పాకిస్తాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్ అరంగేట్రంలోనే (వన్డే) రికార్డుల్లోకెక్కాడు. అబ్రార్ తొలి మ్యాచ్‌లోనే తమ దేశ దిగ్గజ బౌలర్ అబ్దుల్ ఖాదిర్ సరసన చేరాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో (రెండో వన్డే) 4 వికెట్లు తీసిన అబ్రార్, అబ్దుల్ ఖాదిర్‌తో పాటు ఎలైట్ గ్రూప్‌లో చేరాడు.
1984లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో అబ్దుల్ ఖాదిర్ కూడా తన అరంగేట్రంలో 4 వికెట్లు తీశాడు. పాక్ తరఫున వన్డే అరంగేట్రంలో ఇవే అత్యధిక వికెట్లు. అబ్దుల్ ఖాదిర్, అబ్రార్ అహ్మద్‌తో పాటు జాకిర్ ఖాన్, సర్ఫరాజ్ నవాజ్ కూడా పాక్ తరఫున వన్డే అరంగేట్రంలో నాలుగు వికెట్లు తీశారు.
కాగా, జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో పాక్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి వన్డేలో జింబాబ్వే చేతిలో అనూహ్య ఓటమిని ఎదుర్కొన్న పాక్, ఈ మ్యాచ్‌లో గెలుపొంది ప్రతీకారం తీర్చుకుంది. ఈ గెలుపుతో పాక్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది.
విజృంభించిన అబ్రార్.. 145 పరుగులకే కుప్పకూలిన జింబాబ్వే
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 32.3 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటైంది. అబ్రార్ అహ్మద్ (8-2-33-4), అఘా సల్మాన్ (7-0-26-3), సైమ్ అయూబ్ (4-0-16-1), ఫైసల్ అక్రమ్ (5.3-0-19-1) జింబాబ్వే ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో డియాన్ మైర్స్ (33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
53 బంతుల్లో శతక్కొటిన సైమ్ అయూబ్
146 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. 18.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ఓపెనర్ సైమ్ అయూబ్ విధ్వంసకర సెంచరీతో పాక్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో అయూబ్ 53 బంతుల్లో శతక్కొట్టాడు. పాక్ తరఫున వన్డేల్లో ఇది మూడో ఫాస్టెస్ట్ సెంచరీ (జాయింట్).
ఈ మ్యాచ్‌లో సైమ్ ఓవరాల్‌గా 62 బంతులు ఎదుర్కొని 17 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ 48 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో వన్డే నవంబర్ 28న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment