ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను బలంగా దెబ్బ కొట్టింది. పూల్ ఎ మ్యాచ్‌లో భారత్ 10–2 గోల్స్ తేడాతో పాక్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. అంతర్జాతీయ హాకీలో పాక్‌పై భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. 2017లో నమోదు చేసిన 7–1 స్కోరును భారత్ ఇక్కడ తిరగరాసింది. భారత్ తరఫున కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ నాలుగు గోల్స్‌తో చెలరేగాడు.
హర్మన్ 11వ, 17వ, 33వ, 34వ నిమిషాల్లో గోల్స్ కొట్టాడు. వరుణ్ కుమార్ 41వ, 54వ నిమిషాల్లో గోల్స్ సాధించగా...లలిత్ (49వ ని.), షంషేర్ (46వ ని.), సుమీత్ (30వ ని.), మన్‌దీప్ సింగ్ (8వ ని.) ఒక్కో గోల్ చేశారు. పాకిస్తాన్ తరఫున అబ్దుల్ వహీద్ రానా (45వ ని.), సూఫియాన్ ఖాన్ (38వ ని.) ఒక్కో గోల్ నమోదు చేశారు.
బాక్సింగ్‌లో మూడు పతకాలు ఖాయం
ముగ్గురు భారత బాక్సర్లు సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టి కనీసం కాంస్యాన్ని ఖాయం చేసుకున్నారు. 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్ సెమీస్ చేరింది. క్వార్టర్స్‌లో ఆమె 4–1తో జైనాశికర్‌బెకొవా (కజకిస్తాన్)ను ఓడించింది. తాజా ఫలితంతో ప్రీతి పారిస్ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించడం విశేషం. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతకం విజేత లవ్లీనా బొర్గొహైన్ (75 కేజీలు), పురుషుల విభాగంలో నరేందర్ (92 కేజీలు) సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టారు. క్వార్టర్స్‌లో లవ్లీనా 5–0తో సియోంగ్ సుయాన్ (కొరియా)పై, నరేందర్ 5–0తో ఇమాన్ దిలావర్ (ఇరాన్)ను ఓడించారు.
మీరాబాయి చానుకు నాలుగో స్థానం
టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చాను అనూహ్య ఓటమిని ఎదుర్కొంది. వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల కేటగిరీలో చాను నాలుగో స్థానంలో నిలిచింది. మొత్తం 191 కేజీల బరువెత్తిన చాను కాంస్యం కోసం ప్రయత్నిస్తూ చివరి ప్రయత్నంలో దురదృష్టవశాత్తూ గాయపడింది. 117 కేజీల క్లీన్ అండ్ జర్క్ లక్ష్యంగా ప్రయత్నిoచి వెనుక వైపుకు పడిపోయింది. దాంతో కోచింగ్ సిబ్బంది ఆమెను బయటకు తీసుకుపోవాల్సి వచ్చింది. వైద్య పరీక్షలు జరిపి ఆమె గాయం తీవ్రతను తెలుసుకుంటామని భారత అధికారులు వెల్లడించారు.
ఫైనల్స్‌కు జ్యోతి క్వాలిఫై
భారత అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యెర్రాజి ఆసియా క్రీడల మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ఫైనల్స్‌కు అర్హత సాధించింది. హీట్స్‌ను ఆమె 13.03 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. మరో భారత అథ్లెట్ నిత్య రామ్‌రాజ్ కూడా ఇదే ఈవెంట్‌లో ఫైనల్స్‌కు క్వాలిఫై అయింది.
లాంగ్‌జంప్‌లో కామన్వెల్త్ రజత పతక విజేత మురళీ శ్రీశంకర్ కూడా ముందంజ వేశారు. 7.97 మీటర్లు దూకిన మురళి అర్హత మార్క్ (7.90 మీటర్లు)ను సునాయాసంగా దాటి ఫైనల్స్‌కు చేరాడు. జెస్విన్ ఆల్డ్రిన్ కూడా భారత్ తరఫున ఫైనల్లో పోటీ పడనున్నాడు. 1500 మీటర్ల పరుగులో భారత్ తరఫున జిన్సన్ జాన్సన్, అజయ్ కుమార్ బరిలోకి దిగుతారు.
Comments
Please login to add a commentAdd a comment