‘‘పోడియం వద్ద ఇద్దరు ప్లేయర్లు మాత్రమే మీకు కనిపిస్తున్నారు. నిజానికి అక్కడ ముగ్గురం ఉన్నాము. నేను.. నా ప్రత్యర్థి.. ఇంకా ఈ ప్రపంచంలోకి రాని నా చిన్నారి బేబి కూడా! ఇక్కడి దాకా సాగిన మా ప్రయాణంలో నేను, నా కడుపులోని బిడ్డ శారీరకంగా, మానసికంగా ఎన్నో కఠిన సవాళ్లు ఎదుర్కొన్నాం.
సాధారణంగానే... గర్భవతి అయిన వాళ్లు భావోద్వేగాల డోలికల్లో తేలియాడుతూ ఉంటారు. ఒక్కోసారి క్లిష్టపరిస్థితులు ఎదురవుతాయి. అయితే, ఇలాంటి సమయంలోనూ ఏమాత్రం తొణకకుండా.. ఇష్టమైన క్రీడలో ముందుకు సాగడం అంత తేలికేమీ కాదు. అయినా.. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కినందుకు సంతోషంగానే ఉంది.
రౌండ్ ఆఫ్ 16లో చోటు సంపాదించినందుకు గర్వపడుతూ నేను పోస్టు పెడుతున్నా. నేను ఇక్కడిదాకా వచ్చేందుకు నాకు మద్దతుగా నిలిచి.. నాపై నమ్మకం ఉంచిన వ్యక్తిని భర్తగా కలిగి ఉన్న అదృష్టవంతురాలిని. నా కుటుంబం కూడా నాకు ఎల్లవేళలా అండగా నిలిచింది.
ఈ ఒలింపిక్స్ నా కెరీర్‌లో ప్రత్యేకమైనవి. మూడుసార్లు ఒలింపియన్‌ను.. ఈసారి లిటిల్ ఒలింపియన్‌ను కడుపులో మోస్తూ ఇక్కడి దాకా వచ్చాను’’ అంటూ ఈజిప్టు ఫెన్సర్ నదా హఫీజ్ ఉద్వేగానికి లోనైంది. ఏడు నెలల గర్భంతో ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పోటీపడినట్లు తెలిపింది.
కాబోయే తల్లిగా విశ్వ క్రీడల్లో పాల్గొనడం తనకు సరికొత్త అనుభూతిని ఇచ్చిందని నదా పేర్కొంది. రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించే క్రమంలో తన మనసులో చెలరేగిన ఉద్వేగాలను మాటల్లో వర్ణించలేనని.. ప్యారిస్ నుంచి ఇక సంతోషంగానే నిష్క్రమిస్తానని నదా తెలిపింది.
కాగా నదా హఫీజ్ 2016 రియో ఒలింపిక్స్, టోక్యో ఒలింపిక్స్‌లో ఈజిప్టు తరఫున ఫెన్సింగ్‌లో పోటీపడింది. అయితే, ఒక్కసారి కూడా పతకం గెలవలేకపోయింది. తాజాగా ప్యారిస్ ఒలింపిక్స్‌లో తన తొలి మ్యాచ్‌లో వరల్డ్‌నంబర్ 10 ఎలిజబెత్ టార్టకోవ్‌స్కీతో తో తలపడ్డ నదా హఫీజ్.. 15- 13తో జయకేతనం ఎగురవేసింది.
అయితే, రౌండ్ ఆఫ్ 16లో మాత్రం దక్షిణ కొరియాకు చెందిన జియోన్ హాయంగ్ చేతిలో 15-7తో ఓడిపోయింది. తద్వారా మహిళల వ్యక్తిగత ఫెన్సింగ్ విభాగంలో నదా హఫీజ్ ప్రయాణానికి అంతటితో తెరపడింది.
ఫెన్సింగ్ అంటే ఏమిటి?
సంప్రదాయ క్రీడ కత్తిసాము ఆధునిక రూపం ఇది. ఇద్దరు అథ్లెట్లు పరస్పరం తలపడుతూ తమను తాము రక్షించుకుంటూ.. ఎదుటివారిని టార్గెట్ చేస్తూ పాయింట్లు స్కోరు చేస్తారు. ఇందులో మూడు రకాలు ఉన్నాయి. ఫాయిల్, ఇపీ, సాబెర్. ఏథెన్స్ 1896 ఒలింపిక్స్ నుంచి ఫెన్సింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. గత టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి భవానీదేవీ పోటీపడింది.
Comments
Please login to add a commentAdd a comment