స్క్వాష్... ఆరోగ్యానికి భేష్ | Squash ... health concluded | Sakshi
Sakshi News home page

స్క్వాష్... ఆరోగ్యానికి భేష్

Published Fri, May 2 2014 10:55 PM | Last Updated on Sat, Sep 2 2017 6:50 AM

స్క్వాష్... ఆరోగ్యానికి భేష్

స్క్వాష్... ఆరోగ్యానికి భేష్

రాకెట్స్, బాల్స్... సింగిల్స్, డబుల్స్ అనగానే టెన్నిసే గుర్తుకొస్తుంది. కానీ...ఇది టెన్నిస్ కాదు. నెట్ ఉండదు... ఏస్‌లూ ఉండవు. కానీ... షాట్ల మోత మోగుతుంది. ఆట హోరాహోరీగా సాగుతుంది. అయినా... ఆటగాళ్లు మాత్రం ముఖాముఖీగా తలపడరు!  ఇద్దరు ఒకే వైపు ఉండి, భిన్నంగా సాగే ఆటే స్క్వాష్. శరీరాన్ని బాగా కష్టపెట్టే ఆట. కేలరీల్ని కరిగించే ఆట ఇది. కాబట్టే ‘ఫోర్బ్స్’ పత్రిక దీన్ని ఆరోగ్యప్రదాయిని (నెంబర్‌వన్ హెల్దీయెస్ట్ గేమ్)గా పేర్కొంది. శరీర సత్తాకు ఇది కచ్చితంగా పరీక్ష పెడుతుంది. అందుకే అసాధారణ స్థాయిలో ఒంట్లో కేలరీలు ఖర్చవుతాయి. గుండెను భద్రంగా ఉంచడంలోనూ స్క్వాష్‌కు మించిన ఆటేదీ లేదని కొన్ని అధ్యయనాల ద్వారా తెలిసింది. మరి అలాంటి ఆటను ఎలా ఆడతారో తెలుసుకుందామా...
 
వార్ రూమ్ హోరు
 
ఇండోర్ గేమ్ స్క్వాష్. ఇంకా చెప్పాలంటే ఒక గదిలో ఆడే ఆట ఇది. ఓ వైపు గోడ, దానికిరువైపులా అద్దాల ఫ్రేములుంటాయి. గోడకెదురుగా ఆటగాళ్ల ప్రవేశ ద్వారం. ఇది కూడా అద్దాలతో చేసిందే! స్క్వాష్ నిబంధనల ప్రకారం గోడపై మూడు లైన్లుంటాయి. కింద టిన్ లైన్ (బాటమ్ లైన్), పైన హై లైన్ (దీన్ని ఔట్ లైన్ అంటారు) ... ఈ రెండింటి మధ్య సర్వీస్ లైన్ ఉంటాయి. గోడ ముందు ఉండే ఫ్లోర్ (సర్ఫేస్) నుంచి గోడ లైన్లపై ఆడే విధంగా సరిగ్గా ప్రవేశ ద్వారం సమీపంలో రెండు క్వార్టర్లు ఉంటాయి. ఇక్కడ నుంచే స్క్వాష్ ‘సర్వీస్’ మొదలవుతుంది.
 
పక్కపక్కనే ప్రత్యర్థులు
 
టెన్నిస్, బ్యాడ్మింటన్, వాలీబాల్ ఇలా ఏ క్రీడ అయినా ప్రత్యర్థులు ముఖాముఖీగా తలపడతారు. కానీ స్క్వాష్‌లో మాత్రం ప్రత్యర్థులిద్దరు పక్కపక్కనే నిల్చొని ఆడతారు. సింగిల్స్‌లో మొదట చెరో క్వార్టర్‌పై ఒక్కొక్కరు ఉంటారు. ఆ తర్వాత ఒకరి క్వార్టర్‌లోకి మరొకరు బంతి గమనాన్ని బట్టి వెళ్లొచ్చు. బంతిని లిఫ్ట్ చేయొచ్చు. ముందుగా క్రీడాకారులు తమ సర్వీస్‌ను సర్వీస్‌లైన్‌పైనే ఆడాలి. ఒకరు కొట్టిన సర్వీస్‌ను లేదంటే షాట్‌ను ఆ బంతి ల్యాండ్ అయిన ఒక బౌన్స్‌కే మరొకరు తిరిగి గోడకు కొట్టాలి.

రెండు బౌన్స్‌లు పడేదాకా చూస్తే పాయింట్ గల్లంతే. గోడకు ముందున్న ఫ్లోర్ మొత్తాన్ని ఆటగాళ్లిద్దరూ ఉపయోగించుకోవచ్చు. ఒకరు కొట్టిన బంతిని మరొకరు కొట్టేందుకు పరస్పరం సహకరించుకోవాలి. అనుమానాస్పదంగా అవతలి ఆటగాడిని నిరోధించేలా ప్లేస్‌మెంట్ చేయడం, అడ్డంగా నిల్చోవడం లేదంటే ఆడనివ్వకుండా కదలడం రిఫరీలు గుర్తిస్తే పెనాల్టీ తప్పదు. పాయింట్ల కోతా తప్పదు.
 
 స్క్వాష్ విశేషాలు
 స్క్వాష్ పురాతనమైన ఆట. 1830లో లండన్‌లోని ఓ స్కూల్‌లో ఈ ఆటకు అంకురార్పణ జరిగింది. తదనంతరం అన్ని స్కూళ్లకు విస్తరించి క్రమంగా 19వ శతాబ్దంలో పాపులర్ క్రీడ అయింది.
     
 జల సమాధి అయిన సుప్రసిద్ధ ‘టైటానిక్’ షిప్‌లోనూ స్క్వాష్ కోర్టులు ఉండేవట.
     
 ఫ్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్‌ఏ) ఆధ్వర్యంలో పురుషుల ఈవెంట్, వుమన్ స్క్వాష్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళల టూర్ ఈవెంట్‌లు జరుగుతాయి. అంతర్జాతీయ స్క్వాష్ సమాఖ్య వీటిని పర్యవేక్షిస్తుంది.
     
 ప్రపంచవ్యాప్తంగా 49,908 స్క్వాష్ కోర్టులున్నట్లు  స్క్వాష్ సమాఖ్య వెల్లడించింది. అత్యధిక కోర్టులు ఇంగ్లండ్ (8500)లో ఉన్నాయి.
     
 స్క్వాష్ ఆటకు ప్రత్యేకమైన రబ్బరు బంతుల్ని వినియోగిస్తారు. వీటి చుట్టుకొలత 39.5 మి.మీ. నుంచి 40.5 మిల్లిమీటర్లు. ఈ బంతులు 23 గ్రా. నుంచి 25 గ్రాముల బరువుంటాయి.
     
 స్క్వాష్ సమాఖ్య సూచించిన ప్రమాణాల మేరకు రాకెట్లు ఉండాలి. మొత్తం బరువు 255 గ్రాములకు మించరాదు. సాధారణంగా క్రీడాకారులు 150 గ్రా. బరువు గల రాకెట్లనే వాడతారు.
     
 రోజూ ఓ గంట ఆడితే రికార్డు స్థాయిలో 3000 కేలరీలు ఖర్చవుతాయట.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement