
కమిన్స్ (Photo Courtesy: BCCI/IPL)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తొలి ఓటమి ఎదురైంది. క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్‌లో తమ ఆరంభ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన కమిన్స్ బృందం.. రెండో మ్యాచ్‌లో మాత్రం పేలవ ప్రదర్శన కనబరిచింది. బ్యాటర్లు, బౌలర్ల సమిష్టి వైఫల్యం కారణంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో పరాజయం చవిచూసింది.
ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) మాట్లాడుతూ.. ఉప్పల్ పిచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మొన్నటికి.. ఇప్పటికి వికెట్ వేరుగా ఉంది. నిజానికి మేము మరికొన్ని పరుగులు చేయాల్సింది.
ప్రపంచంలోనే అత్యుత్తమ పిచ్
గత మ్యాచ్‌లోని పిచ్ ప్రపంచంలోనే అత్యుత్తమ పిచ్. ఇక ఈ మ్యాచ్‌లో మేము 190 పరుగులు చేయగలడం సానుకూల అంశమే. ఈరోజు వికెట్ బాగానే ఉంది. దీనిని రెండో అత్యుత్తమ పిచ్‌గా చెప్పవచ్చు’’ అని పేర్కొన్నాడు.
కాగా సొంతమైదానం ఉప్పల్‌లో తొలుత రాజస్తాన్ రాయల్స్‌తో తలపడిన సన్‌రైజర్స్.. 286 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో రాయల్స్‌ను 242 పరుగులకే కట్టడి చేసి.. 44 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. కానీ గురువారం సీన్ రివర్స్ అయింది.
లక్నోతో మ్యాచ్‌లో టాస్ ఓడిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ప్రత్యర్థి జట్టు బౌలర్ల ధాటికి రైజర్స్ 190 పరుగులకే పరిమితమైంది. ట్రవిస్ హెడ్ (28 బంతుల్లో 47), నితీశ్ రెడ్డి (28 బంతుల్లో 32), క్లాసెన్ (17 బంతుల్లో 26), కమిన్స్ (4 బంతుల్లో 18) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. యువబ్యాటర్ అనికేత్ వర్మ (Aniket Verma) మాత్రం అద్భుత ఇన్నింగ్స్(13 బంతుల్లో 36) ఆడాడు. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ ఉత్తమంగా (4/34) రాణించాడు.
3⃣6⃣ runs
5⃣ massive sixes 🔥
Aniket Verma's explosive cameo gave #SRH the much-needed late flourish 🧡
Updates ▶ https://t.co/X6vyVEvxwz#TATAIPL | #SRHvLSG | @SunRisers pic.twitter.com/21gh3f2jZR— IndianPremierLeague (@IPL) March 27, 2025
ఇక లక్ష్య ఛేదనకు దిగిన లక్నోను రైజర్స్ బౌలర్ల కట్టడి చేయలేకపోయారు. ఆరంభంలోనే ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్(1)ను అవుట్ చేసినా.. మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 52), నికోలస్ పూరన్(26 బంతుల్లో 72)ల దూకుడుకు కళ్లెం వేయలేకపోయారు. వీరి అద్భుత అర్ధ శతకాల కారణంగా లక్నో 16.1 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయి గెలుపొందింది.
లక్నో బ్యాటర్లు అద్భుతంగా ఆడారు
ఈ క్రమంలో ఓటమి తర్వాత ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘లక్నో బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. వాళ్ల బౌలర్లు కూడా రాణించారు. ఏదేమైనా మేము 190 పరుగులు స్కోరు చేయడం మంచి విషయమే. ప్రతి మ్యాచ్ సరికొత్తగానే ఉంటుంది. గత మ్యాచ్లో ఇషాన్ కిషన్ శతకంతో చెలరేగాడు.
ఈసారి అతడు డకౌట్ అయ్యాడంటే.. అది లక్నో బౌలర్ల ప్రతిభ వల్లే. వారు మాకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు. ఇలాంటివి ఆటలో సహజం. దీనికే మేము కుంగిపోవాల్సిన పనిలేదు. మా జట్టులో ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్నారు. వారిలో ఒకరో ఇద్దరో కచ్చితంగా ప్రభావం చూపిస్తారు. అయితే, ఈరోజు మేము మరింత గొప్పగా ఆడాల్సింది.
తదుపరి మ్యాచ్‌పై దృష్టి పెడతాం
టోర్నీలో ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలే ఉన్నాయి. ఈ పరాజయం నుంచి త్వరగా కోలుకుని.. తదుపరి మ్యాచ్‌పై దృష్టి పెడతాం’’ అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో కమిన్స్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటంతో పాటు.. కీలకమైన మార్ష్, పూరన్‌ల వికెట్లను దక్కించుకున్నాడు.
ఇక తదుపరి సన్‌రైజర్స్ ఆదివారం (మార్చి 30) ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతుంది. ఇందుకు ఢిల్లీ సెకండ్ హోం గ్రౌండ్ విశాఖపట్నంలోని డాక్టర్ వైస్సార్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదిక.
చదవండి: BCCI: అతడికి ఈసారి టాప్ గ్రేడ్.. తొలిసారి వీళ్లకు వార్షిక కాంట్రాక్టులు!