ఏషియన్ గేమ్స్‌లో క్రికెట్‌ను తొలిసారి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. పురుషులతో పాటు మహిళల విభాగంలో ఈ దఫా ఆసియా క్రీడలు జరుగనున్నాయి. చైనాలోని హాంగ్‌ఝౌ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్-2023 మహిళల క్రికెట్ పోటీల్లో భారత్, పాకిస్తాన్ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఇవాళ (సెప్టెంబర్ 21) జరిగిన క్వార్టర్ ఫైనల్ 1, 2 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడంతో ఈ రెండు జట్లు తదుపరి దశకు అర్హత సాధించాయి.
మెరుగైన సీడింగ్ ఆధారంగా విజేతగా భారత్..
భారత్-మలేసియా మధ్య జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్ వర్షం కారణంగా ఫలితం తేలకపోవడంతో మెరుగైన సీడింగ్ ఆధారంగా భారత్‌ను విజేతగా ప్రకటించారు. వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం భారీ వర్షం కురిసింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 173 పరుగుల భారీ స్కోర్ చేసింది. షఫాలీ వర్మ (67), జెమీమా రోడ్రిగెజ్ (47 నాటౌట్) రాణించారు. అనంతరం మలేసియా ఇన్నింగ్స్ మొదలయ్యాక వర్షం మొదలుకావడంతో కేవలం 2 బంతుల ఆట మాత్రమే సాగింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు భారత్‌ను విజేతగా ప్రకటించారు.
ఒక్క బంతి కూడా ఆడకుండానే సెమీస్‌లో పాక్..
ఏషియన్ గేమ్స్ మహిళల క్రికెట్ పోటీల్లో పాకిస్తాన్ జట్టు ఒక్క బంతి కూడా ఆడకుండానే సెమీస్‌కు చేరుకుంది. ఇండోనేషియాతో ఇవాళ (సెప్టెంబర్ 21) జరిగిన సెకెండ్ క్వార్టర్ ఫైనల్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. ఇండోనేషియాతో పోలిస్తే మెరుగైన సీడింగ్ ఉందన్న కారణంగా పాక్ ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచింది. తద్వారా భారత్ తర్వాత సెమీస్‌కు అర్హత సాధించిన రెండో జట్టుగా నిలిచింది.
సెమీస్‌లో ఎవరెవరు..?
తొలి క్వార్టర్ ఫైనల్ విజేత భారత్.. సెప్టెంబర్ 24న జరిగే తొలి సెమీఫైనల్లో క్వార్టర్ ఫైనల్ 4 (బంగ్లాదేశ్ వర్సెస్ హాంగ్‌కాంగ్) విజేతను ఎదుర్కొంటుంది. అలాగే రెండో క్వార్టర్ ఫైనల్లో విజేత అయిన పాక్.. అదే సెప్టెంబర్ 24న జరిగే రెండో సెమీఫైనల్లో క్వార్టర్ ఫైనల్ 3 (శ్రీలంక వర్సెస్ థాయ్‌లాండ్) విజేతను ఢీకొంటుంది. క్వార్టర్ ఫైనల్ 3, 4 మ్యాచ్‌లు రేపు (సెప్టెంబర్ 22)న జరుగనున్నాయి.
ఫైనల్లో భారత్ వర్సెస్ పాక్..?
ఏషియన్ గేమ్స్ ఫైనల్లో భారత్, పాక్‌లు తలపడే అవకాశం ఉంది. సెమీస్‌లో ఈ రెండు జట్లు తమ తమ ప్రత్యర్ధులపై విజయాలు సాధిస్తే, సెప్టెంబర్ 25న జరిగే ఫైనల్లో ఎదురెదురుపడే ఛాన్స్ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment