న్యూస్‌మేకర్స్
గర్భిణి స్త్రీలు ప్రతి విషయంలో ఆచితూచి ఉండాలి. అయితే కొన్ని సందర్భాలు సవాళ్లు విసురుతాయి. దేశం కోసం నిలబడమంటాయి. పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో ఇద్దరు మహిళలు గర్భంతో పోటీల్లో నిలిచి ఆశ్చర్యపరిచారు. ఈజిప్ట్ ఫెన్సర్ నదా హఫెజ్ ఆరునెలల గర్భంతో, అజర్‌బైజాన్ ఆర్చర్ యయలాగుల్ రమజనోవా ఐదున్నర నెలల గర్భంతో ప్రత్యర్థులతో పోరాడారు. గెలుపు ఓటముల కంటే కూడా వాళ్లు పాల్గొనడమే పెద్ద గెలుపు. వీరు మాత్రమే కాదు, గర్భిణులుగా బరిలోకి దిగిన అథ్లెట్స్ గత ఒలింపిక్స్ లోనూ ఎంతోమంది ఉన్నారు.
పదహారవ రౌండ్‌లో ఓటమి తరువాత తాను ఏడు నెలల గర్భిణిని అని ప్రకటించింది ఈజిప్ట్ ఫెన్సింగ్ క్రీడాకారిణి నదా హఫీజ్. ఆమె ప్రకటన సంచలనం కలిగించింది. నిజానికి గర్భిణిగా ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన క్రీడాకారులు, ఒలింపిక్స్‌లోకి అడుగు పెట్టిన తరువాత గర్భిణి అని తెలుసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు....
ఎలినార్ బర్కర్: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్నప్పుడు బ్రిటిష్ సైకిలింగ్ స్టార్ ఎలినార్ బర్కర్ మూడు నెలల గర్భిణి. ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకున్న ఎలినార్ ఆ తరువాతే తాను గర్భిణిని అనే విషయం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. ‘రేసుకు కొద్దిరోజుల ముందు టోక్యోలో నేను గర్భవతినని తెలుసుకున్నాను. ఇది నేను ఊహించని విషయం. ఆ సమయంలో ఒత్తిడికి గురయ్యాను’ ఆరోజును గుర్తు చేసుకుంటుంది ఎలినార్. ఎలినార్ బార్కర్ ఎండోమెట్రియోసిస్‌తో బాధపడుతుండేది. దీని వల్ల గర్భిణులకు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉండడం ఆమె ఒత్తిడికి కారణం. కొద్దిరోజుల్లో ఆట, మరో వైపు కొండంత ఒత్తిడి. టీమ్ డాక్టర్, సైకియాట్రిస్ట్‌ను సంప్రదించి సలహాలు తీసుకుంది. ధైర్యం తెచ్చుకుంది. మెడల్ గెలుచుకుంది.
ఆంకీ వాన్ గ్రన్సె్వన్: డచ్ డ్రెస్సేజ్ ఛాంపియన్ ఆంకీ వాన్ గ్రన్సె్వన్ అయిదు నెలల గర్భిణిగా ఒలింపిక్స్ బరిలోకి దిగి స్వర్ణ పతకం సాధించింది.
క్రిస్టీ మూర్: అయిదు నెలల గర్భిణిగా 2010 ఒలింపిక్స్ బరిలోకి అడుగు పెట్టింది కెనడియన్ కర్లర్ క్రిస్టీ మూర్. కాస్త వెనక్కి వెళితే...ఒకరోజు కర్లింగ్ టీమ్ నుంచి క్రిస్టీకి ఫోన్ కాల్ వచ్చింది. ‘ఐయామ్ ప్రెగ్నెంట్’ అని చెప్పింది క్రిస్టీ. ‘ఆడడం మీకు కష్టమవుతుందా’ అవతలి గొంతు.
ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. ఆ సమయంలో తన టీమ్‌మెట్ ఒకరు.... ‘నువ్వు ప్రెగ్నెంట్ మాత్రమే. చనిపోలేదు’ అన్నది. దీని అర్థం ‘నీలో పోరాడే సత్తా’ ఉంది అని. దీంతో మరో ఆలోచన చేయకుండా ఒలింపిక్ బరిలోకి దిగింది క్రిస్టీ మూర్.
‘ఒలింపిక్స్‌లో పాల్గొనడం, మాతృత్వం... రెండూ అపురూపమే. పెద్ద సవాలు అని తెలిసినా ముందుకు వెళ్లాను’ ఆ రోజులను గుర్తు చేసుకుంటుంది క్రిస్టీ మూర్.
మరి కొందరి విషయానికి వస్తే....
అమెరికన్ ఐస్–హాకీ ప్లేయర్ లీసా బ్రౌన్ మిల్లర్ 1998 వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొంది, అక్కడికి వెళ్లాకే తాను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసింది.
అమెరికన్ సాఫ్ట్‌బాల్ ప్లేయర్ మిషల్ గ్రెంజర్ మూడు నెలల గర్భిణిగా 1996 ఒలింపిక్స్‌లోకి అడుగు పెట్టింది.
జర్మన్ ఆర్చర్ కర్నోలియ ఏడు నెలల గర్భిణిగా 2004 ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టింది... ఈ జాబితా ఇంకా ఉంది. వీరిలో స్వర్ణాలు గెలుచుకున్నవారు ఉన్నారు. గెలవకపోయినా సత్తా చాటిన వారు ఉన్నారు.
‘వీడు కడుపులో ఉన్నప్పుడే నాతో పాటు ఒలింపిక్స్ ఆడాడు’ అని తమ బిడ్డల గురించి గర్వంగా చెబుతుంటారు ఆ అథ్లెట్ తల్లులు.
ఆ సమయంలో...
రక్తస్రావంలాంటి సమస్యలు ఉన్నప్పుడు తప్ప సాధారణంగా తేలికపాటి వ్యాయామాలను గర్భిణి అథ్లెట్లకు సూచిస్తాం. ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో రొటీన్ ఎక్సర్‌సైజ్‌లు చేసినా ఫరవాలేదు. ఎక్కువగా చేయడానికి ప్రయత్నించవద్దు. మితంగా చేస్తే చాలు అని చెబుతుంటాం. బ్యాడ్మింటన్, టెన్నిస్‌లాంటి ఆటలు ఆడాలనుకునేవారికి మాత్రం సాధ్యమైనంత వరకు వద్దనే చెబుతాం.
– డా. ఆశా దలాల్, సర్ హెచ్‌ఎన్
రిలయన్స్ హాస్పిటల్స్ ఉమెన్ సెంటర్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment