ఏషియన్ గేమ్స్ 2023లో పసికూన హాంగ్‌కాంగ్ పటిష్టమైన పాకిస్తాన్‌కు చుక్కలు చూపించింది. హాంగ్‌కాంగ్ మ్యాచ్ అయితే గెలవలేపోయింది కాని, పాక్ బ్యాటింగ్‌ను కకావికలం చేసి నామమాత్రపు స్కోర్‌కే పరిమితం చేసింది. 8.5 ఓవర్లలో కేవలం 54 పరుగులకే సగం పాక్ వికెట్లు పడగొట్టిన హాంగ్‌కాంగ్ బౌలర్లు.. ఆ తర్వాత పాక్ లోయర్ ఆర్డర్ బ్యాటర్ ఆమెర్ జమాల్‌ను (16 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కట్టడి చేయడంలో విఫలం కావడంతో పాక్ ఓ మోస్తరు చేయగలిగింది. అయితే ఛేదనలో బ్యాటర్లు చేతులెత్తేయడంతో హాంగ్‌కాంగ్ ఓటమిపాలైంది. ఈ గెలుపుతో పాక్ సెమీ ఫైనల్‌కు చేరుకోగా.. హాంగ్‌కాంగ్ ఇంటిదారి పట్టింది.
ఇవాళ ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన క్వార్టర్ ఫైనల్-2లో టాస్ ఓడి హాంగ్‌కాంగ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. ఇన్నింగ్స్ ఆరంభంలో కష్టాల్లో పడినప్పటికీ, ఆతర్వాత తేరుకుని నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. పాక్‌కు ఆమెర్ జమాల్ (41) ఆదుకోగా.. ఆసిఫ్ అలీ (25), అరాఫత్ మిన్హాస్ (25), ఒమర్ యూసుఫ్ (21), ఖుష్దిల్ (13), రోహైల్ నజీర్ (13), ఖాసిమ్ అక్రమ్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. హాంగ్‌కాంగ్ బౌలర్లలో ఆయేష్ శుక్లా (4-0-49-4) పాక్ టాపార్డర్‌ను గడగడలాడించగా.. మెహమ్మద్ గజన్ఫార్ (4-0-26-3), అనాస్ ఖాన్ (3-0-18-2), ఎహసాన్ ఖాన్ (4-0-28-1) వికెట్లు తీశారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హాంగ్‌కాంగ్.. ఖుష్దిల షా (4-0-13-3), అరాఫత్ మిన్హాస్ (4-0-19-2), సుఫియాన్ ముఖీమ్ (4-1-11-2), ఖాసిమ్ అక్రమ్ (1.5-0-6-2) ధాటికి 18.5 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌటై, 68 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. హాంగ్‌కాంగ్ ఇన్నింగ్స్‌లో బాబర్ హయత్ (29) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఎహసాన్ ఖాన్ (16 నాటౌట్), నియాజ్ అలీ (12), నిజఖత్ ఖాన్ (11), శివ్ మాథుర్ (100 రెండంకెల స్కోర్లు చేశారు.
కాగా, ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో భారత్.. నేపాల్‌ను మట్టికరిపించి, సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో భారత్.. క్వార్టర్ ఫైనల్-4 (బంగ్లాదేశ్ వర్సెస్ మలేషియా) విజేతను ఎదుర్కొంటుంది. పాక్ సెమీస్‌లో క్వార్టర్ ఫైనల్-3 (శ్రీలంక వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్) విజేతతో తలపడుతుంది. భారత్, పాక్‌లు సెమీస్‌ను దాటితే స్వర్ణ పతకం కోసం ఫైనల్లో తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment