ఆసియా కప్-2023లో భాగంగా పసికూన నేపాల్‌తో ఇవాళ (సెప్టెంబర్ 4) జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు తేలిపోయారు. ఎంత మాత్రం అనుభవం లేని నేపాల్‌ను 200 పరుగుల మార్కును దాటనిచ్చేలా చేశారు. ఇది ఓ రకంగా చెప్పాలంటే భారత బౌలర్ల వైఫల్యమే. అంతకుముందు మ్యాచ్‌లో పాక్ బౌలర్లు నేపాల్‌ను 104 పరుగులకు కట్టడి చేస్తే.. టీమిండియా బౌలర్లు మాత్రం అందుకు డబుల్ స్కోర్‌ను సమర్పించుకుని, దారుణంగా నిరాశపరిచారు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్‌లో లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. పస లేని భారత పేస్ విభాగాన్ని నేపాల్ బ్యాటర్లు ఆడుకున్నారు. అనుభవజ్ఞుడని చెప్పుకునే షమీ 7 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే తీసి తుస్సుమనిపించాడు. వన్డే టాప్-10 బౌలర్లలో ఒకడైన సిరాజ్ వికెట్లు తీశాడే తప్పిస్తే, అతని బౌలింగ్ కూడా నాసిరకంగానే కనిపించింది. శార్దూల్ తూతూ మంత్రంగా బౌలింగ్ చేయగా.. హార్దిక్, కుల్దీప్, జడేజాలు పర్వాలేదనిపించారు. అయినా ఇది వారి స్థాయికి తగ్గ ప్రదర్శన అని చెప్పలేం. మొత్తంగా చూస్తే నేపాల్ బ్యాటర్లు అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి టీమిండియాకు గట్టి సవాలే (231) విసిరారు.
ఇదే జట్టుపై దాయాది బౌలర్ల ప్రదర్శనను ఓసారి పరిశీలిస్తే.. టీమిండియా బౌలర్ల లోపాలు తేటతెల్లమవుతాయి. పాక్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించి, పసికూనను ఉక్కిరిబిక్కిరి చేశారు. తొలుత పేసర్లు షాహీన్ అఫ్రిది (2/27), హరీస్ రౌఫ్ (2/16), నసీం షా (1/17) తమ ప్రతాపం చూపించగా.. టెయిలెండర్లపై షాదాబ్ ఖాన్ (4/27), మహ్మద్ నవాజ్ (1/13) విరుచుకుపడ్డారు. నేపాల్ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్లు (29 పరుగుల లోపే) చేశారంటే పాక్ బౌలర్లు ఏ రేంజ్‌లో రెచ్చిపోయారో అర్ధమవుతుంది.
ఇలాంటి బౌలింగ్ అటాక్‌ను పెట్టుకుని ఆసియా కప్‌ను కాని, వరల్డ్‌కప్‌ను కాని గెలవాలనుకోవడం కరెక్ట్ కాదన్నది భారత క్రికెట్ అభిమానుల అభిప్రాయం. పేస్‌లో పదును పెంచి, స్పిన్‌లో నాణ్యతను పెంచితే కానీ పెద్ద జట్లపై టీమిండియా పైచేయి సాధించలేదన్నది సగటు భారత అభిమాని భావన. మరి బుమ్రా చేరికతో అయినా మన బౌలింగ్ విభాగం మెరుగుపడుతుందేమో వేచి చూడాలి.
ఇదిలా ఉంటే, వరుణుడి ఆటంకాల నడుమ సాగుతున్న భారత్-నేపాల్ మ్యాచ్‌లో నేపాల్ 230 పరుగులకు ఆలౌటైంది. నేపాల్ ఇన్నింగ్స్‌లో ఆసిఫ్ షేక్ (58), సోంపాల్ కామీ (48), కుషాల్ భుర్టెల్ (38), దీపేంద్ర సింగ్ (29), గుల్షన్ ఝా (23) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. షమీ, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. భారత్ బ్యాటింగ్ ప్రారంభించిన 13 బంతుల అనంతరం వర్షం మళ్లీ మొదలైంది. 2.1 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 17/0గా ఉంది. రోహిత్ (4), గిల్ (12) క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment