నేతకు సలాం
క్రీడల్లో రాజకీయ జోక్యం మీతిమిరితే ప్రతి భ పక్కకు తప్పుకుంటుందనే విషయం అందరికీ తెలిసిందే. మంత్రి పరిటాల సునీ త కుమారుడు శ్రీరాంను జిల్లా ఒలంపిక్స్‌ సంఘం అడ్‌హాక్‌ కమిటీ అధ్యక్షునిగా గత జూలైలో ఎన్నుకోవడంలో ఫెన్సింగ్, జూ డో, సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్ల రాష్ట్ర కార్యదర్శులు కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ అండదండలు ఉండటంతోనే నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో క్రీడా ప్రతినిధులు దూకుడు ప్రదర్శించినట్లు చర్చ జరుగుతోంది. జిల్లాకు చెందిన ముఖ్య ప్రభుత్వ శాఖల అధికారుల పిల్లలకు నకిలీ సర్టిఫికెట్లను కట్టబెట్టిన నేపథ్యంలో ఈ దొంగాట గుట్టుగా సాగినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement