భారత స్క్వాష్ స్టార్ సౌరవ్ ఘోషాల్ వరుసగా ఐదో ఆసియా క్రీడల్లోనూ పతకంతో మెరిశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 37 ఏళ్ల సౌరవ్ 11–9, 9–11, 5–11, 7–11తో ఇఐన్ యో ఎన్జీ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయి రజత పతకం దక్కించుకున్నాడు.
2006 దోహా ఆసియా క్రీడల్లో అరంగేట్రం చేసి కాంస్యం నెగ్గిన సౌరవ్.. ఆ తర్వాత 2010లో కాంస్యం, 2014లో రజతం, 2018లో కాంస్యం సాధించాడు. తొలిసారి ప్రవేశపెట్టిన మిక్స్‌డ్ డబుల్స్‌లో దీపిక పల్లికల్–హరీందర్‌పాల్ జోడీ (భారత్) స్వర్ణ పతకం గెలిచింది. ఫైనల్లో దీపిక–హరీందర్‌పాల్ ద్వయం 11–10, 11–10తో ఐఫా బింతి అజ్మన్–కమాల్ (మలేసియా) జంటపై నెగ్గింది.
రెజ్లర్ అంతిమ్‌కు కాంస్యం
మహిళల రెజ్లింగ్‌లో భారత రైజింగ్ స్టార్ అంతిమ్ పంఘాల్ కాంస్య పతకం గెలిచింది. 53 కేజీల విభాగం కాంస్య పతక బౌట్‌లో 19 ఏళ్ల అంతిమ్ 3–1తో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బొలోర్‌తుయా బత్‌ఒచిర్ (మంగోలియా)పై సంచలన విజయం సాధించింది. భారత్‌కే చెందిన పూజా గెహ్లోత్ (50 కేజీలు) కాంస్య పతక బౌట్‌లో 2–9తో కెయునిమ్‌జేవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో... మాన్సి అహ్లావత్ కాంస్య పతక బౌట్‌లో 70 సెకన్లలో సొబిరోవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయారు.
మరోవైపు భారత మహిళల హాకీ జట్టు సెమీఫైనల్లో 0–4 గోల్స్ తేడాతో చైనా జట్టు చేతిలో ఓడిపోయింది. శనివారం జరిగే కాంస్య పతక మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ ఆడుతుంది. పురుషుల మారథాన్ రేసులో (42.195 కిలోమీటర్లు) భారత అథ్లెట్లు మాన్ సింగ్ ఎనిమిదో స్థానంలో (2గం:16ని:59 సెకన్లు), అప్పచంగడ బెలియప్ప (2గం:20ని:52 సెకన్లు) 12వ స్థానంలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment