సెపక్‌తక్రాపై సోదర త్రయం పట్టు
క్రికెట్.. ఫుట్‌బాల్.. హాకీ.. టెన్నిస్.. బ్యాడ్మింటన్ ఇలా ప్రముఖ క్రీడలను ఎలా ఆడతారనే విషయంలో అందరికీ ఓ అవగాహన ఉంటుంది. అయితే సెపక్‌తక్రా అనే ఆట మాత్రం కాస్త విభిన్నమైనదే. నిజానికి చాలామందికి ఇలాంటి ఆట ఒకటి ఉందనే విషయం కూడా తెలీదంటే అతిశయోక్తి కాదు. అంతకన్నా విచిత్రం ఈ ఆట ఆడే విధానం. వాలీబాల్ కోర్టును తలపిస్తూ ఉండే ఫీల్డ్‌లో బంతిని కాలితో, తలతో మాత్రమే ఆడడం ఈ ఆట ప్రత్యేకత. మలేసియా, థాయ్‌లాండ్, కొరియా దేశాల్లో ఈ ఆట చాలా పాపులర్. భారత్‌లో అయితే మణిపూర్ క్రీడాకారులు బాగా ఆడతారు. అయితే మన దగ్గర కడు పేదరికంలో పుట్టి పెరిగిన ముగ్గురు అన్నదమ్ములు సెపక్‌తక్రా మీద మమకారం పెంచుకున్నారు. ఫ్లయింగ్ కిక్, సీజర్ కట్, టో ట్యాప్ (అరికాలి పాదంతో బంతిని కొట్టడం) వంటి షాట్లతో రెచ్చిపోతున్నారు. అందరూ ఆడడం అంత సులువుకాని ఈ క్రీడను అవలీలగా ఆడుతూ ముందుకెళుతున్నారు.
(రాజ్‌కుమార్, విజయవాడ స్పోర్ట్స్)
కొమ్ము నాగేంద్రబాబు, క్రాంతి, సాయిప్రభు ముగ్గురూ అన్నదమ్ములు. తండ్రి చెప్పుల షాపులో పనిచేస్తుంటాడు. ఆయనకు వచ్చే చాలీచాలని జీతంతో ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఎదురైనా ఈ సోదర త్రయం మాత్రం సెపక్‌తక్రా మీద మమకారాన్ని వీడ లేదు. పౌష్టికాహార లోపంతో వీరికి కనీసం సాధారణ క్రీడాకారులకుండే దేహదారుఢ్యం కూడా ఉండదు.
బక్కపలుచని ఆకారాలతోనే జల్లెడలా ఉండే బంతిపై అదుపు సాధించారు. ఏ అవకాశాన్నీ వదులుకోకూడదనే ఉద్దేశంతో తమ ఈ ఆకారాలనే అనుకూలంగా మలుచుకున్నామని నాగేంద్రబాబు చెబుతున్నాడు. వాస్తవానికి ఈ ఆటను వరుసగా రెండు మ్యాచ్‌లు ఆడితే ఎంతటి బలాడ్యుడైనా అలసిపోవాల్సిందే. కాళ్లను అదే పనిగా పైకి లేపి షాట్ ఆడాల్సి రావడమంటే మాటలు కాదు. కానీ తమకు మాత్రం వరుసగా రెండు మ్యాచ్‌లు ఆడినా అలసటనేది దరి చేరదని చెబుతున్నాడు.
ప్రాక్టీస్ చేయడానికి ఎవరూ లేకపోతే గోడకు బంతిని కొడుతూ ఆడుకుంటారు. జాతీయ స్థాయి పోటీల్లో 15 మందితో కూడిన మూడు జట్లు ఏపీ తరఫున పాల్గొంటాయి. వీరిలో బాగా ఆడే ఐదుగురిని ఒక టీమ్‌గా ఎంపిక చేసి రెగో ఈవెంట్‌లో ఆడిస్తారు. ఆయా వయసు కేటగిరీ జట్లలో నాగేంద్ర సోదరులు కూడా తప్పకుండా ఉంటారు.
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వెనుక నివసించే వీరు ఏ మాత్రం సమయం దొరికినా స్టేడియంలోనే గడుపుతుంటారు. ఫ్లయింగ్ కిక్, సీజర్ కట్, టో ట్యాప్ (అరికాలి పాదంతో బంతిని కొట్టడం) వంటి షాట్లతో రెచ్చిపోతారు. తండ్రి అనారోగ్యంతో ఇంటికే పరిమితం కాగా పెద్దవాడైన నాగేంద్రబాబు నగర పోలీసు కమిషనరేట్‌లో హోంగార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కానిస్టేబుల్ కావాలని ప్రయత్నం చేసినా చెస్ట్ సరిపోలేదు. ప్రస్తుతం డిస్టెన్స్‌లో డిగ్రీ ఫైనలియర్ చదువుతూ చెస్ట్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇద్దరు తమ్ముళ్లు కూడా ఇంటర్ పూర్తి చేశారు.
కొసమెరుపు: గతంలో ఎంసెట్‌లో సీటు దక్కించుకునేందుకు స్పోర్ట్స్ కేటగిరీ కింద ఈ ఆటను కూడా పరిగణనలోకి తీసుకునేవారు. ప్రస్తుతం ఆ అవకాశాన్ని తొలగించారు. దశాబ్దకాలంగా ఒళ్లు హూనం చేసుకుని ఆడి చదువు కీలక దశకు చేరిన సమయంలో ఈ ఆట అక్కరకు రాకపోవడం వీరికి ఊహించని పరిణామమే. అయినప్పటికీ ఈ త్రయానికి సెపక్‌తక్రాపై మమకారం, మక్కువ తగ్గకపోవడం విశేషం.
సోదరత్రయం సాధించిన పతకాలు
కొమ్ము నాగేంద్రబాబు: సబ్ జూనియర్, జూనియర్ స్థాయి పోటీల్లో పాల్గొన్న తొలి సారే రాష్ట్ర జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2004లో ఒడిశాలో జరిగిన సబ్ జూనియర్ నేషనల్స్‌లో రజతం, 2006లో చండీగఢ్‌లో సబ్ జూనియర్ నేషనల్స్‌లో రెండు రజత పతకాలు కైవసం చేసుకున్నాడు. 2007లో రాజస్థాన్‌లో జరిగిన జూనియర్ నేషనల్స్‌లో, 2008లో కర్ణాటకలో జరిగిన నేషనల్స్‌లో వరుసగా రెండు రజత పతకాలు సాధించాడు. 2009లో అసోంలో జరిగిన సీనియర్ నేషనల్స్‌లో, 2010లో జార్ఖండ్‌లో జరిగిన జాతీయ క్రీడల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
క్రాంతి: 2006లో ఢిల్లీలో జరిగిన సబ్ జూనియర్ నేషనల్స్‌లో రజతం, 2007లో గోవాలో జరిగిన సబ్ జూనియర్ నేషనల్స్‌లోరజతం, 2009లో హైదరాబాద్ లో జరిగిన సబ్ జూనియర్ నేషనల్స్‌లో రెండు స్వర్ణ పతకాలు కైవసం చేసుకోవడమే కాకుండా బెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు.
సాయిప్రభు: 2012లో కర్నూలులో జరిగిన అంతర్ జిల్లా చాంపియన్‌షిప్‌లో తృతీయ స్థానం పొందాడు. 2012లో రాజస్థాన్‌లో జరిగిన 16వ జూనియర్ నేషనల్స్‌లో కాంస్య పతకం సాధించాడు.