ప్యాడెల్‌ టెన్నిస్‌ ఆడేద్దాం..! | What is paddle tennis game | Sakshi
Sakshi News home page

ప్యాడెల్‌ టెన్నిస్‌ ఆడేద్దాం..!

Published Sun, Nov 17 2024 4:09 AM | Last Updated on Mon, Nov 18 2024 8:54 AM

What is paddle tennis game

టెన్నిస్‌కు తక్కువ  బ్యాడ్మింటన్‌కు ఎక్కువ! 

విదేశాల్లో క్రేజీగేమ్‌గా ప్యాడెల్‌ టెన్నిస్‌  

హైదరాబాద్‌లోనూ యువత ఆసక్తి 

 ఫన్, ఫిట్‌నెస్, ఏకాగ్రత సొంతం

ఎప్పుడైనా ప్యాడెల్‌ టెన్నిస్‌ గురించి విన్నారా? టెన్నిస్‌ గురించి తెలుసు.. బ్యాడ్మింటన్‌ గురించి తెలుసు.. ఇంకా స్క్వాష్‌ గురించీ తెలుసు కానీ కొత్తగా ప్యాడెల్‌ టెన్నిస్‌ అంటే ఏంటి అనుకుంటున్నారా..? అవును ఇది చాలా కొత్త గేమ్‌.. కాకపోతే చాలా ట్రెండీ గేమ్‌. మెక్సికోలో పుట్టిన ఈ గేమ్‌ ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమే. కానీ మన హైదరాబాదీయులకు మాత్రం ఇది కాస్త కొత్త గేమ్‌ అనే చెప్పుకోవచ్చు. కానీ ఇటీవల కాలంలో ప్యాడెల్‌ టెన్నిస్‌పై నగరవాసుల్లో ముఖ్యంగా యువతలో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పుడిప్పుడే ప్యాడెల్‌ టెన్నిస్‌ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్యాడెల్‌ టెన్నిస్‌ అంటే ఏంటి? సాధారణ టెన్నిస్‌కు, ప్యాడెల్‌ టెన్నిస్‌కు మధ్య వ్యత్యాసాలేంటి? ఎలా ఆడుతారు..? ఇలా ఎన్నో విషయాలు తెలుసుకుందాం..!   

ప్యాడెల్‌ టెన్నిస్‌ కూడా టెన్నిస్‌ లాంటి ఆటనే. 1969లో మెక్సికోకు చెందిన ఎన్‌రిక్‌ కార్క్యూరా అనే క్రీడాకారులు ఈ గేమ్‌ కనిపెట్టాడు. టెన్నిస్, స్క్వాష్‌ ఆటల కలయికనే ఈ ప్యాడెల్‌ టెన్నిస్‌. టెన్నిస్‌లో ఉన్నట్టే అన్ని రూల్స్‌ ఉంటాయి. కోర్టు, రాకెట్, వాడే బాల్‌ ఇలా చాలా విషయాల్లో కాస్త వ్యత్యాసాలు ఉన్నాయి. సాధారణంగా టెన్నిస్‌ కోర్టులు పెద్ద పరిమాణంలో, ఓపెన్‌గా ఉంటాయి. అయితే ప్యాడెల్‌ టెన్నిస్‌ కోర్టులు మాత్రం కాస్త చిన్న పరిమాణంలో మూసేసి ఉంటాయి. 20 మీటర్ల పొడవుతో, 10 మీటర్ల వెడల్పుతో ఉంటాయి. అదే టెన్నిస్‌ కోర్టులు మాత్రం 23 మీటర్ల పొడవు, 11 మీటర్ల వెడల్పుతో ఉంటాయి. ప్యాడెల్‌ గేమ్‌లో కాస్త ఫన్నీ అనిపించే అంశం ఏంటంటే.. చిన్నప్పుడు డబుల్‌ స్టెప్‌ ఔట్‌ అనుకునేవాళ్లం కదా.. అలాగే ఇక్కడ కూడా ఒక్కసారి వెనుక ఉన్న గోడకు తగిలి.. మరోసారి కోర్టులో బౌన్స్‌ అయినా కూడా ఆట కొనసాగించవచ్చు. చాలా మంది గోడకు బంతి తగిలేలా చేసి స్ట్రాటజీలా ఆడుతుంటారు. అదే టెన్నిస్‌లో మాత్రం ఒకసారే బౌన్స్‌ కావాల్సి ఉంటుంది. ఇక, వెనుక గోడలకు తగిలితే ప్రత్యరి్థకే పాయింట్‌ దక్కుతుంది.  

ఇదో సోషల్‌ గేమ్‌..
ప్యాడెల్‌ టెన్నిస్‌ను సోషల్‌ గేమ్‌ అంటుంటారు. ఎందుకంటే దీన్ని కచి్చతంగా ఇద్దరు ఆటగాళ్లు జట్టుగా ఆడాల్సి ఉంటుంది. అదే టెన్నిస్‌ మాత్రం సింగిల్స్, డబుల్స్‌ కూడా ఆడొచ్చు. ఇక, రాకెట్‌ విషయంలో టెన్నిస్‌కు, ప్యాడెల్‌ టెన్నిస్‌కు చాలా తేడా ఉంటుంది. టెన్నిస్‌ రాకెట్‌లో స్ట్రింగ్స్‌ ఉంటాయి. అదే ప్యాడెల్‌ టెన్నిస్‌ రాకెట్‌లో స్ట్రింగ్స్‌ ఉండవు. పొడవు విషయంలో కూడా టెన్నిస్‌ రాకెట్‌ కన్నా ప్యాడెల్‌ రాకెట్‌ చిన్నగా ఉంటుంది. వెడల్పు ఎక్కువగా ఉంటుంది. అయితే వాడే బాళ్లు చూడటానికి ఒకేలా కనిపించినా.. కాస్త తేడా ఉంటుంది. టెన్నిస్‌ బాల్స్‌ గట్టిగా ఉంటాయి. అదే ప్యాడెల్‌ టెన్నిస్‌ విషయంలో కాస్త మెత్తగా, తక్కువ పీడనంతో ఉంటాయి. ఆడే విధానంలో కూడా రెండు గేమ్స్‌ మధ్య చాలా వ్యత్యాసాలు ఉంటాయి. ముఖ్యంగా బాల్‌ సరీ్వంగ్‌ విషయంలో చాలా రూల్స్‌ ఉంటాయి.

ఫన్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌.. 
మనదేశంలో క్రికెట్‌ తర్వాత దాదాపు అదే స్థాయిలో ఆదరణ పొందుతోన్న గేమ్‌ టెన్నిస్‌ అని చెప్పుకోవచ్చు. అయితే ప్యాడెల్‌ టెన్నిస్‌ ఆడుతున్నా.. చూస్తున్నా కూడా చాలా ఫన్‌ ఉంటుంది. ఉత్కంఠతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ పక్కా అంటున్నారు ప్యాడెల్‌ టెన్నిస్‌ శిక్షకులు. హైదరాబాద్‌లో కూడా పలు అకాడమీలు ఈ ప్యాడెల్‌ టెన్నిస్‌ నేరి్పస్తున్నారు.

ఇప్పుడే ట్రెండ్‌ అవుతోంది.. 
హైదరాబాద్‌లో ఇప్పుడిప్పుడే ప్యాడెల్‌ టెన్నిస్‌ గురించి అవగాహన పెరుగుతోంది. నేర్చుకునేందుకు యువత, పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారు. టెన్నిస్‌తో పోలిస్తే ప్యాడెల్‌ టెన్నిస్‌ గురించి చాలా మందికి తెలియదు. ప్యాడెల్‌ టెన్నిస్‌లో ఫిట్‌నెస్‌తో పాటు ఏకాగ్రత కూడా పెరుగుతుంది. కొన్ని మెళకువలతో నేర్చుకుంటే ప్యాడెల్‌ టెన్నిస్‌ ఆడటం సులువే. 
– ఎన్‌.జగన్నాథం, టెన్నిస్‌ ట్రైనర్‌   

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement