పాకిస్తాన్ క్రికెటర్ ఉస్మాన్ కాదిర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై తాను అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహించబోవడం లేదని తెలిపాడు. దేశం తరఫున ఆడే గొప్ప అవకాశం తనకు దక్కిందని.. తన ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. ఒడిదుడుకుల్లో తనకు మద్దతుగా నిలిచిన అభిమానుల రుణం తీర్చుకోలేనని ఉద్వేగానికి లోనయ్యాడు.
పాకిస్తాన్ మేటి స్పిన్నర్లలో ఒకడైన అబ్దుల్ కాదిర్ కుమారుడే ఉస్మాన్ కాదిర్. ఈ లెగ్ స్పిన్నర్ 2020లో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. గతేడాది అక్టోబరులో ఆసియా క్రీడల్లో భాగంగా బంగ్లాదేశ్‌తో టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు ఆఖరిసారిగా ఆడాడు.
ఇప్పటి వరకు కేవలం ఒక వన్డే ఆడిన ఉస్మాన్ కాదిర్ ఖాతాలో ఒక వికెట్ ఉంది. ఇక పాక్ తరఫున ఆడిన 25 టీ20లలో అతడు 31 వికెట్లు పడగొట్టగలిగాడు. అయితే, 31 ఏళ్ల ఉస్మాన్‌కు జాతీయ జట్టులో ఎప్పుడూ సుస్థిర స్థానం దక్కలేదు. దీంతో కలత చెందిన అతడు.. తాను ఇక పాకిస్తాన్‌కు ఆడనని.. ఆస్ట్రేలియా తరఫున ఆడాలనుకుంటున్నానని 2018లో వ్యాఖ్యానించాడు.
ఇక తాజాగా.. రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగానూ పాకిస్తాన్ క్రికెట్ వీడ్కోలు పలుకుతున్నానని ఉస్మాన్ పేర్కొనడం గమనార్హం. అంతేకాదు.. తాను జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతున్నానని.. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తాననంటూ ట్విస్టు ఇ వ్వడం విశేషం. ఏదేమైనా పాకిస్తాన్ జట్టుతో తనకున్న అనుబంధం మర్చిపోలేనని.. సహచర ఆటగాళ్లు, కోచ్‌లకు ధన్యవాదాలు తెలిపాడు. కాగా ఉస్మాన్ కాదిర్ ఇటీవల చాంపియన్స్ వన్డే కప్‌లో డాల్ఫిన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.
Comments
Please login to add a commentAdd a comment