పాకిస్తాన్ రిస్ట్ స్పిన్నర్ సుఫియాన్ ముఖీమ్ చరిత్రపుటల్లోకెక్కాడు. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో ముఖీమ్ 2.4 ఓవర్లలో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. పాకిస్తాన్ తరఫున టీ20ల్ల ఇవే అత్యుత్తమ గణాంకాలు. గతంలో ఉమర్ గుల్ రెండు సార్లు 5/6 గణాంకాలు నమోదు చేశాడు.
పాక్ తరఫున టీ20ల్లో 5 వికెట్ల ఘనత సాధించిన మూడో బౌలర్‌గానూ ముఖీమ్ రికార్డుల్లోకెక్కాడు. ముఖీమ్, గుల్, ఇమాద్ వసీం (5/14) పాక్ తరఫున టీ20ల్లో 5 వికెట్ల ఘనత సాధించారు. ముఖీమ్ తన ఏడో టీ20లోనే ఈ ఘనత సాధించడం విశేషం.
ముఖీమ్ దెబ్బకు జింబాబ్వే టీ20ల్లో తమ అత్యల్ప స్కోర్‌ను (57) నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో పాక్ మరో 87 బంతులు మిగిలుండగానే జింబాబ్వే నిర్దేశించిన లక్ష్యాన్ని (58) ఛేదించింది. టీ20ల్లో బంతుల పరంగా పాక్‌కు ఇది భారీ విజయం.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 12.4 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌటైంది. ముఖీమ్ 5, అబ్బాస్ అఫ్రిది 2, అబ్రార్ అహ్మద్, హరీస్ రౌఫ్, సల్మాన్ అఘా తలో వికెట్ పడగొట్టారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (21), మరుమణి (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 37 పరుగులు జోడించారు. అనంతరం 20 పరుగుల వ్యవధిలో జింబాబ్వే 10 వికెట్లు కోల్పోయింది.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్ 5.3 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. సైమ్ అయూబ్ (36), ఒమైర్ యూసఫ్ (22) అజేయంగా నిలిచారు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ పాకిస్తాన్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో టీ20 డిసెంబర్ 5న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment