స్క్వాష్‌లో ఆశ... షూటర్ల నిరాశ
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత్‌కు ఐదో రోజు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత మహిళల స్క్వాష్ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచి పతకానికి చేరువయింది. బ్యాడ్మింటన్‌లో సైనా, సింధు అలవోకగా తొలి రౌండ్‌ను అధిగమించారు. అయితే మొదటి నాలుగు రోజులు పతకాలు తెచ్చిన షూటర్లు... ఐదో రోజు రిక్తహస్తాలతో వెనుదిరిగారు.
స్క్వాష్: భారత్‌కు మరో పతకం దక్కే అవకాశాలు మరింతగా మెరుగయ్యాయి. మహిళల టీమ్ పూల్ ‘బి’లో భారత్ 2-1తో హాంకాంగ్‌ను, 3-0తో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. నేడు చైనాతో జరిగే పూల్ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్‌కు అగ్రస్థానం దక్కుతుంది. అప్పుడు ఫైనల్‌కు చేరడానికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. పురుషుల స్క్వాష్‌లో భారత్ 3-0తో చైనాను ఓడించింది.
షూటింగ్: ఆంగ్‌నియాన్ షూటింగ్ రేంజ్‌లో బుధవారం జరిగిన పురుషుల 25 మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్, మహిళల 50 మీ. రైఫిల్ ప్రోన్ విభాగాల్లో భారత షూటర్లు పూర్తిగా విఫలమయ్యారు. పురుషుల 25 మీ. ర్యాపిడ్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లోనైతే కొద్దిలో కాంస్యం చేజారింది. వియత్నాంతో కలిసి 1704 పాయింట్లు సాధించిన భారత్ ‘ఇన్నర్ 10’ కౌంట్‌లో వెనకబడింది. దీంతో నాలుగో స్థానంతో సంతృప్తి పడాల్సి వచ్చింది. వ్యక్తిగత విభాగంలో ఎవరూ ఫైనల్‌కు చేరలేదు.
బ్యాడ్మింటన్: టీమ్ ఈవెంట్‌లో కాంస్యంతో చరిత్ర సృష్టించిన భారత మహిళా షట్లర్లు సింగిల్స్‌లోనూ తమ సత్తా చాటుతున్నారు. టాప్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు సింగిల్స్ తొలి రౌండ్‌లో తమ తమ ప్రత్యర్థులపై నెగ్గి ప్రి క్వార్టర్స్‌కు చేరారు. ఆరో సీడ్ సైనా 21-10, 21-8తో యు టెంగ్ లోక్ (మకావు)పై 20 నిమిషాల్లోనే గెలిచింది. ఎనిమిదో సీడ్ పీవీ సింధు 21-7, 21-13తో వోంగ్ కిట్ లెంగ్ (మకావు)పై 19 నిమిషాల్లోనే నెగ్గింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సిక్కిరెడ్డి-ప్రద్న్యా జోడి 16-21, 21-19, 14-21 జపాన్ ద్వయం చేతిలో ఓటమిపాలైంది. పురుషుల డబుల్స్‌లో మను ఆత్రి-సుమీత్ రెడ్డి గెలిచారు.
ఇతర క్రీడల ఫలితాలు
ఆర్చరీ: మహిళల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో స్టార్ ఆర్చర్ దీపికా కుమారి ఎలిమినేషన్ రౌండ్‌కు అర్హత సాధించింది. ర్యాంకింగ్ రౌండ్‌లో మంచి ఫామ్‌ను కనబరిచిన దీపిక ఎనిమిదో స్థానంలో నిలిచింది. మరో మహిళా ఆర్చర్ లక్ష్మీరాణి మజ్హి కూడా ఎలిమినేషన్‌కు అర్హత సాధించింది. టీమ్ ఈవెంట్‌లో ఐదో స్థానంలో నిలిచిన భారత్ (దీపిక, లక్ష్మీరాణి, బొంబ్యాల దేవి) క్వార్టర్ ఫైనల్లో హాంకాంగ్‌తో పోటీపడనుంది. అతాను దాస్, జయంత్ తాలుక్ దార్ వ్యక్తిగత విభాగంలో ఎలిమినేషన్ రౌండ్‌కు... రాయ్, దాస్, తాలుక్‌దార్ టీమ్ ఎలిమినేషన్ రౌండ్‌కు చేరారు.
బాక్సింగ్: మూడేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ బాక్సింగ్‌లోకి అడుగుపెట్టిన అఖిల్ 60 కేజీల విభాగంలో నేపాల్‌కు చెందిన పూర్ణ బహదూర్ లామాపై ఆధిపత్యాన్ని ప్రదర్శించగా.. 56 కేజీల విభాగంలో శివ తాపాకు వాకోవర్ లభించింది. ఇద్దరూ ప్రి క్వార్టర్స్ చేరారు.
టెన్నిస్: మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో నటాషా పల్హా ఓడిపోయింది. డబుల్స్‌లో రిషిక సుంకర-శ్వేతా రాణా జోడి 6-4, 6-0తో పాకిస్థాన్‌కు చెందిన సారా మన్సూర్-ఉష్నా సొహైల్ ద్వయంపై అలవోకగా గెలిచి ప్రి క్వార్టర్స్ చేరింది.
హాకీ: మహిళల హాకీలో భారత జట్టు 1-2తో చైనా చేతిలో పోరాడి ఓడిపోయింది. చివరి నిమిషంలో గోల్‌తో చైనా గెలిచింది.
వాలీబాల్: భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిలిమినరీ గ్రూప్ సి మ్యాచ్‌లో భారత్ 25-10, 25-19, 25-17తో మాల్దీవులపై నెగ్గింది. భారత మహిళల జట్టు 0-3తో థాయ్‌లాండ్ చేతిలో చిత్తయింది.
బాస్కెట్‌బాల్: పురుషుల బాస్కెట్‌బాల్ ప్రిలిమినరీ రౌండ్ మ్యాచ్‌లో భారత జట్టు 41-76తో ఇరాన్ చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది.
సెపక్‌తక్రా: పురుషుల, మహిళల సెపక్‌తక్రాలో భారత జట్లు నిరాశ పరిచాయి. డిఫెండింగ్ చాంపియన్లు అయిన పురుషుల, మహిళల థాయిలాండ్ జట్లు 3-0తోనే భారత జట్లను చిత్తు చేశాయి.
స్విమ్మింగ్: పురుషుల 4ఁ100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలే ఫైనల్లో భారత్ ఏడో స్థానంలో నిలిచింది
జిమ్నాస్టిక్స్: మహిళల వాల్ట్ ఫైనల్లో దీపా కర్మాకర్ నాలుగో స్థానంలో నిలిచింది.
వెయిట్‌లిఫ్టింగ్: 85 కేజీల గ్రూప్ బి విభాగంలో వికాస్ ఠాకూర్ 7వ స్థానంలో నిలిచాడు.